‘తండేల్’ తరవాత నాగచైతన్య కొత్త సినిమా షురూ చేసేశాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త సినిమా పట్టాలెక్కించాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం రూ.5 కోట్ల వ్యయంతో కళా దర్శకుడు. నాగేంద్ర ఓ భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో 20 నిమిషాల నిడివి ఉన్న దృశ్యాలు ఈ సెట్లోనే రూపొందిస్తారు.
ట్రజర్ హంట్, మైథలాజికల్ అంశాలున్న థ్రిల్లర్ కథ ఇది. ‘వృషకర్మ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదే విషయమై దర్శకుడు కార్తీక్ దండు స్పందించారు. ”ఈ సినిమా కోసం మూడు టైటిల్స్ అనుకొంటున్నాం. అందులో వృక్షకర్మ కూడా ఒకటి. మరో రెండు మంచి టైటిల్స్ ఉన్నాయి. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేస్తాం. ‘విరూపాక్ష’లా టైటిల్ క్యాచీగా ఉండాలి. జనంలోకి త్వరలో వెళ్లిపోవాలి. అలాంటి టైటిల్ కోసం అన్వేషిస్తున్నాం” అని చెప్పారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. తను ఆర్కియాలజీ నిపుణురాలిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చైతూ లుక్ కూడా రిఫ్రెషింగ్ గా అనిపిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగం పంచుకొంది. కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడే. కాబట్టి స్క్రీన్ ప్లేలో ఆయన హ్యాండ్ కూడా ఈ సినిమాపై ఉంది.