ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడికి వైసీపీ బూతుల కుట్రను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ మరణించిన వారి తల్లిదండ్రులపై కూడా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతలు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయంగా విమర్శలు చేయాల్సింది పోయి, ఏమాత్రం సంబంధం లేని కుటుంబ సభ్యులను, అది కూడా పరమపదించిన వారిని దూషించడంపై పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహా బూతుల సంస్కృతి తో రాజకీయాలను భ్రష్టుపట్టించిన వీరు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగించడం గమనార్హం. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన కల్తీ నెయ్యి వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ వ్యూహాత్మకంగా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దాడులు చేస్తే, ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు ప్రతిదాడికి దిగుతాయని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి అసలు చర్చను పక్కదారి పట్టించవచ్చని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు పార్లమెంటరీ భాషకు నిలయంగా ఉన్న అసెంబ్లీలో సైతం చంద్రబాబు భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆయన్ను కంటతడి పెట్టించిన సందర్భాన్ని ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు జోగి రమేష్ వంటి నేతలు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మరింత రెచ్చిపోవడం యాదృచ్ఛికం కాదు. ఖచ్చితంగా కుట్రేనని అనుకోవాలి. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి కుటుంబ గౌరవంతో ఆడుకోవడం వైసీపీ మార్క్ పాలిటిక్స్ గా మారింది.
కేవలం రాజకీయాల కోసం చనిపోయిన వారిని కూడా వదలకుండా దూషిస్తున్న నేతలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి వారికి తగిన ట్రీట్ మెంట్ ఇవ్వకపోతే, భవిష్యత్తులో ఈ బూతుల సంస్కృతి మరింత పెరిగి, ఏపీ రాజకీయాల్లో సంప్రదాయం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
