తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ఏమాత్రం శాస్త్రీయంగా లేదని, దీనివల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. గత పాలకులు ప్రజల విజ్ఞప్తులను, భౌగోళిక పరిస్థితులను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం అదృష్ట సంఖ్యల ఆధారంగానే జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. దీనివల్ల ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయని, ప్రజలు తమ పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత జిల్లాల ఏర్పాటు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తెలిపారు. ప్రజా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని మరోసారి శాస్త్రీయ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న లోపాలు, ప్రజా సమస్యలపై అధికారుల నుంచి ప్రభుత్వం ప్రత్యేక నివేదికలను కోరిందని, ఆ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆయన వెల్లడించారు.
జిల్లాల మార్పులు లేదా చేర్పుల విషయంలో ప్రభుత్వం ఎటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోదని మంత్రి హామీ ఇచ్చారు. అధికారుల నివేదిక అందిన తర్వాత, దానిపై మంత్రివర్గంలో లోతుగా చర్చించి, అనంతరం శాసనసభలో సభ్యులందరి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ అనేది కేవలం అంకెల్లో కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు చేరువగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుందని పొంగులేటి స్పష్టం చేశారు.
