కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రకరకాల మార్గాల్లో ఉద్యమాలు చేపడుతున్నారు. ఇచ్చిన మాటను అటకెక్కించేసి ఉద్యమాన్ని ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నాలూ చూస్తూనే ఉన్నాం. గడచిన ఏడాదిగా కాపుల రిజర్వేషన్ల ఉద్యమం సాగుతూనే ఉంది! సాగుతున్న సుదీర్ఘ పోరాటం ఎంతవరకూ ఫలించిందనేది కాసేపు పక్కన పెడితే… కాపుల ఉద్యమంలో చీలికలు స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తున్నాయి! కాపుల్లో తాము మెజారిటీ సంఖ్యలో ఉన్నామంటూ బలిజలు చీలిపోతున్నారు! తమకు రాజకీయ గుర్తింపు కావాలంటూ తాజాగా నినదిస్తున్నారు. దీంతో కాపు ఉద్యమంలో ఇదో చీలికగా కనిపిస్తోంది.
కాపుల్లో ఐదు ఉపకులాలున్నాయి. తూర్పుకాపు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి… ఇవే ఆ ఐదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తూర్పు కాపులు ఉంటారు. మెజారిటీ కాపుల సంఖ్య కోస్తా జిల్లాల్లో ఎక్కువ ఉంది. ఇక, రాయలసీమ ప్రాంతంలో బలిజల శాతం ఎక్కువ. బలిజ నాయకుల లెక్కలేంటంటే… ఆంధ్రాలో కాపుల కంటే బలిజల జనాభా రెండు శాతం ఎక్కువగా ఉందంటున్నారు. సంఖ్యాపరంగా తమకే ఆధిపత్యం ఉన్నా రాజకీయంగా తమకంటూ ఉనికి ఉండటం లేదన్నది వారి వాదన. కాపులతో పోల్చుకుంటే తాము అన్నిరకాలుగా వెనుకబాటుతనానికి గురౌతున్నామంటున్నారు. ఇన్నాళ్లూ కాపుల నాయకత్వం కిందనే తాము ఉండాల్సి వచ్చిందని బలిజ నాయకులు అంటున్నారు. ఒక్క రాయలసీమ ప్రాంతం నుంచే కాపుల్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనీ, ఇక్కడ అత్యధికులు బలిజలు ఉన్నాసరే ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
అయితే, రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో అందరూ కలిసే ఉందామని చెబుతూనే… తమకు ప్రాధాన్యత పెంచాలన్నది బలిజ నాయకుల డిమాండ్. బలిజల ఆరోపణలపై కాపు నేతలు కూడా స్పందిస్తున్నారు. రిజర్వేషన్లంటూ వస్తే ముందుగా న్యాయం జరిగేది బలిజలకే అని కాపు నేతలు స్పందిస్తున్నారు. కాపులతో కలిసి ఉండటం వల్లనే తమకు గుర్తింపు రావడం లేదన్న వాదన అర్థం లేనిదని వారు అంటున్నారు. కలిసి పోరాడాలని పిలుపునిస్తున్నారు.
మొత్తానికి.. కాపుల ఉద్యమంలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. బలిజలు తమదారి తమది అన్నట్టుగా స్వరం ఎత్తుకున్నారు. చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి పెంచి, రిజర్వేషన్లను సాధించుకునే దిశగా ముద్రగడ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కాపుల ఉద్యమంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటోంది కూడా చూస్తూనే ఉన్నాం! ఈ తరుణంలో కాపుల్లోంచి కొత్త వాదన మొదలు కావడం ఉద్యమాన్ని నీరుగార్చే చర్యగానే చూడాల్సి వస్తోంది. రిజర్వేషన్లు సాధించేవరకూ బలిజలు ఎందుకు సైలెంట్ గా ఉండలేకపోతున్నారు..? ఇప్పటికిప్పుడు కాపు నేతల ఆధిపత్యం వారికి ఎలా గుర్తొచ్చింది..? ఓపక్క ప్రభుత్వంపై పోరాటం జరుగుతుంటే.. కాపుల ఆధిపత్యం అంటూ బలిజలు ఎందుకు స్వరం వినిపిస్తున్నట్టూ..? వీటికి జవాబులు ప్రశ్నల్లోనే ఉన్నాయి.