ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. ఒక DA మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు. వచ్చే జనవరిలో మరో డీఏ ఇస్తామన్నారు. ఒక్క డీఏ మంజూరు చేయడం వల్ల ప్రభుత్వంపై నెలకు రూ. 160 కోట్ల భారం పడుతుందని తెలిపారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ చేస్తామని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఓ ప్రమోషన్ క్లియర్ చేస్తున్నామన్నారు.
వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల ఉద్యోగులకు 34 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. 7000 కోట్ల రూపాయలు డీఏ బకాయిలు వచ్చాయని.. ఎక్సైజ్ లో భవిష్యత్తు ఆదాయంపైనా అప్పు తెచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలగకూడదనే ప్రయత్నం చేస్తున్నామని.. ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. ఎవరినీ కించపరిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లాలన్నారు.
రూ.51,452 కోట్లను ఎస్టాబ్లిష్ మెంట్ కోసమే వ్యయం చేస్తున్నాం. అంటే 91శాతం ఖర్చు ఎస్టాబ్లిష్మెంట్ కోసమే వ్యయం చేస్తున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలన్నీ గత ఐదేళ్లలో జాగ్రత్తపడ్డాయి. తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 39 శాతానికి ఈ వ్యయాన్ని తగ్గించుకున్నాయి… గత ఐదేళ్లలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్లే ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అనుత్పాదక వ్యయం కోసం ఖర్చు చేశారని దాని వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు.