తెలంగాణలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ దుమారాన్నే రేపుతోంది. జిల్లా కోసం, డివిజన్ కోసం ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. గద్వాల జిల్లా కోసం మాజీ మంత్రి డీకే ఆరుణ ఆందోళనను ముమ్మరం చేశారు. శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది. ఇందులో పలువురు మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు.
అంతా ఊహించినట్టే కాంగ్రెస్ ధర్నాలో తెరాస ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను డీకే అరుణ దుయ్యబట్టారు. గద్వాల జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను పదే పదే తిట్టడం ఆయన కూతురు కవితకు కోపం తెప్పించింది. దీంతో ఆమె ఘాటుగా స్పందించారు.
డీకే అరుణ బొమ్మాళి లాంటిదని కవిత విమర్శించారు. కేసీఆర్ పై నోరు పారేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఏ జిల్లా ఏర్పాటు చేయాలోతన తండ్రికి బాగా తెలుసన్నారు.
అరుణపై కవితకు ఎంత కోపం వచ్చిందో ఆమె మాటల తీరునుబట్టి అర్థమవుతుంది. గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలనే సలహాకు అరుణ స్పందన ఏమిటో ఇంకా బయటకు రాలేదు. మొత్తానికి జిల్లాల చిచ్చు రావణ కాష్టంలా రగిలేసూచనలు కనిపిస్తున్నాయి. 10 జిల్లాలను అమాంతం 27 పెంచాలని ప్రతిపాదించడం అసాధారణం. ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నా, అభ్యంతరం వచ్చే ప్రతిచోటా మార్పులు చేస్తారా అనే అనుమానం కలుగుతోంది.
తెరాస నేతల మాటకే విలువ ఉంటుందని ఇప్పటికే టాక్ వచ్చేసింది. కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. హటాత్తుగా మెట్ పల్లి తెరపైకి వచ్చింది. ఇంకా పలుచోట్ల ఇలాగే మార్పులు జరిగాయని, తెరాస నేతల ఒత్తిడే దీనికి కారణమని ఇప్పటికే విమర్శలున్నాయి. మరి అరుణ కోరినట్టు గద్వాల జిల్లా ఏర్పాటవుతుందో లేదో చూద్దాం.