గద్వాల్, జనగామలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ నిన్నటి నుంచి ఇందిరా పార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ, “జిల్లాల పునర్విభజన చాలా అశాస్త్రీయంగా, ఏకపక్షంగా జరుగుతోంది. ప్రజలు, ప్రతిపక్షాల అభిప్రాయాలని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసుకొన్న మార్గదర్శకాలని సైతం ప్రభుత్వం పాటించడం లేదు. ప్రజల కోసమో, పరిపాలనా సౌలభ్యం కోసమే కాక తెరాస నేతల కోసం ఆ పార్టీ రాజకీయ లబ్ది కోసమే జిల్లాల పునర్విభజన చేస్తుడటం చాలా దారుణం. ముఖ్యమంత్రి కెసిఆర్ కి దమ్ముంటే దీనిపై చర్చకి రావాలి. నేను ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. ఒకవేళ ఆయనకి వీలుకాకపోతే తన కొడుకునో కూతురినో పంపాలి. మళ్ళీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే తెరాస సర్కార్ ఈ జిల్లాల పునర్విభజన ఎందుకు చేస్తోందో బయటపెడతాము,” అని అరుణ అన్నారు.
ఆమె ముఖ్యమంత్రికి ఈవిధంగా సవాలు విసిరినందుకు టిఆర్ఎస్ నేతలు, కెసిఆర్ కుమార్తె కవిత ఆమెపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆమెని అరుందతి సినిమాలో ‘బొమ్మాళి’తో పోల్చి వెళ్లి గద్వాల్ కోటలో విశ్రాంతి తీసుకోవాలని కవిత ఎద్దేవా చేశారు.
ఆమె ఈ దీక్షలతో కాంగ్రెస్ అధిష్టానం దృష్టిని ఆకర్షించి పిసిసి అధ్యక్ష పదవి పొందాలని తాపత్రయపడుతున్నారని ఒక తెరాస నేత విమర్శించారు. ఆమె చేస్తున్నవి దొంగ దీక్షలని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. తెరాస రాజకీయ ప్రయోజనాల కోసమేజిల్లాల పునర్విభజన చేస్తున్నట్లయితే మంత్రి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాని జిల్లాగా ప్రకటించుకొని ఉండేవారమని కానీ ఆవిధంగా చేయకపోవడంతో ప్రస్తుతం సిరిసిల్లాలో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని జూపల్లి అన్నారు. అదేవిధంగా తెరాస ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామని జిల్లాగా ప్రకటించకపోయినా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తిని జిల్లాగా చేశామని జూపల్లి చెప్పారు. తమ నిజాయితీ నిరూపించుకోవడానికి ఈ ఉదాహరణలు చాలని జూపల్లి అన్నారు.
ఈ జిల్లాల పునర్విభజనపై అధికార, ప్రతిపక్షాలు పూర్తి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రజలని కూడా గందరగోళానికి గురి చేస్తున్నారు. ఈ అంశం ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్ కి సంబంధించిన విషయం. కనుక దీనిపై పార్టీపరంగా, వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం కంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించి సమస్యలని పరిష్కరించుకొంటే మంచిది. ఎందుకంటే అందరి లక్ష్యం బంగారి తెలంగాణా సాధించడమే కనుక. అందుకోసం అందరూ ఒకమెట్టు దిగి తమ విభేధాలని, బేషజాలని పక్కనపెట్టి ఈ సమస్యపై చర్చించుకొని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటే ప్రజలు కూడా సంతోషిస్తారు.