గద్వాల జిల్లా కోసం డీకే అరుణ పదవీ త్యాగం. మొదట్లో న్యూస్ చానల్స్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కొద్దిసేపటికే అసలు విషయం తెలిసింది. షరతులు వర్తిస్తాయని. రాజీనామాకు ఏమాత్రం అవకాశం లేని ఫార్మాట్లో రాసిన లేఖ వల్ల పదవీ త్యాగం అనేది అబద్ధమని తేలిపోయింది. అందుకే, ఇదో డ్రామా అని అధికార పార్టీ దుయ్యబట్టింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాను ఏర్పాటుచేయాలనేది కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్. ఇందుకోసం ఆమె పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానికంగా, హైదరాబాదులో భారీగానే ఉద్యమం చేయించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు రాజీనామాస్త్రం ప్రయోగించారు.
ప్రస్తుత దశలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనే సలహా ఆమెకు ఎవరు ఇచ్చారో తెలియదు. రాజీనామా చేస్తే ఆమోదం పొందాలి. అలా కాకుండా కండిషన్స్ అప్లయ్ అంటూ లేఖ రాయడం, దాన్ని స్పీకర్ కు కాకుండా ముఖ్యమంత్రికి పంపడం పొలిటికల్ డ్రామా అనే విమర్శలను ఆహ్వానించడానికి ఉపయోగ పడింది. దీనివల్ల రాజకీయాంగా ఆమెకు కలిసివచ్చే అవకాశం కనిపించడం లేదు.
గద్వాల జిల్లా ఏర్పాటుకు నా ఎమ్మెల్యే పదవే అడ్డుగా ఉంటే రాజీనామాను ఆమోదించండి అనే లేఖను ఎవరైనా ఎలా ఆమోదిస్తారు? ఇలాంటి లేఖను ముఖ్యమంత్రి స్పీకర్ కు ఎలా పంపుతారు? తెలంగాణ ఉద్యమ కాలంలో తెరాస కూడా రాజీనామాల వ్యూహం అమలు చేసింది. అయితే తెరాస వాళ్లు నిజంగానే రాజీనామాలు చేశారు. ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. దాంతో ఆ పార్టీకి నైతికంగా మరింత మద్దతు పెరిగింది. ఇప్పుడు అరుణ కూడా అలాగే చేసి ఉంటే గద్వాల ప్రాంతంలో హీరో ఇమేజి వచ్చి ఉండేది.
జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరింది. పట్టుమని పదిరోజుల్లో అనుకున్నది అమలు చేయడానికి కేసీఆర్ పంతంతో ఉన్నారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని నిర్ణయించారు. అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నా ఇక ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దానికి అంత ఓపిక కూడా ఉన్నట్టు లేదు. జిల్లాల సంఖ్యను ఒకేసారి సుమారు మూడు రెట్లను పెంచడం ఏం శాస్త్రీయత అనే ప్రశ్నకు జవాబు చెప్పే మూడ్ లో ప్రభుత్వం లేదు. తెలంగాణలో 27 జిల్లాలను ఏర్పాటు చేసిన వాళ్లుగా చరిత్రలో నిలిచిపోవాలనే తపన మాత్రమే కనిపిస్తోంది. కాబట్టి డీకే అరుణ రాజీనామా, లేదా తెరాస విమర్శించినట్టు రాజకీయ డ్రామా వల్ల గద్వాల జిల్లా ఏర్పాటు అనేది జరగదు అనేది తేలిపోయింది.