“హరీష్ మార్క్” రాజకీయ వ్యూహంలో ఆయనే చిక్కుకున్నారా..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనల్లుడు… నిన్నామొన్నటి దాకా… టీఆర్ఎస్‌లో నెంబర్ టూ పొజిషన్‌లో ఉన్న హరీష్ రావు పరిస్థితి ఇప్పుడు. ఎటూ కాకుండా పోయింది. మామ దగ్గర పోయిన విశ్వాసాన్ని ఎలా తిరిగి పునరుద్ధరించుకోవాలో తెలియక .. పార్టీ కోసం .. రేయింబవళ్లు కష్టపడుతూంటే… గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి హరీష్ పై పెద్ద బాంబే వేశారు. నేరుగా కేసీఆర్‌నే ఓడించడానికి ఆర్థిక సాయం చేస్తానంటూ.. ఆఫర్ ఇచ్చారని ప్రకటించారు. దానికి ఆయన దగ్గర సాక్ష్యాలు కూడా ఏమీ లేవు. సాధారణంగా అయితే… ఇది ఓ రాజకీయ ఆరోపణ అయి ఉండేది. కానీ ఇప్పుడు అందరి చూపు.. హరీష్ వైపు అనుమానంగా పడుతోంది. దాంతో.. తన నిజాయితీని నిరూపించుకోడానికి హరీష్ సవాళ్ల మీద సవాళ్లు చేయాల్సి వస్తోంది.

హరీష్ రావుకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..?

కుమారుడికి పట్టం కట్టాలనే కోరిక కావొచ్చు.. లేదా హరీష్ రావు… బయట అనుకుంటున్నట్లు అంతర్గత రాజకీయం చేస్తున్నట్లు ఉప్పంది ఉండవచ్చు కానీ.. మొత్తానికి కేసీఆర్ మాత్రం ఇటీవలి కాలంలో… హరీష్‌రావును దూరం పెట్టడం ప్రారంభించారు. ఫలితంగా.. టీఆర్ఎస్‌లోనే స్పెక్యులేషన్ ప్రారంభమయింది. ఓ వైపు అమిత్ షాతో హరీష్‌రావు టచ్‌లో ఉన్నారని కొంత మంది.. కాదు కాదు. రాహుల్‌తో టచ్‌లో ఉన్నారని మరికొంత మంది చెప్పుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో.. మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చి తన విశ్వసనీయతను చెప్పుకోవడానికి హరీష్ ప్రయత్నించారు. చివరికి… తాను రాజకీయాల నుంచి విరమించుకుంటాననే ప్రకటన కూడా చేశారు. అదీ మరీ ఓవర్ అయితే.. సానుభూతి రాజకీయం చేస్తున్నారని.. కేసీఆర్ ఇంటి పెద్దలు భావించారేమో కానీ… ఆయన వార్తలు.. ఇంటి మీడియాలో రాకుండా నిషేధించారు. ఇటీవలే.. మళ్లీ కొద్దిగా.. తెరిపిన పడుతున్నారనుకునేలోపే… వంటేరు ప్రతాప్ రెడ్డి.. హరీష్ పై అనుమానాలు కలిగే ప్రకటన చేశారు.

హరీష్ నేర్పిన విద్యయేనా..?

నిజానికి ఇలా.. ఓ రాజకీయ నాయకుడిపై పార్టీ మారుతున్నారనే… స్పెక్యులేషన్ వచ్చేలా చేసి.. అతనిపై ఒత్తిడి తెచ్చి అంతిమంగా… పార్టీ మారేలా చేసే వ్యూహం… అమలు చేయడంలో హరీష్ రావు సిద్ధహస్తుడు. టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరి ఆపరేషన్‌ను.. హరీష్ రావే చేశాడనేది బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై హరీష్ చేసిన మైండ్ గేమ్‌ … ఆ బాధను అనుభవించిన టీడీపీ ఎమ్మెల్యేలకే తెలుస్తుంది. గ్రేటర్ ఎమ్మెల్యేలపై… హరీష్ రావు.. మీడియాను అడ్డు పెట్టుకుని.. అధికారులను అడ్డు పెట్టుకుని.. వాళ్ల వ్యాపారాలను టార్గెట్ చేసి… పార్టీ మారుతున్నారని ప్రచారం చేసి.. చివరికి… మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు లాంటి కరడు గట్టిన టీడీపీ వాదుల్ని కూడా.. కారెక్కించే వరకూ ఊరుకోలేదు. అచ్చంగా ఇప్పుడు.. అదే తరహాలో హరీష్‌ కు రాజకీయ పరిణామాలు ఎదురొస్తున్నాయి. టీఆర్ఎస్‌లో ఇప్పుడు దీనిపైనే… ఎక్కువగా చర్చ జరుగుతోంది.

ఇప్పుడు హరీష్ ఏం చేయబోతున్నారు…?

ఎవరు ఎన్ని చెప్పినా… హరీష్ రావుపై…టీఆర్ఎస్‌లోని ఏ ఒక్కరూ నమ్మకం పెట్టుకోలేరు. హరీష్‌పై నమ్మకం లేకనే… ఇప్పటికే… గజ్వేల్ బాధ్యతలను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు కేసీఆర్. అయినా… హరీష్ బాధ్యత తీసుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రచారానికి కూడా విలువ లేకుండాపోయే పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందే.. హరీష్‌పై.. కేసీఆర్ నమ్మకం కోల్పోయారని.. రకరకాల పరిణామాలతో తేలిపోయింది. దీంతో ఇప్పుడు.. హరీష్ తన .. నిజాయితీని నిరూపించుకోవడం అంత సులభం కూడా కాదు. తన నిజాయితీని నిరూపించుకోవాలంటే.. మాటల్లో సాధ్యం కాదు. ఎన్ని మాటలు చెబితే అన్ని అనుమానాలు పెరిగిపోతాయి. చేతల్లోనే చూపించారు. అది చూపించడానికి ఇప్పుడల్లా అవకాశం రాకపోవచ్చు. ఓ రకంగా.. హరీష్ రావు ఇప్పుడు…” ఫిక్స్” అయిపోయారు. మొత్తం పరిణామాల్ని చూస్తే.. తన బ్రాండ్ ప్లాన్‌లోనే.. తాను ఇరుక్కుపోయారు. బయటకు రాలేరు.. లోపలికి వెళ్లలేరు. ఇప్పుడు ఏం చేయాలో.. కనీసం.. హరీష్‌రావుకు కూడా అర్థం కాదేమో..?

— సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com