ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారు. కుటుంబసభ్యులందరితో కలిసి వెళ్లారు. కవిత రెండో కుమారుడ్ని అమెరికా కాలేజీలో చేర్పించేందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా కవిత తన కుమారుడికి కేసీఆర్ ఆశీస్సులు ఇప్పించేందుకు ఫామ్ హౌస్కు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వెళ్లినా సాయంత్రం వరకు కేసీఆర్ కలిశారని కానీ.. ఆశీర్వచనాలు ఇచ్చారని కానీ ఫోటోలు బయటకు రాలేదు.
నిజానికి కవిత ఇలా ఫామ్ హౌస్ కు వెళ్తారన్న సమాచారం వచ్చిన కాసేపటికే కేసీఆర్ నుంచి ముఖ్య నేతలకు పిలుపు వెళ్లింది. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు వస్తే కీలక అంశాలపై చర్చిద్దామని పిలిచారు.కేసీఆర్ పిలుపు అందిన వెంటనే హరీష్రావు, వినోద్, కేటీఆర్ వంటి వారు ఫామ్ హౌస్ కువచ్చారు. వారితో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కవితను ఆహ్వానించే అవకాశం లేదు. అయితే కవితను విడిగా అయినా కలిసి మనవడ్నికేసీఆర్ ఆశీర్వదించారా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు.
కవిత గతంలో కూడా ఓ సారి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే సమయంలో వెళ్లారు. కానీ కేసీఆర్ ఆమెతో మాట్లాడలేదు. కనీసం తన కాన్వాయ్ లో వచ్చేందుకు కూడా అంగీకరించలేదు. అంటే.. కవితపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారని పార్టీ నేతలకు అర్థమైపోయింది. అందుకే జగదీష్ రెడ్డి, పటోళ్ల కార్తీక్ రెడ్డి వంటి వాళ్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. వారిపై కవిత కూడా విమర్శలు చేశారు.