రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే మాయాజాలం ..ఇళ్లు కొనుగోలు చేసిన వాళ్లకూ అర్థం కాదు. తాము మోసపోయామన్న సంగతినీ వారు గుర్తించలేరు. అంతగా వారు ఇళ్ల కొనుగోలు దారుల్ని మాయ చేస్తారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలోని మోసపూరిత పద్ధతుల వల్ల నష్టపోని వారు ఉండరు. అయితే రియల్టర్లు ఎలా మోసం చేస్తారో తెలుసుకుంటే.. కొంత వరకూ బయటపడవచ్చు.
బిల్డర్లు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడానికి ప్రాజెక్ట్‌లు “సోల్డ్ అవుట్” అయినట్లు ప్రచారం చేస్తారు. దీనివల్ల కొనుగోలుదారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడికి గురవుతారు. ఏ అపార్టుమెంట్ చూడటానికైనా వెళ్లండి.. అక్కడి బిల్డర్ ఆ ఫ్లాట్ కోసం అడ్వాన్సులు ఇచ్చేందుకు నలుగురు రెడీగా ఉన్నారని చెబుతారు. చాలా ప్రాజెక్ట్‌లలో లిటిగేషన్ సమస్యలు ఉంటాయి, ఇవి డాక్యుమెంటేషన్‌లో దాచేస్తారు. కొనుగోలుదారులు ఒప్పందంలో లాక్ అయ్యే వరకు బహిర్గతం చేయరు. కన్స్ట్రక్షన్-లింక్డ్ లేదా టైమ్-లింక్డ్ పేమెంట్ ప్లాన్లు బిల్డర్లకు తొందరగా నిధులు సేకరించడానికి, నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి ప్లాన్ల ద్వారా వారు నిర్మాణాలను ఆలస్యం చేసే హక్కును పొందుతున్నట్లవుతుంది.
చాలా మంది జీతం పొందే వ్యక్తులు హోమ్ లోన్లను తీసుకుంటారు, ఇవి నిర్మాణం ఆలస్యమైనప్పుడు EMIల భారాన్ని పెంచుతాయి. “పొసెషన్ వరకు EMI లేదు” వంటి సబ్వెన్షన్ స్కీమ్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ బిల్డర్ EMI చెల్లింపులను ఆపివేస్తే, కొనుగోలుదారు బ్యాంక్‌ల నుండి ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇప్పటికి హ్యాండోవర్ కాని ఇళ్లను కొనుగోలు చేసిన లక్షల మంది ఈఎంఐలు చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల బిల్డర్లు 18-24 నెలల పాటు EMIలు చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు, కానీ ప్రాజెక్ట్ ఆలస్యమైతే కొనుగోలుదారు EMI భారాన్ని భరించాలి.
రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం చేస్తే.. అతనిపై చట్టపరంగా పోరాడాలంటే.. సమయం, ధనం వృధా అవుతుంది. అందుకే మోసం పోకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడమే కీలకం.