భారత్‌ను దెబ్బకొడుతున్నాం అన్న పేరుతో అమెరికా ప్రజల్ని దోచేసుకుంటున్నారు ట్రంప్. ఇప్పుడు భారత ఫార్మా కంపెనీల ఉత్పత్తులపై వంద శాతం పన్నులు విధించారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఈ పన్ను వర్తిస్తుంది. ఇది పూర్తిగా దిగుమతులకే వర్తిస్తుంది. అమెరికాలో ఫ్యాక్టరీలు ఉన్న భారత కంపెనీలు అక్కడే తయారు చేసి అమ్ముకుంటే పన్ను ఉండదు.
ఇక్కడ ట్రంప్ మరో వెసులుబాటు ఇచ్చారు. అమెరికాలో ఫార్మా ఫ్యాక్టరీలు నిర్మిస్తుంటే, వారి ఉత్పత్తులపై టారిఫ్ విధించబోమని.. కనీసం శంకుస్థాపన చేసినా.. కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినా చారని ట్రంప్ ప్రకటించారు. గతంలో ఆయన 250 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తానని చెప్పినప్పటికీ ఇప్పుడు 100 శాతంతో ప్రారంభించారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద ఔషధ ఎగుమతి మార్కెట్. అమెరికా జెనరిక్ ఫార్మా మార్కెట్లో 50 శాతం షేర్ కలిగి ఉంది. 2024లో సుమారు రూ. 76,000 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
ఆగస్టులో ట్రంప్ 50% టారిఫ్‌లు విధించినప్పుడు ఔషధ రంగం మినహాయింపు పొందింది. కానీ అంతకు రెట్టింపు విధించారు. ఈ టారిఫ్ వల్ల అమెరికాలో ఔషధ ధరలు భారీగా పెరుగుతాయని అంచనా. హైపర్‌టెన్షన్, మెంటల్ హెల్త్ వంటి వ్యాధులకు 60 శాతం ఔషధాలు భారత్ నుంచే వస్తాయి. ఇది అమెరికాలో ఔషధ లోపాలు, ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ట్రంప్ పణంగా పెడుతున్నారని మండిపడుతున్నారు.
వినియోగవస్తువుల ధరలు పెరిగితే వాటిని వాడటం ప్రజలు మానేస్తారేమోకానీ.. ఇలా ఫార్మా ఉత్పత్తులపై పన్నులు వేస్తే అమెరికన్లు తప్పనిసరిగా కొనుక్కోవాల్సిందే. దాని వల్ల ట్రంప్ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కానీ ప్రజలు నష్టోతారు. ఫార్మాకంపెనీలకూ ఇబ్బందే కానీ.. వారికి డిమాండ్ తగ్గే అవకాం ఉండదని అంచనా.