అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్ల మధ్య గతేడాది జరిగిన యుద్ధ వాతావరణంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జోక్యం లేకపోతే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణానికే ముప్పు ఉండేదని, భారత్తో యుద్ధం కారణంగా ఆయన చనిపోయి ఉండేవారని పేర్కొన్నారు. బుధవారం తన రెండవ పదవీకాలపు మొదటి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన పాలనలో మొదటి పది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ముగించానని ట్రంప్ ఈ సందర్భంగా గొప్పగా చెప్పుకున్నారు. భారత్-పాక్ మధ్య గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో తాను జోక్యం చేసుకోకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని ఆయన అన్నారు. ఒకవేళ ఆ యుద్ధం జరిగి ఉంటే కనీసం 3.5 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండేవారని పాక్ ప్రధాని షరీఫ్ స్వయంగా తనతో చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు.
గతేడాది మే నెలలో భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినప్పుడు, తాను ఉభయ దేశాల నేతలకు ఫోన్ చేసి హెచ్చరించినట్లు ట్రంప్ గుర్తు చేశారు. యుద్ధం ఆపకపోతే రెండు దేశాలపై 200 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించానని, ఆ ఆర్థిక దెబ్బకు భయపడే వారు వెనక్కి తగ్గారని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో ఈ ఘర్షణల్లో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ చేస్తున్న ఈ మధ్యవర్తిత్వ వాదనలను భారత్ మొదటి నుంచీ ఖండిస్తూనే ఉంది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అనేది కేవలం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితమే తప్ప, ఇందులో అమెరికా జోక్యం ఏమాత్రం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. గతంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ట్రంప్ వాదనలపై స్పందిస్తూ, ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు అమెరికాలోనే ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.