నోబెల్ శాంతి బహుమతి కోసం .. పరీక్షలు రాసిన విద్యార్థిలా .. ఇంకా చెప్పాలంటే చకోరపక్షిలా ఎదురు చూసిన ట్రంప్‌కు షాక్ తగిలింది. ఆయనకు నోబెల్ రాలేదు. వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు మరియాకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ఆమె వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాడారు.
ట్రంప్ తనకు శాంతి బహుమతి వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓ రకంగా ఆయన నోబెల్ కమిటీని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేశారు. తనకు ఇవ్వకపోతే అమెరికాను అవమానించడమే అన్నారు. అయితే ఆయన నోబెల్ కోరుకున్నది గతంలో ఒబామాకు ఇచ్చారనే. ఒబామా కన్నా తాను ఎన్నో రెట్లు గొప్ప అని..యుద్దాలను ఆపానని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా గాజాలో కూడా ఆయన ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిర్చారు. కానీ రష్యా, ఉక్రెయిన్ మధ్య మాత్రం రాజీ కుదర్చలేకపోయారు.
ట్రంప్ వల్ల శాంతి కాదు కదా.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనిశ్చితి కారణం అని విమర్శలు ఉన్నాయి. అయితే ఆయన మాత్రం స్వయం ప్రకటనలతో రచ్చ చేశారు. పాకిస్తాన్ వంటి దేశాలతో సిఫారసు చేయించుకున్నారు. కానీ నోబెల్ కమిటీ ఇలాంటి ఒత్తిళ్లకు.. సిఫారసకు లొంగే అవకాశం లేదు. ట్రంప్ నకు ఇప్పుడు తెలిసి వచ్చి ఉంటుంది. ఇప్పటి నుంచి ఆయన నోబెల్ కమిటీని.. నోబెల్ గ్రహీతల్ని కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఆయన అశాంతితో రగిలిపోయే సూచనలు ఉన్నాయి.