ఇద్దరు ప్రాణస్నేహితులు ఉంటారు. ఒకరి విజయానికి ఒకరు సహకరించుకుంటూ ఉంటారు. తర్వాత వారి మధ్య గొడవలొస్తాయి. ఇద్దరూ బద్ద శత్రువులు అవుతాయి. ఇలాంటి కథతో నాటి నుంచి నేటి వరకూ చాలా సినిమాలు వచ్చాయి. నిజ జీవితంలోనూ జరుగుతున్నాయి. అలాంటి కథ అమెరికాలో రిపీట్ అవుతోంది. ఆ ఇద్దరు మిత్రులు ఎవరో కాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్.
పరస్పరం విమర్శించుకుంటున్న ట్రంప్, మస్క్
అమెరికా రాజకీయాల్లో కొత్త సూపర్ స్టార్ ఎలాన్ మస్క్ అని రెండో సారి అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రంప్ పొగిడారు. ఆయనకు గొప్ప భవిష్యత్ ఉంటుందన్నారు. కానీ హఠాత్తుగా ఆయన లేకపోయినా తాను గెలిచేవాడినని ఇప్పుడు మస్క్ వ్యాపారాలకు సహకరించే వారిపై పన్నులు వేస్తానని హెచ్చరిస్తున్నారు. పోటీగా తాను కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరిస్తున్నారు. దీంతో ఇద్దరు మిత్రులు కాస్తా శత్రువులుగా మారిపోయారు.
కొత్త పార్టీ పెడతానని మస్క్ హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్ తన వల్లే గెలిచారని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. అదే చెబుతున్నారు. ట్రంప్ విధానాలు నచ్చడం లేదని ఇప్పుడు మస్క్ అంటున్నారు. బిగ్ అండ్ బ్యూటీఫుల్ పేరుతో తెస్తున్న బిల్లు ఖర్చులను పెంచేదిగా ఉందని అది అమెరికాను దివాలా తీయిస్తుందని మస్క్ నమ్మకం. కానీ ట్రంప్ మస్క్ నమ్మకాలను నమ్మే వ్యక్తి కాదు. అందుకే దూరం పెట్టాడు . డోజ్ నుంచి గెంటేశాడు. ఇప్పుడు .. నా వల్లే గెలిచావని మస్క్ అంటే.. నువ్వు లేకపోయినా గెలిచేవాడినని ట్రంప్ అంటున్నారు.
ప్రతీకార చర్యలు ట్రంప్ లక్షణం – మస్క్ ఊరుకుంటారా?
తనతో ఎవరైనా విభేదిస్తే వారిపై ప్రతీకారానికి దిగడం ట్రంప్ లక్షణం. ఇప్పుడు మస్క్ పైనా అదే చేస్తున్నారు. మస్క్ వ్యాపార వ్యవహారాలకు సహకరించే సంస్థలపై పన్నులు వేస్తానని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విధించవచ్చు కూడా. అందుకే మస్క్ కొత్త పార్టీ పెడతానని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఎనభై శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా పార్టీ ఉంటుందంటున్నారు. ఇద్దరూ ఇలా పంతాలకు పోతే ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారితే వారి పోరాటం ఎంత ఘోరంగా ఉంటుందో స్పష్టమయ్యే అవకాశం ఉంది.