ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ పెనుముప్పుగా మారారు. దేశాల మధ్య ఉండాల్సిన దౌత్య సంబంధాలను, వ్యక్తుల మధ్య ఉండే గిల్లీకజ్జాల స్థాయికి తగ్గించి చూడటం ఆయన శైలి. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిపై పెత్తనం చెలాయించే క్రమంలో అంతర్జాతీయ శాంతి పునాదులను కదిలిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడి విషయంలో అనుసరించిన బలప్రయోగ వ్యూహాన్నే ఇరాన్ వంటి శక్తివంతమైన దేశంపై ప్రయోగించాలని చూసి, ఇప్పుడు అటు ముందుకు వెళ్లలేక, ఇటు వెనక్కి తగ్గలేక ఒక రాజకీయ ఉచ్చులో చిక్కుకుపోయారు.
దశాబ్దాల త్యాగాలూ.. ఒక్కడి అహంకారం!
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలన్నీ ఎన్నో త్యాగాలు చేసి, చర్చల ద్వారా నిర్మించుకున్న అంతర్జాతీయ వ్యవస్థలను ట్రంప్ తన ఏకపక్ష నిర్ణయాలతో కుప్పకూలుస్తున్నారు. ఐక్యరాజ్యసమితి వంటి సంస్థల ప్రాధాన్యతను తగ్గించడం, దశాబ్దాల నాటి వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం వంటి చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అగాధంలోకి నెట్టేస్తున్నాయి. ఒక వ్యవస్థను నిర్మించడానికి కొన్ని దశాబ్దాల సమయం పడితే, దానిని కూల్చేయడానికి ట్రంప్ వంటి ఒకే ఒక్క నాయకుడి అనాలోచిత నిర్ణయం సరిపోతుందని నేడు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
బెదిరింపుల దౌత్యం – ఇరుక్కుపోయిన అమెరికా
ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. ఇరాన్ ఇచ్చిన చివరి వార్నింగ్ , యిల్, గ్యాస్, ఐటీ వ్యవస్థలపై ప్రతీకార దాడుల హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఆర్థిక మాంద్యం పొంచి ఉంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ బెదిరింపుల దౌత్యం వల్ల అమెరికా తన మిత్ర దేశాల నమ్మకాన్ని కూడా కోల్పోతోంది. యుద్ధం విస్తరిస్తే అది కేవలం ఇరాన్‌తోనే కాకుండా, మొత్తం మధ్యప్రాచ్యం అట్టుడికిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వేసిన అడుగులు అమెరికా ప్రతిష్ఠను పెంచడం పక్కన పెడితే, ఆ దేశాన్నే ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతున్నాయి.
శాంతికి తూట్లు – ఆర్థిక విధ్వంసం
ట్రంప్ వ్యవహారశైలి వల్ల కేవలం రాజకీయ ఉద్రిక్తతలే కాకుండా, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సప్లయ్ చైన్స్ దెబ్బతినడం, వాణిజ్య యుద్ధాలు ముదరడం వల్ల సామాన్య ప్రజలు ధరల భారంతో అల్లాడిపోతున్నారు. నాయకుడు అనేవాడు క్లిష్ట పరిస్థితుల్లో సమన్వయకర్తగా ఉండాలి కానీ, తానే సమస్యగా మారకూడదు. ట్రంప్ తీరు చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం నిర్మించుకున్న గ్లోబల్ ఆర్డర్‌ను ముక్కలు చేసి, ప్రపంచాన్ని మళ్ళీ అనిశ్చితిలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది.
నాయకత్వం అంటే కేవలం అధికారం చలాయించడం కాదు, బాధ్యతగా మెలగడం. ప్రపంచ దేశాల మధ్య పంచాయతీలను మనుషుల గొడవల తరహాలో తీర్చాలనుకోవడం ఒక చారిత్రక తప్పిదం. అదే నిస్సంకోచంగా చేస్తున్నాడు.