అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుగు రాష్ట్రాల నేతలతో పోటీ పడుతున్నారు. మా అమెరికాకు ఇన్ని పెట్టుబడులు ఆకర్షించానంటూ ఎక్కడికి వెళ్లినా చెప్పుకుంటున్నారు. ఇలాంటి మాటలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలవాటే. ఏపీ లేదా తెలంగాణ అధికారిక పర్యటన ఎవరు విదేశాలకు చేసినా.. వేల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు వస్తాయి. అలా చేయకపోయినా ఎవరైనా వేరే కంపెనీ ప్రతినిధులు వచ్చి ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం అయితే అలాంటి ప్రకటనలే వస్తాయి. సరే ఇదంతా మేము గొప్పగా పరిపాలన చేస్తున్నామని అనుకోవాలని ప్రకటించుకుంటారు. నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ట్రంప్ వీరికి పోటీ వస్తున్నారు. తాను అమెరికాకు విపరీతంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నానని చెబుతున్నారు.
ట్రంప్ నుంచి వారం వారం.. నెలావారీగా ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఖతార్ లో పారిశ్రామికవేత్తల సమావేశంతో మరింత ముదిరింది. తన దేశంలో పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తున్నానని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేతల్ని ఆకర్షిస్తున్నానని ఆయన అంటున్నారు. నిజంగా వారంతా అమెరికాలో పెట్టుబడులు పెడతారో లేదో కానీ ట్రంప్ మాత్రం ఇలా ప్రకటనలు చేయడం అమెరికన్లకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశం. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పరుగులు పెట్టడానికి రావాలి కానీ అమెరికా అధ్యక్షుడు వెళ్లి మా దగ్గర పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించడం అవమానకరం. కానీ ట్రంప్ దీన్ని సులువుగా చేసి పడేస్తున్నారు.
అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన బెదిరిపులకు దిగుతున్నారు. ఐ ఫోన్ల ఉత్పత్తిని భారత్ లో పెంచాలని ఇక్కడి ఫోన్లలో అమెరికాలో అమ్మాలని యాపిల్ కంపెనీ అనుకుంటోంది. అమెరికాలో ఎందుకు ఉత్పత్తి చేయదు అనేది చాలా మందికి వచ్చే సందేహం. అక్కడ ఉత్పత్తి చేస్తే రెట్టింపు ఖర్చులవుతాయి. అందుకే చీప్ లేబర్, ముడిపదార్థాలు తక్కువకు దొరికే దేశాల్లో తయారు చేస్తారు. అమెరికాలో మామూలు పనులు చేసే వాళ్లందర్నీ తరిమేస్తున్న ట్రంప్ .. తమ ఫ్యాక్టరీల్లో పని చేయడానికి లేబర్లను ఎక్కడి నుంచి తెస్తారు ?. అందుకే చైనా.. మేక్ ఇన్ అమెరికా పేరుతో ట్రంప్ ,మస్క్ లాంటి వాళ్లు ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నట్లుగా వీడియోలు తయారు చేసి ట్రోల్ చేసింది.
అమెరికా పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకుని.. తయారీ రంగాన్ని ప్రోత్సహించాలంటే.. అక్కడ కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా.. అమెరికా బయట తయారు చేస్తున్న వారందరిపై విరుచుకుపడటం ట్రంప్ స్టైల్. అమెరికాను ఆయన నాలుగేళ్లలో ఎక్కడికి తీసుకెళ్తారో కానీ ఇప్పటికే చులకన అయిపోయింది..