ట్రంప్ అన్ని దేశాలపై పన్నులు బాదేస్తున్నారు. అమెరికాకు ఇక బిలియన్ డాలర్లు వస్తాయని ప్రకటించేస్తున్నారు. కానీ ఆయన ప్రకటనల్ని చూసి అమెరికన్లు నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ చెప్పే బిలియన్ డాలర్లు ఇతర దేశాల నుంచి రావు. అమెరికన్లే కట్టాలి. ఆ లాజిక్ ట్రంప్‌నకు అర్థం కావడం లేదో.. అర్థం కానట్లుగా నటిస్తున్నారో అమెరికన్లకు అర్థం కావడం లేదు.
దిగుమతులపై సుంకాలు చెల్లించాల్సింది దిగుమతిదారులు. అంటే అమెరికన్ వ్యాపారస్తులు. వారు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే.. పోర్టుల్లో వాటికి పన్నులు కట్టి విడిపించుకోవాలి. ఆ పన్నులు కట్టి వారు వాటిని అమెరికన్ మార్కెట్లో అమ్ముతారు. అన్ని పన్నులతో లాభం కలిపి అమ్ముకోవాలంటే.. మరింత రేటు పెంచుకోవాలి. అదే చేస్తారు. ఇప్పుడు బిలియన్ డాలర్లు కట్టేది ఎవరు ?. అమెరికన్ ప్రజలే.
ఇతర దేశాలపై పన్నులు వేయడం అంటే.. అసలు లాజిక్ చాలా మందికి అర్థం కావడం లేదు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే దిగుమతులపైనే పన్ను వేస్తారు కానీ.. భారతీయ ప్రజలు నేరుగా కట్టాల్సిన పన్నులు కాదు. అలాంటి అధికారం లేదు. సొంత ప్రజలపై పన్నులు వేసి ఇతర దేశాలపై పన్నులు వేసినట్లుగా చెప్పుకుంటున్నారు ట్రంప్. అందుకే అమెరికా ప్రజలు రగిలిపోతున్నారు.