అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానంలో మైండ్ గేమ్ ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రస్తుతం ఇరాన్‌తో సాగుతున్న యుద్ధ వాతావరణంలో కూడా ఆయన అదే తరహా మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై దాడులు చేస్తామని హెచ్చరించిన ట్రంప్, ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకుని ఐదు రోజుల పాటు దాడులను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన గౌరవనీయులైన నేతలతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తిస్థాయి పరిష్కారం లభిస్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా తీవ్రంగా ఖండించింది. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని, ఇవన్నీ ట్రంప్ ఆడుతున్న మానసిక యుద్ధం లో భాగమేనని కొట్టిపారేసింది. చర్చల పేరుతో అంతర్జాతీయ మార్కెట్లను శాంతింపజేయడం, ఇరాన్ వ్యూహాన్ని దెబ్బతీయడం ట్రంప్ ఉద్దేశమని ఇరాన్ అనుమానిస్తోంది.
సంధి ప్రయత్నమా లేక సమయం కోసమా?
ట్రంప్ పద్ధతి ప్రకారం.. యుద్ధం చేసే ముందు ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేయడం ఆయన అలవాటు. ఒకవైపు చర్చలు సాగుతున్నాయని చెబుతూనే, మరోవైపు పర్షియన్ గల్ఫ్‌కు అదనపు యుద్ధనౌకలను, మెరైన్ బలగాలను పంపిస్తున్నారు. ఇరాన్ మాత్రం మాపై దాడులు జరిగితే పశ్చిమాసియాలోని అన్ని ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తాం అని హెచ్చరించింది. లో ట్రంప్ ప్రకటించిన ఐదు రోజుల గడువు నిజంగా శాంతి కోసమా లేక ఇరాన్ సిద్ధపడకముందే భారీ దాడికి అవసరమైన సమయం తీసుకోవడానికా అన్నది మిస్టరీగా మారింది. ఇరాన్ ఇప్పటికే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ను తన నియంత్రణలోకి తీసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గండం
ఈ మైండ్ గేమ్ గనుక తేడా కొట్టి పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే, ప్రపంచం ఊహించని ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో 20-25 శాతం వాటా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడితే, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుండి 200 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న యూరప్ , ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది.
అగ్నిపర్వతంపై ప్రపంచ శాంతి
ట్రంప్ తన డీల్ మేకింగ్ నైపుణ్యంతో ఇరాన్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్నారా అన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. ఇరాన్ వంటి దేశంతో మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. ప్రస్తుతానికైతే ప్రపంచం మొత్తం ట్రంప్ ప్రకటించిన ఆ ఐదు రోజుల గడువు ముగిసిన తర్వాత ఏం జరుగుతుందోనని ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు మరి.


