విదేశీ వర్కర్లకు స్వాగతం పలుకుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఆయనకు అనుభవమైతే కానీ తత్వం బోదపడలేదన్న అభిప్రాయానికి రావడానికి కారణం అవుతోంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండయ్ కంపెనీ అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తోంది. అక్కడ పని చేయడానికి అమెరికాలో వర్కర్లు లేరు. అందుకే వారు దక్షిణకొరియా నుంచే తీసుకెళ్లారు. కానీ వారిని అమెరికా యంత్రాంగం రకరకాల నిబంధనల పేరుతో బంధించింది. దీంతో ఆగ్రహం చెందిన దక్షిణకొరియా వారిని తమ దేశానికి తీసుకెళ్లిపోయింది. అమెరికాలో పెట్టుబడుల అంశంపై పునరాలోచిస్తామని ప్రకటించింది. అన్ని దేశాలు అదే బాటపడతాయన్న అనుమానంతో ట్రంప్ వెంటనే దిగి వచ్చారు. విదేశీ వర్కర్లను అనుమతిస్తామని ప్రకటన చేశారు.
అమెరికాలో తయారీ రంగానికి మ్యాన్ పవర్ కొరత
కారణం ఏదైనా అమెరికాలో తయారీ రంగం ప్రాథమిక స్థాయిలో కూడా అభివృద్ధి చెందలేదు. అమెరికా కంపెనీలు అత్యధికం ఇతర దేశాల్లో ఉత్పత్తులు చేస్తూ ఉంటాయి. దీనికి కారణం అమెరికాలో శ్రామిక శక్తి లేకపోవడమే. చైనా, భారత్ వంటి దేశాల్లో శ్రామిక శక్తి ఎక్కువ. అందుకే తయారీ రంగం ఆ దేశాల వైపు కేంద్రీకృతమవుతోంది. కానీ ట్రంప్.. తమ దేశ కంపెనీలు. తమ దేశంలో అమ్ముకుంటున్న కంపెనీలు తమ దగ్గరే ఉత్పత్తి చేయాలని అంటున్నారు. కానీ తమ దేశంలో వర్కర్స్ ఉండరన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.
గతంలోనే ఎగతాళి చేసిన చైనా
ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చైనా.. అమెరికాను ఈ విషయంలోనే ఎగతాళి చేసింది. ఫ్యాక్టరీల్లో ట్రంప్ ఫోన్లు ఫిక్స్ చేస్తున్నట్లుగా.. ఎలాన్ మస్క్ షూస్ తయారు చేస్తున్నట్లుగా వీడియోలు తయారు చేసి వైరల్ చేసింది. అమెరికాలో తయారీ రంగానికి అవసరమైన శ్రామిక శక్తి, వారికి తగిన శిక్షణ ఉండదని చైనా ఉద్దేశం. అందులో నిజం ఉంది. అమెరికా ప్రజలు ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పని చేయడానికి ఇష్టపడరు. అలాంటి ఉపాధి పొందాలంటే ఇతర దేశాల నుంచి రావాల్సిందే. కానీ ట్రంప్ మాత్రం ఎవర్నీ రానిన్వం అన్ని పనులు అమెరికన్లు చేయాల్సిందే అంటున్నారు.
అమెరికన్లు నేర్చుకోవాలంటున్న ట్రంప్
ట్రంప్.. పెద్ద పెద్ద సంస్థలను పిలిచి అమెరికాలో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. వారు ఇతర దేశాల్లో తమ ఉత్పత్తుల తయారీని చేపట్టడానికి కారణాలేమిటో ట్రంప్‌కు తెలిస్తే ఇలా మాట్లాడరు. అమెరికాలో ఉత్పత్తి చేస్తే.. ఐ ఫోన్ ధర రెట్టింపు అవుతుంది. అక్కడ వర్కర్ల జీతాలు, ఉత్పాదక ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఇలాంటి భరించలేనంత భారం అవుతుంది . మ్యాన్ పవర్ ను కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన ఉంటుంది. దీనిపై ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్న ట్రంప్.. విదేశీ వర్కర్ల నుంచి అమెరికన్లు నేర్చుకోవాలంటున్నారు. కానీ అమెరికన్లు అలాంటి ఉద్యోగాలకు సిద్ధపడతారా అన్నది మాత్రం ఆలోచించడం లేదు.


