యాపిల్ కంపెనీకి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలన్నారు. అమెరికాలో కాకుండా ఇండియాలోనో , మరో దేశంలో తయారు చేయవద్దని యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్ కు ఎప్పుడో చెప్పానని పేర్కొన్నారు ట్రంప్.
తమ ఆదేశాలను కాదని యాపిల్ కంపెనీ విదేశాల్లో ఐఫోన్లను తయారు చేసి అమెరికాలో విక్రయిస్తే అమెరికాకు 25శాతం టారిఫ్ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు ట్రంప్. ఈమేరకు ట్వీట్ చేశారు. ఇటీవల అమెరికా – చైనా మధ్య తలెత్తిన ట్రేడ్ వార్ తో అక్కడ ఏర్పాటు చేయాలనుకున్న యాపిల్ ఫోన్ తయారీ ప్లాంట్లను ఇండియాలో ఏర్పాటు చేయాలనుకుంది యాపిల్ సంస్థ. అమెరికాకు అవసరమైన ఐఫోన్లను ఇండియాలో తయారు చేసి ఎక్స్ పోర్ట్ చేయాలని ప్లాన్ చేశారు.
ఆ తర్వాత విదేశాల్లో పర్యటనలో ఉండగానే ట్రంప్ మాట్లాడుతూ…యాపిల్ కంపెనీ ప్లాంట్లను ఇండియాకు తరలించవద్దని చెప్పానని, అందుకు టిమ్ కుక్ కూడా అంగీకరించారని చెప్పారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ కూడా అధిక టారిఫ్ లు విధిస్తోందని అందుకే యాపిల్ కంపెనీని అడ్డుకున్నానని చెప్పారు ట్రంప్
దీనిపై యాపిల్ కంపెనీ ఎలాంటి అధికారీక ప్రకటన చేయకపోగా.. ఇండియాలో కంపెనీ ఏర్పాట్లకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఇది ట్రంప్ ను ఆగ్రహానికి గురి చేసినట్టు ఉంది. అందుకే తాజాగా ఆయన ఎక్స్ వేదికగా..తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. అమెరికాలో అమ్మే ఫోన్లను ఇండియాలో తయారు చేసి అమెరికాలో అమ్మితే , 25శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.