లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తాము ఆదేశాలు ఇచ్చే వరకూ విచారణ చేయవద్దని ఏసీబీ కోర్టు న్యాయాధికారికి ఏపీ హైకోర్టు సూచించింది. ఇప్పటి వరకూ నిందితులకు ఇచ్చిన బెయిల్స్ ఉత్తర్వుల్లో న్యాయాధికారి పేర్కొంటున్న అంశాలు భిన్నంగా ఉంటున్నాయి. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి వంటి వాళ్లతో పాటు మిథున్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల్లో చాలా తేడాలు ఉండటంతో సిట్ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయాధికారి సిట్ దర్యాప్తును నిర్వీర్యం చేసేలా ఉత్తర్వులు ఇస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను విచారణ చేయవద్దని సూచించింది.
దర్యాప్తు పూర్తి కాలేదని కొంత మందికి డిఫాల్ట్ బెయిల్
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి , బాలాజీ గోవిందప్పలు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆయన చెప్పిన పనులు చేస్తారు. వారు లిక్కర్ కేసులో కీలక పాత్ర పోషించారు. వీరు ముగ్గురు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఉత్తర్వుల్లో దర్యాప్తు పూర్తి కాలేదని అందుకే డిఫాల్ట్ బెయిల్ ఇస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అప్పటికి చార్జిషీటు దాఖలు చేసిన విషయం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సిట్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
దర్యాప్తు పూర్తి అయిందని మిథున్ రెడ్డికి బెయిల్
మరో వైపు మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను పది రోజుల కిందటే కొట్టి వేసినా.. మళ్లీ పది రోజుల్లో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ ఇచ్చారు. ఇందులో దర్యాప్తు పూర్తయినందున బెయిల్ ఇస్తున్నామని చెప్పారు. ఈ ఉత్తర్వుల్లో లిక్కర్ కేసును నిర్వీర్యం చేసేలా పలు వ్యాఖ్యలు చేసినట్లుగా సిట్ విస్మయం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అసలు మిథున్‌రెడ్డిపై ఇంకా విచారణ పూర్తి కాలేదని.. విచారణ పూర్తయిందని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వుల్లో పేర్కొనడంపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లోని అంశాలపై స్టే ఇవ్వాలని కోరుతోంది.
బెయిల్ పిటిషన్లపై విచారణ వద్దని సూచించిన హైకోర్టు
ఇతర నిందితులూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. దీంతో ఇప్పటి వరకూ ఇచ్చిన బెయిల్స్ పై సిట్ హైకోర్టులో పిటిషన్లు వేసినందున తాము నిర్ణయం తీసుకునే వరకూ ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వద్దని ఏసీపీ కోర్టు న్యాయాధికారికి హైకోర్టు సూచించింది. విచారణను పదిహేనో తేదీకి వాయిదా వేసింది.