ఎన్టీఆర్ సినిమాల్లో ‘అదుర్స్’కి సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ఇందులో చారి పాత్రలో ఎన్టీఆర్ టైమింగ్ ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. బట్టు గా బ్రహ్మానందం పాత్ర కూడా ఎవర్ గ్రీనే. అదుర్స్ కథని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అప్పుడే అనుకొన్నారు. అదుర్స్ 2 గురించి ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. కోన వెంకట్ మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా అదుర్స్ 2 ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ‘స్క్రిప్టు రెడీ అయిపోయింది.. ఎన్టీఆర్ ఎప్పుడంటే అప్పుడే’ అంటూ ఆయన పాడిన పాటే పాడుతుంటారు. మళ్లీ అంతే. ఆయన నిర్మించిన ‘బ్యాండ్ మేళం’ సినిమా ప్రెస్ మీట్ లో మళ్లీ అదుర్స్ 2 గురించి మాట్లాడారు. ”మొన్నే వినాయక్‌ని కలిశా. అదుర్స్ 2 గురించి మాట్లాడుకొన్నాం. ఎన్టీఆర్ చేతిలో రెండు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి అవ్వగానే ఈ సినిమా ఉంటుంది” అనేశారు.
‘అదుర్స్ 2’ క్రేజీ ప్రాజెక్టే. కాదనలేని విషయం. కోన కూడా స్క్రిప్టు రెడీ చేసి ఉండొచ్చు. కానీ.. ఎన్టీఆర్ చేయడానికి సిద్ధమా? అనేదే డౌటు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇమేజ్ మారిపోయింది. అదుర్స్ కీ ఇప్పటికీ తన స్టార్ డమ్ లో చాలా ఛేంజ్ వచ్చింది. పాన్ ఇండియా అవసరాల మేరకు ఎన్టీఆర్ కథ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో అదుర్స్ అనే కథ సరిపడదు. పైగా వినాయక్ రెడీగా ఉన్నారా? అనేది మరో డౌటు. వినాయక్ మెగాఫోన్ పట్టి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఆయన రిలాక్డ్స్ మోడ్ లో ఉన్నారు. దాదాపుగా సినీ సన్యాసం తీసుకొన్నారు. వినాయక్ తో ఎన్టీఆర్ కి ఎంతో అనుబంధం ఉండొచ్చు. కానీ వినాయక్ తనని తాను నిరూపించుకొని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వినాయక్ ఓ సినిమా తీసి, హిట్ కొడితే అప్పుడు అదుర్స్ 2 గురించి మళ్లీ మాట్లాడుకొనే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకూ ఇవన్నీ ఊసుపోని కబుర్లే అన్నది ఫ్యాన్స్ మాట.


