జగన్ హయాంలో అత్యంత ఘోరంగా వేధింపులకు గురైన డాక్టర్ సుధాకర్ సుధాకర్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం బాధ్యతాయుతమైన నిర్ణయంతో అండగా నిలిచింది. అధికారం అండతో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏ విధంగా మానసిక క్షోభకు గురిచేయవచ్చో డాక్టర్ సుధాకర్ ఉదంతం కళ్లకు కట్టింది. అప్పట్లో జరిగిన ఆ అన్యాయాన్ని సరిదిద్దుతూ, ఆయన కుటుంబానికి రూ. కోటి ఆర్థిక సాయం అందించడంతో పాటు, ఆయన కుమారుడికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సుధాకర్‌పై అమానవీయ ప్రవర్తన
కరోనా కష్టకాలంలో మాస్కులు, రక్షణ కవచాలు లేవని ప్రశ్నించడమే డాక్టర్ సుధాకర్ చేసిన పాపమైపోయింది. ఒక ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా, విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. తన విధి నిర్వహణలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఆయనను పిచ్చివాడిగా ముద్రవేసి, మెంటల్ ఆసుపత్రికి పంపడం వంటి చర్యలు అత్యంత అమానవీయంగా సాగాయి. ఆ అవమానాన్ని, మానసిక వేదనను భరించలేక చివరకు ఆయన కన్నుమూశారు. ఆయన చనిపోయిన విషయం అంత్యక్రియలు పూర్తయిన తర్వాతే బయటకు వచ్చింది.
కుటుంబానికి అండగా ప్రస్తుత ప్రభుత్వం
నాడు డాక్టర్ సుధాకర్ అనుభవించిన నరకయాతనను విపక్ష నేతగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే, ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుధాకర్ కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు విద్యార్హతలను బట్టి నేరుగా పదోన్నతి కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, వారి సామాజిక హోదాను కూడా గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు.
న్యాయం గెలిచింది
ప్రభుత్వ యంత్రాంగం తలచుకుంటే ఒక సామాన్య పౌరుడిని ఎంతలా వేధించగలదో డాక్టర్ సుధాకర్ కేసు ఒక ఉదాహరణ అయితే, అదే ప్రభుత్వం మనసు పడితే బాధితులకు ఏ విధంగా న్యాయం చేయగలదో ఈ నిర్ణయం మరో ఉదాహరణగా నిలుస్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల వల్ల బలి కావాల్సిన అవసరం లేదని, తప్పు చేసిన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవిస్తారని, బాధితులకు న్యాయం జరుగుతుందని ఈ కేబినెట్ నిర్ణయం నిరూపించింది. ఇది కేవలం ఒక కుటుంబానికి జరిగిన మేలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా పడిన బలమైన అడుగు.


