భారతీయ జనతా పార్టీ తమిళనాట తన దండయాత్రను కొనసాగిస్తోంది. ఈ సారి ఓ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అక్కడి ప్రజల్లో పాతుకుపోయిన ద్రవిడ సిద్ధాంతాలను మార్చి హిందూత్వం వైపు తీసుకు వచ్చేందుకు తిరుప్పకుండ్రం దీపం వివాదాన్ని ఆయుధంగా మార్చేసుకుంది. తిరుప్పరంకుండ్రం ప్రాంతాన్ని దక్షిణ అయోధ్య గా ప్రకటించేసింది హిందూత్వ ఎజెండాను బలంగా వినిపిస్తోంది.
తమిళనాడులో అన్ని పార్టీలదీ ద్రవిడ వాదమే
తమిళనాడులో దశాబ్దాలుగా అన్ని పార్టీల భావజాలం ద్రవిడ వాదమే. డీఎంకే, అన్నాడీఎంకే సహా అందరిదీ అదే వాదన .ఇది హిందత్వానికి వ్యతిరేకం. సామాజిక న్యాయం, సమానత్వం , ప్రాంతీయ ఆత్మగౌరవం , కుల వివక్షను రూపుమాపడం, బ్రాహ్మణవ్యతిరేకత ఉద్యమాలతో ఇది నిర్మితం అయింది. హేతువాదం , ఆత్మగౌరవ వివాహాల వంటి పద్ధతుల ద్వారా మతపరమైన అంశాలపై ముఖ్యంగా హిందూ వ్యతిరేకతను చూపిస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతమే దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. కొత్త పార్టీలు అయినా సరే ఈ భావజాలనికే ప్రాధాన్యత ఇస్తాయి.
ద్రవిడ వాదానికిపూర్తి వ్యతిరేకంగా బీజేపీ హిందూత్వ వాదం
ద్రవిడ వాదాన్ని వ్యతిరేకించడానికి భయపడే పరిస్థితుల్లో బీజేపీ అక్కడ తమ వాదాన్ని గట్టిగా వినిపిస్తోంది. ద్రవిడ రాజకీయాలకు చెక్ పెట్టాలంటే కేవలం అభివృద్ధి మంత్రం సరిపోదని బీజేపీ భావిస్తోంది. అందుకే, ఉత్తర భారత్ లో విజయవంతమైన అయోధ్య సెంటిమెంట్‌ను తమిళనాట స్థానిక ఆధ్యాత్మికతతో ముడిపెడుతోంది. తిరుప్పరంకుండ్రం వంటి చారిత్రక ,ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను హైలైట్ చేయడం ద్వారా, ఆ రాష్ట్రంలోని హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయాలనేది పార్టీ ప్రధాన ఉద్దేశ్యం. తమిళనాడులో మురుగన్ ఆరాధన ఎక్కువ. బీజేపీ తన వేల్ యాత్ర ద్వారా ఇప్పటికే మురుగన్ భక్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు దక్షిణ అయోధ్య అనే నినాదంతో రాముడిని, మురుగన్ వంటి స్థానిక దైవాలను కలిపి ఒకే ఆధ్యాత్మిక గొడుగు కిందికి తీసుకురావాలని చూస్తోంది.
ద్రవిడ వాదంపై పెరుగుతున్న విముఖత
ద్రవిడవాదంలో ప్రధానంగా దేవుళ్లను నమ్మక పోవడమూ ఉంటుంది. కానీ తమిళనాడు ప్రజలకు భక్తి ఎక్కువ. ఓ వైపు మత మార్పిళ్లు పెరగడం, ఇతర మతాలకు చెందిన వారు తమ మతాల గురించి పొటెక్టివ్గాఉంటే.. హిందూవులు మాత్రం ఎందుకు తమ మతాన్ని కించ పర్చుకోవాలన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. అందుకే బీజేపీ వాదానికి మద్దతు పెరుగుతోంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకున్న బీజేపీ, 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే ఆ లక్ష్యం అందుకునేలా కనిపిస్తోంది.
