హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీనుంచి టీఆర్ఎస్లోకి జంప్ చేసిన తెలంగాణ సీనియర్ నేత డి.శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ సముచితరీతిలో గౌరవించారు. డీఎస్‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే రమణాచారి వంటి కొందరు సలహాదారులు ఉన్నప్పటికీ వారికంటే కాస్త భిన్నంగా ప్రత్యేక సలహాదారుగా, అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా డీఎస్‌ను నియమించారు. ఆయనకు క్యాబినెట్ హోదాను కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు. డీఎస్ టీఆర్ఎస్లో చేరినపుడు – ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొచ్చని కొందరు… పదవులతో ఊరించి పార్టీలోకి తీసుకుని, తర్వాత ఏమీ ఇవ్వకుండా రెంటికీ చెడ్డ రేవడిలా చేస్తారని మరికొందరు – పలు ఊహాగానాలు చేశారు. అయితే వాటన్నింటికీ భిన్నంగా, అందరి అంచనాలకు విరుద్ధంగా కేసీఆర్ ఈ సలహాదారు పదవి ఇచ్చారు.
ప్రత్యేక సలహాదారుగా నియమించినందుకు కేసీఆర్‌కు డీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. తన అనుభవం మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సీఎమ్‌కు తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనను దశాబ్దకాలంలో పూర్తి చేయటానికి కృషి చేస్తానని అన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌లో చిరకాలం ఉండి అన్ని పదవులూ అనుభవించి మంచి స్థితికెళ్ళిన డీఎస్ ఆ పార్టీని కాలదన్ని టీఆర్ఎస్లోకి జంప్ చేసినందుకు – వ్రతం చెడ్డా ఫలం దక్కినట్లు – మంచి ప్రతిఫలమే దక్కింది.