అటు తిరిగి.. ఇటు తిరిగి.. ‘ఎల్లమ్మ’ చివరికి దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వెళ్లింది. ముందు నాని పేరు వినిపించింది. ఆ తరవాత నితిన్ అన్నారు. శర్వానంద్, కార్తి పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తెరపైకి వచ్చాడు. దర్శకుడు వేణు దేవిని కలవడం, కథ చెప్పడం జరిగిపోయాయి. దిల్ రాజుతో దేవిశ్రీ ప్రసాద్ కి ఉన్న అనుబంధం రీత్యా.. ఈ ఆఫర్ని కాదనలేకపోయారు.
దేవిశ్రీ ప్రసాద్ వయసు ఇప్పుడు 46 ఏళ్లు. ఓరకంగా హీరోగా ఇది లేట్ ఎంట్రీ. కాకపోతే.. దేవిశ్రీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు తనకు హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద బ్యానర్లు, దర్శకులు దేవి హీరోగా ఓ సినిమా చేయాలనుకొన్నారు. కానీ దేవిశ్రీ మాత్రం సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. తనకూ హీరోగా తెరపైకి రావాలని ఉండేది. కానీ `సంగీతం, నాట్యం.. ఈ రెండు అంశాలకూ ప్రాధాన్యం ఉన్న కథే ఎంచుకొంటా అని చెబుతుండేవాడు. అలాంటి కథలు వెళ్లినా, దేవిశ్రీకి నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు `ఎల్లమ్మ` తనకు అన్ని విధాలా నచ్చింది. దేవిశ్రీ కోసం కూడా ఈ కథలో కొన్ని కీలకమైన మార్పులు చేస్తున్నారు. నితిన్ కోసం రాసిన వెర్షన్ కీ, దేవిశ్రీ ప్రసాద్ కోసం రాస్తున్న వెర్షన్ కీ చాలా తేడా వుందిప్పుడు.
ఈ సినిమాకు సంగీత దర్శకత్వం కూడా దేవిశ్రీనే నెత్తిమీద పెట్టుకొన్నాడని టాక్. ఓవైపు హీరోగా నటిస్తూనే, సంగీతం అందించాలంటే పెద్ద టాస్క్. పైగా ఇది తన తొలి సినిమా. కథలో సంగీతం, నాట్యానికి పెద్ద పీట వేశారు. సంగీతం విషయం తానే చూసుకోవాలి. ఓవైపు తాను స్వరకర్త బాధ్యత నిర్వహించే సినిమాలు చాలా ఉన్నాయి. అందులో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పుడు హీరోగా ఓ సినిమ చేస్తూ, అదే సినిమాకు స్వరాలు అందించడం అంటే పెద్ద టాస్కే. ఈ భారాన్ని దేవిశ్రీ ప్రసాద్ ఎలా మోస్తాడో చూడాలి. 2026 సంక్రాంతి తరవాత.. ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈలోగా కొంత సమయం ఉంది. ఈ గ్యాప్ లో కథలో మార్పులు పూర్తవుతాయి. దేవిశ్రీ కూడా మానసికంగా సిద్ధం అయ్యే వీలు వుంది.
