Dude Movie Telugu Review
Telugu360 Rating: 2.75/5
లవ్ టు డే.. డ్రాగన్.. ఆ రెండు సినిమాలను డీకోడ్ చేస్తే.. మొదట్లో జాలీగా ఉండే హీరో, చివర్లో ఎమోషనల్ టర్న్ తీసుకొని, ఫైనల్గా ఓ మెసేజ్ ఇచ్చి కథకు ఎండ్ కార్డు వేస్తాడు. ప్రదీప్ రంగనాథన్ పట్టిన ఈ ఫార్ములా యూత్ కి కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు డ్యూడ్ ప్రమోషనల్ కంటెంట్ లో కూడా అదే ఛాయలు కనిపించాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. మరి డ్యూడ్ లో హిట్ ఫార్ములా రిపీట్ అయ్యిందా? డ్యూడ్ పంచిన వినోదం ప్రేక్షకుల మనుసుని గెలించిందా?
గగన్ (ప్రదీప్ రంగనాథన్) మేనమామ కూతురు కుందన (మమితా బైజు). ఇద్దరూ కాలేజ్ మేట్స్ కూడా. కుందన గగన్ ని ఇష్టపడుతుంది. అయితే కుందన అంటే గగన్ కి ఫీలింగ్స్ వుండవు. ఫ్రెండ్ గానే చూస్తాడు. లవ్ రిజక్షన్ తో బాధపడ్డ కుందన పార్ధు (హృదూ హరూన్)ని ఇష్టపడుతుంది. అయితే గ్యాప్ లో గగన్ కి కుందన పై లవ్ ఫీలింగ్స్ వస్తాయి. తర్వాత ఏం జరిగింది? గగన్ కుందనకి లవ్ ప్రపోజ్ చేశాడా? అప్పటికే పార్ధు ప్రేమలో వున్న కుందన ఎలా రియాక్ట్ అయ్యింది? మేనమామ ఆదికేశవులు(శరత్ కుమార్) కారణంగా ఈ ముగ్గురి ప్రేమలు ఎలాంటి మలుపు తీసుకున్నాయనేది మిగతా కథ.
డ్యూడ్ కథ ట్రైలర్ లో చెప్పలేదు కానీ ఓ ప్రెస్ మీట్ లో దర్శకుడు కీర్తి ఈశ్వరన్ ఓపెన్ అయ్యాడు. ఆర్య సినిమా కథ రాయడానికి స్ఫూర్తి అని ప్రకటించాడు. అతని నిజాయితీని మెచ్చుకోవాలి. డ్యూడ్ కథ ఆర్య సినిమాల్లోని ముక్కే. స్నేహితుడి కోసం త్యాగం చేసే పాత్రలో బన్నీ కనిపిస్తే ఇక్కడ మరదలి కోసం త్యాగమూర్తి అవతారం ఎత్తుతాడు ప్రదీప్. దీనికి హానర్ కిల్లింగ్ పాయింట్ జోడించి, నువ్వేకావలి, సొంతం లాంటి సినిమాల్లోని లవ్ ఫ్రెండ్షిప్ ఫీలింగ్స్ లాంటి ఎమోషన్స్ ని కూడా కలిపేశారు.
డ్యూడ్ తొలిసగం సాఫీగానే సాగిపోతుంది. నిజానికి చాలా తర్వగా అయిపోయిన ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. ప్రదీప్ మమిత జోడి చూడబుల్ గా వుంటుంది. ఈ ఇద్దరూ కలిస్తే బావుటుందనే ఫీలింగ్ కూడా కలిగించింది. అసలు సమస్య సెకండ్ హాఫ్ లోనే వుంది. పరువు హత్య పాయింట్ ఎలివేట్ చేయాలనుకున్న దర్శకుడు ప్రేమకథలోని ఎమోషన్ ని పక్కనపెట్టి ప్రేక్షకుడికి పట్టని సన్నివేశాలు అల్లుకుంటూ వెళ్ళాడు. గగన్, కుందన ట్రాక్ లోని ఫీల్.. రెండో ప్రేమకథలో వుండదు. పార్ధు క్యారెక్టర్ పానకంలో పుడకలా చేశారు. దీంతో ఎమోషన్ అంతా పక్కదారి పట్టింది. క్లైమాక్స్ లో ఓ మెసేజ్ ఇచ్చారు కానీ అది కేవలం డైలాగ్ కే పరిమితమైయింది.
ప్రదీప్ ఎనర్జీటిక్ గా కనిపించాడు. తన స్టయిల్ మేనరిజం అలరించేలా వున్నాయి. మమితకి నేచురల్ గ్రేస్ వుంది. ఫస్ట్ సాంగ్ లో తను చేసిన డ్యాన్స్ చూడముచ్చటగా వుంటుంది. ఆ గ్రేస్ ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదు. శరత్ కుమార్ పాత్ర ఈ సినిమాలో ప్రత్యేకంగా నిలిచింది. ఆయన ఇలాంటి పాత్రలో చేయడం కొత్తదనం తీసుకొచ్చింది. సత్య వున్నాడు కానీ నవ్వులు లేవు. నేహ శెట్టిది గెస్ట్ రోల్. రోహిణి ఎప్పటిలానే నేచురల్ గా కనిపించింది.
సాయి అభ్యంకర్ మ్యూజిక్ లో ఒక వైబ్ వుంది.ఒకటే ట్రాక్ ని డిఫరెంట్ సిట్యువేషన్స్ లో వాడిన తీరు బావుంది. నికేత్ బొమ్మి కెమరా వర్క్ కి మంచి మార్కులు పడతాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ రిచ్ గా వుంది. ప్రేమకథ, పరువు హత్య..ఈ రెండిని మిక్స్ చేసి ఓ యూత్ ఫుల్ ఫన్ ఫిల్మ్ తీయడం అంత తేలిక కాదు. సెకండ్ హాఫ్ ని డీల్ చేయడం కొత్త దర్శకుడి అనుభవలేమి కనిపించింది. లవ్ టుడే, డ్రాగన్ లాంటి వినోదం ఆశించకుండ వెళ్ళడమే బెటర్.
Telugu360 Rating: 2.75/5