ఈ వేసవికి సరైనోడుగా వచ్చి సందడి చేశాడు బన్నీ. సమ్మర్ సీజన్ బన్నీకి బాగా కలిసొచ్చింది. సినిమాకి పాజిటీవ్ టాక్ రావడం, బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో బాగా సొమ్ములు చేసుకొన్నాడు. తన కెరీర్లో వసూళ్ల పరంగా సరైనోడు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే ఈసారీ సమ్మర్ నే టార్గెట్ చేశాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `డి.జె..దువ్వాడ జగన్నాథమ్` ఈరోజు హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది. ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానమ్ లో ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టారు. సినిమా మొదలెట్టడమే కాదు.. రిలీజ్ టైమ్ కూడాచెప్పారు. 2017 వేసవి బరిలో ఈ చిత్రాన్ని నిలుపుతున్నట్టు దిల్‌రాజు ప్రకటించాడు. సో.. సమ్మర్‌కి బన్నీ కర్చీఫ్ వేసేసినట్టే.
ఆర్య సినిమా నుంచీ అల్లుఅర్జున్‌తో కలసి సినిమా చేయాలని అనుకుంటున్నానని, ఆ ఆ కోరిక ఇప్పటికి తీరిందని హరీష్ శంకర్ చెబుతుతన్నాడు. బన్నీతోనూ, హరీష్‌తోనూ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని దిల్‌రాజు చెప్పాడు. రెగ్యులర్ సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తామని ఏప్రిల్ మొదటివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ప్రస్తుతం వాళ్ల కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్లని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.