రివ్యూ: దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌

అల్లు అర్జున్ – దిల్ రాజు కాంబో
సూప‌రః సూప‌ర‌స్య‌.. సూప‌ర‌భ్యోః
దానికి హ‌రీష్ కూడా యాడింగు…
ఇది ఇంకా అదురస్యః
సినిమా పేరు.. డీజే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌
ఇది ఇంకా అద్భుత‌హ‌స్య‌…

– ఇలా డీజేపై ఎన్ని ఆశ‌లు పెట్టుకొన్నారో సినీ జ‌నాలు. అల్లు అర్జున్ స్టైలీష్ స్టార్‌! ఆయ‌న మాట, న‌డ‌క‌, డాన్స్ అన్నీ స్టైలీష్‌గానే ఉంటాయి. అలాంటిది అల్లు అర్జున్ పంచె క‌ట్టుకొని.. ‘ల‌వ్వః ల‌వ్వ‌స్య ల‌వ్వోభ్య‌హ‌’ అంటుంటే.. గుండెలు గులాబ్ జాములైపోవూ.
అదుర్స్‌లో ఎన్టీఆర్‌లా..
ముగ్గురు మొన‌గాళ్ల‌లో చిరంజీవిలా… అద‌ర‌గొట్టేయ‌డం ఖాయం అనేసుకొంటారు.
పైగా గ‌బ్బ‌ర్ సింగ్‌.. పేరు చెప్పుకొంటూ సినిమాలు ద‌క్కించుకొంటున్న – హ‌రీష్ శంక‌ర్ ఉండ‌నే ఉన్నాడు. ఇది ఇంకా అతిసూప‌ర‌స్య‌..:
మ‌రి.. ఈ అంచ‌నాలు ఏమయ్యాయి. పులిహోర‌లో ఇంగువ‌లా క‌లిసిపోయాయా? క‌రివేపాకులా తేలిపోయాయా?

* క‌థ‌

అత‌ని పేరు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. వృత్తి.. వంట‌వాడు. కానీ కోపం ఎక్కువ‌. త‌న కళ్ల ముందు అన్యాయం జ‌రిగితే స‌హించ‌లేడు. చిన్న‌ప్పుడు అక్క‌ని ఏదో అన్నార‌ని… మ‌క్కిలు ఇర‌గ్గొట్టేస్తాడు. ఆ కోపం ప‌నికి రాదంటూ…. నాన్న (త‌నికెళ్ల భ‌ర‌ణి) రుద్రాక్ష మెళ్లో వేస్తాడు. ”రుద్రాక్ష ఉన్నన్ని నాళ్లు.. ఎవ‌రిపైనా చేయి చేసుకోకు.. రుద్రాక్ష‌ని నీ చేతుల్తో తీస్తే… నా మీద ఒట్టే..” అంటూ ఒట్టు వేయించుకొంటాడు. రుద్రాక్ష మెళ్లో ఉంటే.. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. తీసేస్తే.. డీజే. అదే కోపంతో చిన్న‌ప్పుడే.. గ‌న్ను ప‌ట్టేస్తాడు. త‌న‌లో ఉన్న ఫైర్ ని చూసిన పోలీస్ ఆఫీస‌ర్ (ముర‌ళీ శర్మ‌) డీజేతో క‌ల‌సి ర‌హ‌స్య ఆప‌రేష‌న్స్ చేస్తుంటాడు. అలా దువ్వాడ‌.. త‌న‌లోని డీజేని అప్పుడ‌ప్పుడూ ఈలోకానికి ప‌రిచ‌యం చేస్తుంటాడు. తొమ్మిది వేల కోట్ల స్కామ్ చేసి, ఎంతోమంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటంబాల‌తో ఆడుకొంటాడు రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేష్‌). త‌న‌ని ప‌ట్టించి, ఆ తొమ్మిది వేల కోట్ల ధ‌నాన్ని ప్ర‌భుత్వానికి అప్ప‌గించ‌డ‌మే.. డీజే ముందున్న తాజా టాస్క్‌. దాన్ని ఎంత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాడు? ఆ ప్ర‌యాణంలో త‌న‌కు ఎదురైన ఆటంకాలేంటి? అనేదే ‘డీజే’ క‌థ‌.

* విశ్లేష‌ణ‌

ప్ర‌జెంటింగ్ ద మోస్ట్ ఇంట్ర‌స్టింగ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ క్యారెక్ట‌ర్ – డీజే
అంటూ ప్ర‌చార చిత్రాల్లో వాయించేశారు. నిజంగా డీజే కంటే… దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌దే ఎంట‌ర్‌టైనింగ్ క్యారెక్ట‌ర్‌. ఆ క్యారెక్ట‌ర్ చుట్టూ అల్లుకొన్న స‌న్నివేశాలు, డైలాగులు సినిమాని న‌డిపించాయి. తొలిభాగంలో ద‌ర్శ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ఛ‌మ‌క్కులు, శాస్త్రిగా…బ‌న్నీ మెరుపులు, పూజ పాత్ర‌లో పూజా హెగ్డే అందాలూ – ఇవ‌న్నీ బాగా ప్ల‌స్ అయిపోయాయి. క‌థ బ‌ల‌హీనంగా ఉన్నా, ఈ సినిమాలో ఏం జ‌ర‌గ‌బోతోందో తొలి ప‌ది నిమిషాల్లోనే తేలిపోయినా… వినోదానికి ఢోకా లేకుండా చూసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌లం అయ్యాడు. దాంతో.. ఫ‌స్టాఫ్‌లో కంప్లైంట్లు పెద్ద‌గా ఏమీ ఉండ‌వు. కాక‌పోతే.. చిన్న పిల్లాడి చేతికి గ‌న్ ఇచ్చి.. పిట్ట‌ల్ని కాల్చిన‌ట్టు మ‌నుషుల్ని కాల్పించ‌డం ఏమిటో?? అదేం హీరోయిజ‌మో అర్థం కాదు. ఇవ‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో మామూలే.. అనుకొని స‌ర్దుకుపోవాలి. పెళ్లి కొడుకు – పెళ్లి కూతురు ఒక‌రిని ఒక‌రు చూసుకోకుండా పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం.. ఆ స్థానంలో హీరో హీరోయిన్లు వెళ్ల‌డం.. ఇదంతా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి కాన్సెప్ట్‌. దాన్ని ప‌ట్టుకొని రెండు మూడు స‌న్నివేశాలు, ల‌వ్ ట్రాక్ లాగించేశారు. పూజా – బ‌న్నీల ల‌వ్ ట్రాక్ క‌థ‌కు అత‌క‌లేదు. ఆయా సీన్ల‌లో పూజా తాలుకు గ్లామ‌ర్ క‌నిపించింది త‌ప్ప‌.. ప్రేమ కాదు. హీరోయిన్ క్యారెక్ట‌రైజేష‌న్ కూడా అంతంత మాత్రంగా ఉంది. మ‌ల్టీమిలియ‌నీర్‌తో పెళ్లి అన‌గానే చంక‌లు గుద్దుకొంటూ వెళ్లిపోయి.. చివ‌రికి వాడి పిచ్చి న‌చ్చ‌క‌.. బెంబేలెత్తిపోయి.. అప్పుడు జ‌గ‌న్నాథ‌మ్ కోసం ప‌రుగు ప‌రుగున రావడంతో పూజా పాత్ర తేలిపోయిన‌ట్టైంది. సినిమా చూస్తుంటే లాజిక్ లేని స‌న్నివేశాలు చాలా చాలా క‌నిపిస్తాయి.

రొయ్య‌ల నాయుడు పాత్ర‌ని భ‌యంక‌రంగానే ప‌రిచ‌యం చేశాడు. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఆ పాత్ర ఎందుకో జోక‌ర్‌లా బిహేవ్ చేస్తుంటుంది. రావు గోపాల‌రావు పాత్ర‌ని రావు ర‌మేష్ చేయ‌డం ఓకే. కానీ.. మ‌క్కీకి మ‌క్కీ రావు గోపాల‌రావునే దించేయాల‌నుకోవ‌డం పులికి చూసి నక్క వాత పెట్టుకొన్న‌ట్టే. హీరో విల‌న్ల మ‌ధ్య పోరు తేలిపోవ‌డంతో సెకండాఫ్ ర‌క్తి క‌ట్ట‌లేదు. ప‌తాక స‌న్నివేశాల్లో ఫైట్ తీసేసి త‌ల‌నొప్పిని దూరం చేయ‌డం మంచి ఎత్తుగ‌డే. కానీ.. ఆ ప్లేస్‌ని సిల్లీ కామెడీ సీన్ల‌తో భ‌ర్తీ చేయ‌డం మాత్రం భ‌రించ‌లేనిది. దుబాయ్‌లో బ‌న్నీ – సుబ్బ‌రాజు మ‌ధ్య సాగిన సీన్లు మ‌రీ ఓవ‌ర్‌గా అనిపిస్తాయి. ఇంత తెలివైన‌వాడు, ఇంత బ‌ల‌వంతుడూ.. ఓ జోక‌ర్ ని ప‌ట్టుకొని త‌న స‌మ‌స్య సాల్వ్ చేసుకోవ‌డం ఏమిటో? ఇలాంటి క్లైమాక్స్‌లు అల్ల‌రి న‌రేష్ లాంటి హీరోల‌కు సూట‌వుతాయేమో. బ‌న్నీకి కాదు.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

డీజే – దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌… ఈ రెండు షేడ్స్‌ని బాగా పండించాడు బ‌న్నీ. దువ్వాడ‌గా బ‌న్నీ యాస, మాట‌లు, బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. అయితే ప్ర‌తీ సారీ… ‘ఈ స‌భ్య‌స‌మాజానికి’ అంటూ ఒకే డైలాగ్ ని రిపీట్ చేయ‌డం న‌చ్చ‌దు. బ‌న్నీ డాన్సులు బాగున్నా.. బ‌న్నీ స్థాయి కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బ‌న్నీ డాన్సుల్లో ఓ మెరుపు ఉంటుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే స్టెప్పులు ఉంటాయి. అవి ఈ సినిమాలో మిస్ అయ్యాయి. ఎమోష‌న్ ప‌రంగా.. పూర్తి న్యాయం చేశాడు. రొయ్య‌ల‌నాయుడు ఎవ‌రో తెలుసుకోవానే సీన్‌లో బ‌న్నీ న‌ట‌న బాగుంది. పూజా పాత్ర గ్లామ‌ర్‌కే ప‌రిమితం. మ‌రో ఇలియానా రేంజ్‌లో పూజాని చూపించారు. రొయ్య‌ల నాయుడుగా రావు ర‌మేష్ నుంచి చాలా ఆశిస్తాం. కానీ.. యావ‌రేజ్ మార్కుల‌తో పాసైపోయాడు రావు ర‌మేష్‌. ఆ పాత్ర‌ని ఎత్తుకొన్న తీరు బాగున్నా.. మ‌లిచిన తీరు అంత‌గా నప్ప‌లేదు. భ‌ర‌ణి, వెన్నెల కిషోర్‌, చంద్ర‌మోహ‌న్‌.. వీళ్లంతా పాత్ర‌ల ప‌రిధిమేర న‌టించి మెప్పించారు.

* సాంకేతికంగా

దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా. రీలు రీలులోనూ కోట్లు క‌నిపించాయి. సినిమాని స్టైలీష్ గా తీర్చిదిద్దారు. దేవి పాట‌లు అంతంత‌మాత్ర‌మే. ఈమ‌ధ్య దేవి నుంచి వ‌చ్చిన వీక్ ఆల్బ‌మ్ ఇది. కెమెరా వ‌ర్క్ సినిమా స్థాయిని పెంచేలానే ఉంది. ద‌ర్శ‌కుడిగా తేలిపోయిన హ‌రీష్ రైట‌ర్‌గా మెప్పిస్తాడు. అయితే త‌న క‌లం నుంచి కూడా బూతులు రాలాయి. అదీ.. దువ్వాడ పాత్ర నుంచి వినిపించ‌డం బాధాక‌రం. మ‌రి ఈసారి… బ్రాహ్మ‌ణ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇంత బ‌ల‌హీన‌మైన క‌థ‌ని దిల్‌రాజు ఓకే చేశాడంటే.. అతనేం తెలివిత‌క్కువ వాడు కాదు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఇచ్చే ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో ఈ సినిమా న‌డిచిపోతుంద‌ని భావించి ఉంటాడు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వ‌స్తే.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డితే… దానికి కార‌ణం.. దువ్వాడ పాత్రే అవుతుంది.

* ఫైన‌ల్ ట‌చ్ : అంత‌గా లేద‌శ్య‌..

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.