రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌తో ఇబ్బంది పడిన హరీష్ శంకర్.. సుబ్రమణ్యమ్ ఫర్ సేల్‌తో మళ్లీ కుదురుకున్నాడు. ఆ సినిమానే ఇప్పుడు అల్లు అర్జున్‌తో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. బన్నీ – హరీష్ కాంబినేషన్లో దువ్వాడ జగన్నాథమ్ ఇటీవల సెట్స్‌పైకి వెళ్లింది. షూటింగ్ మొదలైన రోజు నుంచీ ఇప్పటి వరకూ నిరవధికంగా చిత్రీకరణ సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2017 ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల చేయాలని పట్టుదలతో ఉంది చిత్రబృందం. సినిమా కూడా బాగా వస్తోందట. అయితే మరోవైపు ఈ సినిమాపై వస్తున్న రూమర్లపై చిత్రబృందం నిరాశగా ఉంది. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తాడని, అదుర్స్ సినిమాకీ ఈ కథకీ దగ్గరి సంబంధాలున్నాయని, ఈ సినిమా కోసం బన్నీ బ్రాహ్మణ యాసని ప్రత్యేకంగా నేర్చుకొన్నాడని .. ఈ సినిమా మొదలవ్వకముందే వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చేశాయి. వీటిలో నిజానిజాలెలా ఉన్నా దువ్వాడ టీమ్ మాత్ర కాస్త నిరాశకు లోనైంది.
కీలకమైన విషయాలు తెరపై చూస్తే థ్రిల్ అయ్యే సంగతులూ ముందే బయటకు వచ్చేయడం ఏమిటి? లీకేజీ వార్తలు ఇస్తున్నదెవరు? అనే విషయంలో దిల్‌రాజు, బన్నీ తర్జన భర్జనలు పడుతున్నారని సమాచారం. ఈ సినిమా అప్ డేట్స్ మీడియాకు తెలియకూడదని, ఏ కీలక సమాచారమైనా దిల్‌రాజు చెప్పే వరకూ ఎవ్వరూ నోరు మెదపకూడదని స్పష్టమైన ఆదేశాలు అందాయట. ఈరోజుల్లో సోషల్ మీడియా చాలా యాక్టీవ్‌గా ఉంది. చిటికెలో సమాచారం అందిపోతోంది. సినిమా గురించి ముందే తెలిసిపోతే.. కిక్ పోతుందని, అందుకే వార్తలు బయటకు పొక్కకుండా జాగ్రత్తపడాలని భావిస్తున్నార్ట. సినిమా పూర్తయి విడుదల కాకమునుపే పైరసీ రూపంలో బయటకు వచ్చేసే ప్రమాదకరమైన రోజులివి. ఇలాంటి గాసిప్పులు ఆగుతాయా??