హైదరాబాద్లో చీరల దుకాణం పెట్టుకున్నాడు.. ఇక చీరలు మడతేసుకుంటాడని అనుకుంటున్నారా.. రాజకీయాల్ని కూడా మడతెట్టేస్తా అనే డైలాగ్తో దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయనకు ఇప్పుడు పార్టీ లేదు. వైసీపీ సస్పెండ్ చేసింది. ఇది ఓ గౌతం రెడ్డిలా.. మరో అనంతబాబులా చేసిన సస్పెన్షన్ కాదు. పార్టీకి అక్కర్లేదని చేసిన సస్పెన్షనే.
అయితే తన రాజకీయ ఆశలు మాత్రం దువ్వాడ మోసుకుంటూ తిరుగుతున్నారు. దివ్వెల మాధురీతో కలిసి వ్యాపారాలు, రీల్స్ చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. ఇక టైం వచ్చిందని రంగంలోకి దిగారు. ఓ కాలేజీ ప్రిన్సిపాల్ విషయంలో వైసీపీ నేతలు టార్గెట్ చేసిన కూన రవికుమార్ కు అండగా నిలిచారు. కూన కు తాను ఉన్నానని ప్రకటించారు. ధర్మాన, అచ్చెన్న కలిసి ఆయనను టార్గెట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కూనకు.. దువ్వాడకు ఎక్కడ కలిసిందంటే.. ఇద్దరిదీ కాళింగ వర్గమే.
కూన రవికుమార్ పై ఇప్పటి వరకూ ఎలాంటి ఆరోపణలు లేవు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. ఇవాళ కాకపోతే రేపైనా ఆయనకు మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై ఓ మహిళా ప్రిన్సిపాల్ ఆరోపణలు చేయడం.. అదే సందు అని వైసీపీ పెద్దది చేయడంతో రాజకీయం అయింది. ఇప్పుడు ఆ సమస్యను కాళింగులపై దాడిగా దువ్వాడ మార్చేశారు. తన సామాజికవర్గం మద్దతు తనకు ఉంటే… సరిపోతుందని.. ఆయన భావిస్తున్నారు. ఏదో ఓ పార్టీ అవకాశం ఇస్తుందని నమ్ముతున్నారు. మరి ఏ పార్టీకి ఆ చాన్స్ దక్కుతుందో ?