వైసీపీ బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం పొలిటికల్ చౌరస్తాలో నిలబడి ఉన్నారు. ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు. కూటమి పార్టీలు చేరదీసే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇప్పటికిప్పుడు వైసీపీ ఆహ్వానించే పరిస్థితీ లేదు. దీంతో ఆయన రాజకీయ జీవితం సందిగ్ధంలో పడింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో వాలిపోయిన దివ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురిలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , హరితసేనలో భాగంగా మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినదిగా ఆ పార్టీ ప్రొజెక్ట్ చేసుకుంది. కేసీఆర్ హయాంలో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ కుమార్ అధ్వర్యంలో కొనసాగింది. అనూహ్యంగా ఇప్పుడు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దువ్వాడ పాల్గొని మొక్కలు నాటడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలోనూ ఆ పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు. అధికారం కోల్పోవడంతో ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా వస్తే బాధ్యతలు అప్పగించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రస్తుతం దువ్వాడకు ఏపీలో షెల్టర్ ఇచ్చేందుకు ఏ పార్టీ సుముఖంగా లేదు. దీంతో ఆయన బీఆర్ఎస్ లో చేరాలనే తలంపుతో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారా? అనే చర్చ జరుగుతోంది.