ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజా చర్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతున్నాయి. సుమారు రూ. 441.63 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన ఈడీ, తన దర్యాప్తులో అత్యంత కీలకమైన మనీ ట్రయిల్ ను గుర్తించినట్లు ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో అడ్వైజర్‌గా పనిచేసిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి వంటి వారి ఆస్తులపై ఈడీ కొరడా ఝుళిపించడం, ఈ కేసులో తదుపరి అడుగు అరెస్టులేనన్న సంకేతాలను ఇస్తోంది.
హడావుడి లేకుండా దర్యాప్తు చేస్తున్న ఈడీ
ఈ కేసులో ఈడీ అనుసరిస్తున్న వ్యూహం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత కొద్ది నెలలుగా ఎక్కడా హడావుడి చేయకుండా, నిశ్శబ్దంగా ఆధారాలను సేకరించిన ఈడీ అధికారులు, ఇప్పుడు నేరుగా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు దిగారు. ఇప్పటికే ఏపీ సిట్ విచారణలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అవినాష్ రెడ్డి వంటి కీలక నిందితులను అరెస్టు చేయగా, ఈడీ మాత్రం తన పరిధిలోని మనీ లాండరింగ్ కోణంలో లోతైన విచారణ పూర్తి చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా ఈడీ సాగిస్తున్న ఈ దర్యాప్తు త్వరలోనే మరికొంతమంది పెద్దల అరెస్టులకు దారితీస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాజకీయ బాసు వద్దకు వెళ్తున్న ఈడీ
ప్రస్తుతం అందరి దృష్టి ఈ కుంభకోణంలోని రాజకీయ బాసుల పైనే ఉంది. ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను ఈడీ బయటకు లాగబోతోందని చెబుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలను ఈడీ విచారించడంతో, ఈ ఉచ్చు ఎక్కడి వరకు వెళ్తుందనే ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది. ప్రతి నెలా వందల కోట్ల రూపాయల కిక్‌బ్యాక్‌లు ఎవరికి చేరాయి? అన్న అంశంపై ఈడీ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, త్వరలోనే సంచలనాత్మక అరెస్టులు ఉంటాయని టీడీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.
వైసీపీ అగ్రనేతల్లో టెన్షన్
వైసిపి శ్రేణుల్లో తీవ్ర అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో జరిగిన ఆర్థిక నేరాలపై వరుసగా కేంద్ర సంస్థలు దృష్టి సారించడం ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఒకవైపు సిట్ దర్యాప్తు, మరోవైపు ఈడీ ఆస్తుల జప్తు చూస్తుంటే.. ఈ కేసులో బ్రేక్ త్రూ లభించినట్లే కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న అధికారులు, మధ్యవర్తులు ఇప్పటికే నోరు విప్పుతుండటంతో, త్వరలోనే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.