బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని హైదరాబాద్ పోలీసులు కేసులు పెట్టి అందులో వారి తప్పేమీ లేదని .. కేసు నిరూపించలేమని చెప్పి లైట్ తీసుకున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఓనర్లను పట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని లీకులిచ్చి ఆ కేసును షెడ్డుకు పంపారు. అయితే అలా కేసు నమోదు చేయడమే వారికి శాపంగా మారుతోంది. ఆ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
నిజానికి స్కిల్స్ గేమ్స్ కు ప్రమోట్ చేయడానికి లీగల్ గా అనుమతి ఉంది. బెట్టింగ్ నిర్వచనంలో ఉన్న తేడాలతో చాలా మంది బెట్టింగ్ యాప్లు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించుకున్నారు. అయితే చాలా మంది సెలబ్రిటీలు తర్వాత డ్రాప్ అయిపోయారు. ఇది జరిగిన చాలా ఏళ్ల తర్వాత వారిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసుల ఆధారంగా ఈడీ విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, మంచు లక్ష్మి వంటి 29 మంది సినీ ప్రముఖులపై మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద ఈడీ కేసులు నమోదు చేసింది.
ఈ విషయంపై ఈడీ వీరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. నిజానికి దేశంలో బెట్టింగ్ యాప్స్ విజృంభణ ఉంది. ఐపీఎల్ జరుగుతూంటే.. ప్రతి ఆటగాడూ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తారు. అయితే వాటిని బెట్టింగ్ అని కాకుండా స్కిల్ గేమ్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ సెలబ్రిటీల్లో చాలా మంది ఆ స్కిల్ గేమ్ పేరుతో కూడా అనుమతులు తెచ్చుకోలేదు. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా లాంటి వారు అనుమతి ఉన్న వాటికే ప్రచారం చేశామంటున్నారు.