వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా తాజాగా ధనుంజయ్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యలను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణకు హాజరైన సమయంలో తమ బ్యాంకు స్టేట్మెంట్లు, పాన్ కార్డులు , తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల వివరాలను వారు అధికారులకు సమర్పించారు. మద్యం విధానంలో జరిగిన అవకతవకలు, నిధుల మళ్లింపుపై ఈ ముగ్గురి నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.
ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను ఈడీ విచారించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద ఓఎస్డీ గా పనిచేసిన కృష్ణ మోహన్ రెడ్డితో పాటు, రాజ్ కేసిరెడ్డి పీఏ దిలీప్లను కూడా అధికారులు విచారించి వివరాలు సేకరించారు. మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సుల కేటాయింపులో జరిగిన లావాదేవీల గురించి వీరి నుంచి కీలక సమాచారం లభించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరికొంతమంది ఉన్నతాధికారులకు, రాజకీయ నేతలకు త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉంచగా, ఈడీ అధికారులు కోర్టు అనుమతితో అక్కడే ఆయనను విచారించారు. మద్యం సిండికేట్లు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారు, ముడుపులు ఎక్కడికి చేరాయి అనే అంశాలపై ఆయన నుంచి కీలక వాంగ్మూలాన్ని సేకరించినట్లు సమాచారం. రాజ్ కేసిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం అధికారులు ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తూ, ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం తయారీదారుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకు సాగిన ఈ గొలుసుకట్టు వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందని ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు లభిస్తే మరికొంతమంది అరెస్టులు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


