ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంపై మెల్లగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇప్పటిదాకా ఏ వన్ నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి వాంగ్మూలం రికార్డు చేయడానికి కోర్టు అనుమతి తీసుకుంది. ఇదంతా సాంకేతికపరమైన ప్రక్రియ. ఏపీసీఐడీ సిట్ చాలా వరకూ విచారణ చేసింది. వివరాలు సేకరించింది. మద్యం స్కాం ద్వారా కొల్లగొట్టిన సొమ్ము ఎన్నెన్ని కంపెనీల ద్వారా సూత్రధారికి చేరాయో కూడాలెక్క తేల్చింది. దాని ప్రకారమే విచారణ జరుగుతోంది. కుటుంబసభ్యుల పేర్లతో కంపెనీలు ప్రారంభించి మనీ లాండరింగ్ కు సహకరించిన వారంతా ఇప్పుడు బయటకు వస్తున్నారు. భయంతో వణికిపోతున్నారు.
జగన్ రెడ్డి తనను నమ్ముకున్న వాళ్లందర్నీ తన అక్రమ సంపాదనకు డ్రైవర్లుగా వాడుకుంటారు. వారి కుటుంబసభ్యులతో కంపెనీలు పెట్టించి.. వాటి ద్వారా డబ్బు సరఫరా చేయించుకుంటారు. తాను గతంలో ఏం చేసి జైలుకెళ్లారో.. వాళ్లతో కూడా అదే చేయిస్తారు. వాళ్లనూ జైలుకు పంపుతారు. జగన్ రెడ్డిని నమ్ముకుని..కాస్త సంపాదించుకున్న అధికారులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు జైలుకెళ్లే దశలో ఉన్నారు. బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఇంకా చాలా మంది దారిలో ఉన్నారు. తప్పించుకోవచ్చని అనుకుంటున్నారేమో కానీ.. అసలు సాధ్యం కాదని చట్టం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది.
ఈ మొత్తం వ్యవహారంలో అవినీతి అనేది ఓ పాయింట్ అయితే.. డబ్బులు ఎలా రూటింగ్ చేశారన్నది అసలు పాయింట్. అక్రమ సంపాదనతో రాజకీయాలు చేశారు. కావాల్సినంత వెనకేశారు. ఇసుక, మద్యంలలో కేవలం నగదు లావాదేవీలే ఎందుకు జరిగేవో ఈడీ దర్యాప్తులో స్పష్టంగా బయటకు వస్తుంది. ఈడీ దర్యాప్తు పూర్తిగా లావాదేవీల ఆధారంగానే ఉంటుంది. ఇప్పటికే ఈ వివరాలన్నీ ఏపీ సీఐడీ సిట్ సేకరించింది. ఈడీకి ఇచ్చింది. అసలు కథ ప్రారంభం అవడమే మిగిలి ఉంది. ఒక్క సారి ఈడీ దృష్టి సారిస్తే.. ఈ స్కాం దేశవ్యాప్తంగా హెడ్ లైన్స్ కు ఎక్కే అవకాశం ఉంది.