లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వైసీపీ హయాంలో మద్యం విధానం ద్వారా భారీగా ముడుపులు సేకరించారనే ఆరోపణలపై ఇప్పటికే రాష్ట్ర సిట్ దర్యాప్తు చేస్తోంది. ఆ విచారణలో భాగంగా విజయసాయిరెడ్డిని నిందితుడిగా చేర్చడంతో పాటు ఓ సారి ప్రశ్నించింది. మరోసారి నోటీసులు జారీ చేసినా బహిరంగంగా విచారణకు హాజరు కాలేదు. కానీ ఆయన అనధికారిక అప్రూవర్‌గా మారి చాలా రహస్యలు చెప్పారన్నారు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఈడీ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా దాదాపు రూ. 3,500 కోట్ల మేర అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారించింది. లోకల్ తయారీ మద్యం మాత్రమే దుకాణాల్లో నమ్మేలా చేసి ప్రతి కేసుపై రూ. 150 నుండి రూ. 200 వరకులంచాలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి నివాసంలోనే ఈ పాలసీకి సంబంధించిన కీలక సమావేశాలు జరిగాయని, ఈ అక్రమ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించారని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి , ఇతర నిందితుల వాంగ్మూలాల్లో విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. గతంలో సిట్ విచారణకు హాజరైనప్పుడు ఆయన తనను తాను విజిల్‌బ్లోయర్ గా చెప్పుకుంటూ, రాజ్ కేసిరెడ్డే అసలు సూత్రధారి అని పేర్కొన్నారు. అయితే, దర్యాప్తులో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో ఈడీ ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద లోతుగా విచారించేందుకు సిద్ధమైంది.
అక్రమ ఆస్తుల లావాదేవీలు, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండింగ్ వంటి వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి నిష్ణాతుడు. జగన్ గతంలో ఆయనే చూసేవారు. నిజాలు చెప్పాలనుకుంటే… విజయసాయిరెడ్డి మొత్తం లిక్కర్ సొమ్ము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో.. ఈడీకి పూర్తిగా చెప్పగలరు. ఏం చేస్తారో?
