ఏపీ లిక్కర్ స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కేసు నమోదు చేసింది. సీఐడీ సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రాథమిక కేసును నమోదు చేసిన ఈడీ..గురువారం పలురాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ చేసిన వ్యక్తులు, షెల్ కంపెనీలకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే ఓ సారి రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. మద్యం స్కాం ద్వారా నాలుగువేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని వాటిని మనీ లాండరింగ్ చేసి.. వైట్‌గా చేశారని ఈడీ కేసు నమోదు చేసింది.
సీఐడీ నమోదు చేసిన కేసు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో అవినీతి, డబ్బులు వసూలు చేయడం సహా ఇతర నేరాలు ఉంటాయి. ఈడీ మాత్రం పూర్తిగా నగదు అక్రమ చెలామణి కోణంలో చూస్తుంది. నిజానికి ఈ కేసులో అక్రమ నగదు చెలామణినే అత్యంత కీలకం. ఎందుకంటే నిందితులు పూర్తిగా నగదు కార్యకలాపాలు నిర్వహించారు. మద్యం దుకాణాల్లో పూర్తి స్థాయిలో నగదు లావాదేవీలు నిర్వహించి ఆ నగదును లాండరింగ్ చేశారు. హవాలా ద్వారా దేశాలు దాటించి.. మళ్లీ షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడుల పేరుతో ఇండియాలోకి తీసుకు వచ్చారు. ఇలా ప్రధాన సూత్రధారికి పెద్ద మొత్తంలో నగదు చేరింది. ఈ వ్యవహారాలన్నింటిపై స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఈడీ చురుకుగా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే సీఐడీ పూర్తి ఆధారాలు సేకరించడంతో వాటిని తీసుకున్న అధికారులు పక్కాగా సాక్ష్యాలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అత్యంత పకడ్బందీగా.. పెద్దగా ప్రచారం లేకుండా ఈడీ కేసును వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ కేసులో అరెస్టులు ఉంటాయా ఉండవా అనదానిపై..ఈడీ అధికారులు తర్వాత తీసుకునే నిర్ణయాలను బట్టి ఉండే అవకాశం ఉంది.