ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితుల ఆస్తులను జప్తు చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి వారి అనుబంధ సంస్థలకు చెందిన 441.63 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు, స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో బ్యాంక్ నిల్వలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్రను ఈడీ బట్టబయలు చేసింది. 2019 కంటే ముందు ఏపీలో మద్యం వ్యాపారం పారదర్శకమైన సాఫ్ట్వేర్ విధానం ద్వారా సాగేది. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని ఉద్దేశపూర్వకంగా రద్దు చేసి, మాన్యువల్ సిస్టమ్ ను ప్రవేశపెట్టారు. దీనివల్ల అధికారులకు విచక్షణారహితమైన అధికారాలు లభించాయి. తద్వారా పాత బ్రాండ్లను మార్కెట్ నుండి తొలగించి, సిండికేట్‌కు అనుకూలమైన బ్రాండ్లకు చోటు కల్పించారు. ఈ క్రమంలోనే సిమిలర్ సౌండింగ్ బ్రాండ్స్ ను ప్రవేశపెట్టి, కృత్రిమంగా ధరలను పెంచి అక్రమ లాభాలను ఆర్జించినట్లు ఈడీ గుర్తించింది.
మద్యం సరఫరా ఆర్డర్లు పొందాలంటే డిస్టిలరీలు నిందితులకు బేసిక్ ధరపై 15 శాతం నుండి 20 శాతం వరకు కమీషన్లు చెల్లించాల్సి వచ్చేదని దర్యాప్తులో తేలింది. ఈ కమీషన్ల కోసం నిందితులు సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్‌లను ఉపయోగించి తమ గుర్తింపును దాచేందుకు ప్రయత్నించారు. ఇలా నెలకు సుమారు 100 కోట్ల రూపాయల మేర అక్రమ ఆదాయం గడించినట్లు, మొత్తం ఇప్పటివరకు 1048.45 కోట్ల రూపాయల డబ్బు మళ్లింపు ఈడీ గుర్తించింది. ఈ నగదును హైదరాబాద్‌లోని వివిధ రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి, ఆ తర్వాత బినామీ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఆధారాలు లభించాయి.
ఈ అక్రమ సంపాదనను వైట్ మనీగా మార్చేందుకు నిందితులు అనేక షెల్ కంపెనీలను, నకిలీ ఇన్వాయిస్లను సృష్టించారు. మద్యం రవాణా కాంట్రాక్టులను కూడా నిందితులే దక్కించుకుని, గతంలో కంటే భారీ ధరలకు ప్రభుత్వం నుండి నిధులు పొందారు. ఇలా వచ్చిన సొమ్ముతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు , విలాసవంతమైన ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని అటాచ్మెంట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
