తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ.. కేంద్రం వైపు నుంచి డీఎంకే సర్కార్ పై ఎటాక్స్ పెరుగుతున్నాయి. గతంలో ఈడీ ప్రతి చిన్న విషయానికీ దాడులు చేసేది. అయితే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాడులు తగ్గాయి. కానీ టార్గెట్ చేయడం మాత్రం ఆపడం లేదు. తాజాగా తమిళనాడు డీజీపీకి ఈడీ .. ఓ రెండు వందల పేజీల రిపోర్టు పంపింది. అందులో ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా పలువురు మంత్రులపై ఆరోపణలు, ఆధారాలతో కేసు నమోదు చేయాలని సూచనలు ఉన్నాయి.
ఇటీవల ఓ బ్యాంక్ లోన్ స్కాంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో.. ఉద్యోగాలను అమ్ముకున్న మూలాలను కనిపెట్టింది. కొద్ది కాలం కిందట.. తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ఆ నియామకాల్లో ఉద్యోగాలను అమ్ముకుని డబ్బులు వసూలు చేశారని.. ఆ డబ్బులన్నీ మనీ లాండరింగ్ చేశారని ఈడీ ఆరోపించింది. తమ సోదాల్లో దొరికిన వివరాలను డీజీపీకి పంపింది.
ఓ మంత్రి సోదరుడు ఈ స్కాంలో ప్రధానపాత్ర పోషించారని అంతిమంగా.. ఆ లంచాల డబ్బు స్టాలిన్ కు చేరిందనేది ఈడీ ఆరోపణ. కనీసం 880కోట్ల రూపాయలు ఇలా వసూలు చేశారని ఈడీ చెప్పింది. ఇది నిజమోకాదో కానీ.. ఈ నివేదిక గురించి బయటకు తెలిస్తే.. ఇక పొలిటికల్ బ్లాస్టింగ్ జరగకుండా ఉంటుందా.. ఇప్పుడు తమిళనాడులో ఇదే హాట్ టాపిక్ .విజయ్ కు కావాల్సినన్ని ఆయుధాలు ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా పని చేస్తోందని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.