“యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు ఓడించడం”. చంపేస్తే ఒక్క సారే ఓడిపోతాడు. కానీ రోజూ ఓడించాలంటే ఓటమిని అలా గుర్తు చేస్తూ ఉంచాలి. నిరంతరం శిక్ష అనుభవించాలి. అలా చేయడమే అసలైన యుద్ధ నీతి కూడా. ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ పై వంద శాతం విజయం సాధించింది. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వాళ్లు కాల్పులు ఆపేద్దామని బతిమాలుకుందంటే అంత కంటే విజయం ఏమి ఉంటుంది?.
పాక్ టెర్రరిస్టులకు, పాకిస్తాన్‌కు కోలుకోలేని నష్టం
పెహల్గాంలో భారత పర్యాటకులపై మారణకాండకు ఉగ్రవాదులు పాల్పడిన తర్వాత భారత్ ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది. భారత్ దాడులు చేయడం ఖాయమని తేలిపోవడంతో పాకిస్తాన్ చాలా వరకూ బెదిరింపులకు దిగింది. అయితే ఉక్కు మనిషి నరేంద్ర మోదీ ఓ సరైన సమయం చూసి ముహూర్తం ఖరారు చేశారు. ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టి ఎక్కడ దాడులు చేయాలనుకున్నారో అక్కడ వందశాతం ఖచ్చితత్వంతో ఎటాక్ చేసేలా ప్లాన్ చేశారు. భారత్ దాడులు చేయడం ఖాయమని పాకిస్తాన్ కు తెలిసిపోయింది. కానీ ఎక్కడెక్కడ చేస్తారో మాత్రం వారికి తెలియలేదు. భారత్ కు ఉన్న ఇంటలిజెన్స్ వ్యవస్థ ఎలాంటిదో పాకిస్తాన్ కు అర్థం కాలేదు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద ముఠాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. మసూద్ అజర్ లాంటి ఉగ్రవాది అడ్డాను నేల మట్టం చేసింది. ఆయన కుటుంబానికి చెందిన పది మంది చనిపోయారంటే.. ఎంత పక్కాగా దాడి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం వంద మందికిపైగా టెర్రరిస్టులు చనిపోయారు. ఈ విషయంలో భారత్ సాధించిన విజయం అమెరికానూ సంతృప్తి పరిచిందని అనుకోవాలి. అమెరికన్ యూదు జర్నలిస్టు తల నరికిన టెర్రరిస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
11 ఎయిర్ బేస్‌లు కోల్పోయిన పాకిస్తాన్
భారత్ చాలా వ్యూహాత్మకంగా దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత తాము పాకిస్తాన్ పౌరుల్ని కానీ.. పాకిస్తాన్ సైనిక స్థావరాలను కానీ టార్గెట్ చేయలేదని స్పష్టంగా ప్రకటించింది. కేవలం ఉగ్రవాద ముఠాలను మాత్రమే టార్గెట్ చేశామని ఆ ఉగ్రవాద ముఠాలను పాకిస్తాన్ అండగా ఉండి తమపై ఎదురుదాడి చేస్తే ప్రతిఫలం అనుభవిస్తారని చాలా పక్కాగా హెచ్చరికలు జారీ చేసింది. కల్నల్ సోఫియా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చాలా తీవ్ర స్వరంతో చేసిన హెచ్చరికల్ని పాకిస్తాన్ పట్టించుకోలేదు. ఉగ్రవాదులపై దాడి చేయడం అంటే తమపై దాడిచేయడమే అని ప్రపంచానికి తెలిపేలా భారత్ పై దండెత్తింది. నిజానికి పాకిస్తాన్ భారత ఎయిర్ బేస్‌లపై దాడి చేసిందని బయట ప్రపంచానికి తెలిసే సరికి చాలా జరిగిపోయింది. ఓ రోజు ఉదయమే లాహోర్‌లో బాస్ పేలుడు సంభవించింది. అలాగే కొన్ని పాక్ ఎయిర్ బేస్‌లపై దాడులు జరిగాయి. లాహోర్ పేలుడుకు కారణం ఏమిటో భారత సైనిక బృందం సమావేశం పెట్టి చెప్పే వరకూ స్పష్టత రాలేదు. భారత్ పై దాడి చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని వారు పంపిన డ్రోన్లు అన్నింటినీ కూల్చేసి.. తామే ప్రతీకారం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది. అప్పుడే అసలు విషయం స్పష్టమయింది. పాకిస్తాన్ కు ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నాశనం అయిపోయింది. అలాగే కొన్ని ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. అప్పుడే పాకిస్తాన్ పరువు పోయింది. ఇప్పుడు సైలెంటుగా ఉంటే పాకిస్తాన్ ప్రజల ముందు పరువు పోతుందని పాలకులు కంగారు పడ్డారు. కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని ఎగదోసి.. మంట పెట్టించుకుని ఇప్పుడు భారత్ కొంపకు నిప్పు అంటిస్తే సైలెంటుగా ఉంటారా అని ముఖం మీద ఖాండ్రిస్తారు. అంత కన్నా.. భారత్ పై నాలుగు డ్రోన్లతో దాడులు చేయడం మంచిదని అనుకున్నారు. భారత్ అప్పటికే సన్నద్ధంగా ఉంది. పాకిస్తాన్ ఏం చేయగలదో ముందే ఊహించారు కాబట్టి చాలా సైలెంట్ గా వ్యవహరించింది. పాకిస్తాన్ వదిలిన ఒక్క డ్రోనా కానీ.. ఒక్క మిస్సైల్ కానీ లక్ష్యాన్ని చేరుకోలేదు. గాల్లోనే పేలిపోయాయి. పాకిస్తాన్ ఏం చేయగలిగింది అంటే.. సరిహద్దుల్లో కూర్చుని ఫిరంగులతో ఇండియాలోకి కాల్పులు జరపడం మాత్రమే చేయగలిగింది. దీని వల్ల సాధారణ పౌరులు ఇబ్బందులు పడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పదహారు మంది పౌరులు చనిపోయినట్లుగా జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. సామాన్య పౌరుల్ని చంపి భారత్ పై ఏదో దెబ్బతీశామని పాకిస్తాన్ అనుకుంటే అంత కంటే తెలివి తక్కువ తనం ఏమి ఉంటుంది ?. కానీ ఏదో చేశామని తమ ప్రజలకు చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం చేశారు.
అణుబాంబులపై దాడి భయంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ కాళ్ల బేరాలు
భారత్ చేసిన ఎదురుదాడుల్లో పాకిస్తాన్ కు చెందిన పదకొండు ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. పక్కా రిపోర్టులతో దీన్ని భారత సైన్యం అంతర్జాతీయ మీడియా ముందు ఉంచింది. ఫోటోలు, వీడియోలు ఇచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ విఫలయత్నం చేసిన దాడుల ఆధారాలను కూడా ఇచ్చింది. భారత్ తాము చేసిన ఎయిర్ బేస్‌ల ధ్వంసం వివరాలను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ఎలాంటి ఖండన ప్రకటన చేయలేకపోయింది. అత్యంత ముఖ్యంగా పాకిస్తాన్ ఆణ్వాయుధాలు దాచుకున్న కిరానా హిల్స్ లో ని ఎయిర్ బేస్ వద్ద భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ వణికిపోయింది. అక్కడ నుంచి కాస్త ముందుగా మిస్సైల్ పడి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికి అణుధార్మికతతో అల్లాడిపోయేది. లక్షల మంది చనిపోయి ఉండేవారు. ఈ దాడి దెబ్బకే వణికిపోయి.. అమెరికా సాయంతో భారత్ కు చెప్పించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్కటే కాదు.. పాకిస్తాన్ ఆర్మీకి లాజిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లాంటి రావుల్పిండి ఎయిర్ బేస్ పై దాడి చేశారు. ఆ దెబ్బకు ఆర్మీ చీఫ్ మునీర్ మూడు రోజుల పాటు బంకర్ లో దాక్కోవాల్సి వచ్చింది. మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతనే ఆయన బయటకు వచ్చారు. తాము భారత్ కు చాలా నష్టాలు చేశామని పాకిస్తాన్ ఫేక్ ప్రచారం చేసుకుంది. ఆ ఫేక్ ప్రచారానికి కొన్ని విదేశీ ప్రచారాలు తోడయ్యాయి. కానీ భారత్ ప్రధాని నరేంద్రమోదీకి ఇలాంటి ప్రచారాలకు ఎలా చెక్ పెట్టాలో బాగా తెలుసు. అందుకే ఓ రోజు ఉదయమే అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లి.. పాకిస్తాన్ వాళ్లు ధ్వంసం చేశామని చెప్పుకుంటున్న ఆయుధాలను ప్రపంచానికి కనిపించేలా చేశారు. దాంతో పాకిస్తాన్ క్లెయిమ్స్ అన్నీ అబద్దాలని తేలింది. మరి భారత్ చెబుతున్న పదకొండు ఎయిర్ బేస్ ల ను పాకిస్తాన్ ఎందుకు చూపించలేకపోతోంది ?. స్వయంగా ప్రధాని షాబాజ్ షరీఫ్ ఓ ఎయిర్ బేస్ కు వెళ్తే కనీసం రన్ వే మీదకూ వెళ్లలేదు. ఎక్కడో గోనెపట్టాల కింద షెల్టర్ లో… యుద్ధ ట్యాంక్ మీద నిలబడి మాట్లాడి వెళ్లారు. భారత్ విసిరిన డ్రోన్లు, మిస్సైళ్ల ఎకలాల ఎగ్జిబిషన్ చూసి..నిట్టూర్చి వచ్చారు.
పీవోకే, ఉగ్రవాదులపై మాత్రమే చర్చలు – ఎక్కడా తగ్గని భారత్
కాల్పుల విరమణ తర్వాత భారత వాయిస్ అ మాత్రం తగ్గలేదు. చర్చలు అంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం, పాకిస్తాన్ లో దాగున్న ఉగ్రవాదుల్ని అప్పగించడంపై మాత్రమేనని భారత్ నిర్మోహమాటంగా చెబుతోంది. అంతే కాదు భారత్ పై జరిగే టెర్రర్ దాడులకు ఇక యుద్ధ కార్యాలుగానే చూసేలా ఒప్పందం చేసుకున్నారు. భారత్ లో జరిగే ప్రతి ఉగ్రవాద విధ్వంసకాండకు కారణం పాకిస్తాన్ సైన్యం ట్రైనింగ్ ఇచ్చి పంపించే ఉగ్రవాదులే. అందుకే ఈ సారి ఉగ్రవాదుల దాడి జరిగితే నేరుగా పాకిస్తాన్ పై మిస్సైళ్లు పడతాయి. ఈ సారి ఏ కాల్పుల విరమణ కూడా పాకిస్తాన్ ను కాపాడలేదు. భారత్ చాలా గట్టిగా తమ మాటలు చెబుతోంది. మరోసారి భారత్ పైకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో హెచ్చరిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం నోరు మెదపలేకపోతోంది. దీనికి కారణం ఏమిటో సులువుగా అర్థం చేసుకోవచ్చు. యుద్ధంలో పాకిస్తాన్ చాలా సులువుగా ఓడిపోయింది. అందుకే ఇండియా ఎన్ని మాటలు అంటున్నా పడుతోంది. పాకిస్తాన్ దివాలా దేశం.. నిజానికి భారత్ పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అది పాకిస్తాన్ వేసే బాంబుల వల్ల కాదు.. ప్రజల్లో వచ్చే పానిక్ వల్ల, సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాల వల్ల, ఆర్థికంగా ఎదుగుతున్న భారత్ పై దెబ్బపడేలా ఈ యుద్ధం ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ..కాల్పుల విరమణకు అంగీకరించారు. ప్రత్యర్థి సరెండర్ అయినప్పుడు చంపకపోవడం అనేది యుద్ధ నీతి. క్షమించడం వీరుల లక్షణం. ఇక్కడ పాకిస్తాన్ ను క్షమించాల్సిన పని లేదు కానీ లొంగిపోయిన తర్వాత నాలుగు దెబ్బలు కొట్టాల్సిన అవసరం మాత్రం లేదు.
త్వరలో పాకిస్తాన్ మూడు ముక్కలు !
పాకిస్తాన్ ఇప్పుడు మూడు ముక్కలు అయ్యే దిశగా ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఆ ప్రాంతాన్ని సైన్యం మళ్లీ అధీనంలోకి తీసుకోవడం చిన్న విషయం కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ తనకు అప్పగించే వరకూ ఊరుకోదు. మిగిలిన భాగంలో తాలిబన్లు, వారి వ్యతిరేక పోరాటదారులు పాకిస్తాన్ లో అల్లకల్లోలం చేస్తూంటారు. కాగల కార్యం గాంధర్వులే తీర్చినట్లుగా.. మిగతా పనిని పూర్తి చేయాల్సిన వాళ్లు పూర్తి చేస్తారు. మనం అలా చూస్తూనే ఉండాలి. పాకిస్తాన్ ముక్కలవుతుందా.. చెక్కలవుతుందా అన్నది అంచనా వేయలేం. కానీ భారత్ తో యుద్ధం చేసేంత శక్తి ఇప్పుడు పాకిస్తాన్ కు లేదు. యుద్ధం అంటూ వస్తే.. అది చాలా వరస్ట్ గా ఉంటుంది. దానికి పాకిస్తాన్ ఇప్పుడు సిద్ధంగా లేదు. అందుకే కాళ్ల బేరానికి వచ్చింది. శాంతి చర్చలు జరుపుతామని పదే పదే వేడుకుంటున్నారు. ఆ చర్చలు పీవోకే, టెర్రరిజం మీద అయితే.. భారత్ సరే అంటోంది. మొత్తంగా పాకిస్తాన్ ఎలా చూసినా ఓడిపోయింది. యుద్ధం అంటే చంపడం కాదు.. ఓడించడం అని ఆధునిక కాలంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ చేసి చూపించింది. ఇప్పుడు పాకిస్తాన్ రోజూ ఓడిపోతూ ఉంటుంది.