“చట్టసభలు ప్రజాస్వామ్య ఆలయాలు, అక్కడ ప్రజల ఆకాంక్షలు చట్టాలుగా రూపొందుతాయి” అని రాజ్యాంగ నిర్మాతలు నమ్మారు. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలన్నీ అలాగే భావిస్తూ వస్తున్నాయి. కానీ ప్రజాస్వామ్య విలువల మీద ఏ మాత్రం ఆసక్తి లేని కొన్ని పార్టీలు కుల, మత , ప్రాంత రాజకీయాల్లో కాస్త బలం తెచ్చుకుని మిడిమాలంగా ప్రవర్తించడం ప్రారంభించాయి. ఇప్పుడు అసెంబ్లీని ధిక్కరించడం ప్రారంభించాయి. ఎంతగా అంటే వాటికి అసలు విలువే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రెస్ క్లబ్బుల్లో చర్చిద్దామంటున్నారు కానీ.. దానికి ఇచ్చినంత గౌరవం కూడా చట్టసభలకు ఇవ్వడం లేదు. మరో విపక్షం.. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని బెట్టు చేస్తోంది. అనర్హతా వేటు పడకుండా దొంగ సంతకాలు చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నారు కానీ అసెంబ్లీకి మాత్రం రావడంలేదు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష పార్టీలు ప్రజస్వామ్య దేవాలయానికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడం లేదు. ఇంకా అవమానిస్తున్నాయి. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించడం అంత తేలికైన విషయం కాదు. ఒక వేళ ఈ పార్టీలు .. అసెంబ్లీని ధిక్కరించి మరీ విజయాలు సాధిస్తే.. ప్రజాస్వామ్యంలో కొత్త శకం ప్రారంభమవుతుంది. చట్టసభలకు విలువ లేకుండా పోతుంది.
చట్టసభల్లో చర్చ కంటే ప్రెస్క్లబ్కే ప్రాధాన్యమిచ్చిన బీఆర్ఎస్
“తక్షణం పార్లమెంట్ సమావేశాలు పెట్టండి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చిద్దాం” అని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ఎలాగూ జరుగుతాయి కదా అని కేంద్ర ప్రభుత్వం సైలెంటుగా గా ఉందో.. ఆపరేషన్ సిందూర్ అంశం పార్లమెంట్ చర్చించాల్సిన విషయం కాదని అనుకున్నారో కానీ.. కేంద్రం స్పందించలేదు. ఇది అసలు రాజకీయం. ప్రజాస్వామ్యంలో ఏదైనా పెద్ద సమస్య వస్తే.. తక్షణం చట్టసభల్ని సమావేశ పరచాలని విపక్షాలు డిమాండ్ చేస్తాయి. ఆ సమస్యపై విపక్షాల దాడిని ఎదుర్కోలేమని అనుకుంటే.. చట్టసభలను సమావేశపర్చడానికి అధికార పార్టీలు సంశయిస్తాయి. కానీ రాజ్యాంగపరంగా నిర్వహించక తప్పని సెషన్స్‌లో మాత్రం విపక్షాలను ఎదుర్కోవాల్సిందే. తెలంగాణలో ఆ పరిస్థితి రివర్స్ లో కనిపిస్తోంది. అసెంబ్లీని సమావేశపరుస్తాం రావాలని అధికార పార్టీ.. ప్రతిపక్షాన్ని సవాల్ చేస్తోంది. ప్రతిపక్షం దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది పోయి.. అసెంబ్లీకి తప్ప ఎక్కడైనా చర్చిస్తామని వీధి నాటకాలు ఆడుతోంది. ప్రెస్ క్లబ్ కు రావాలని కేటీఆర్ సవాల్ చేసి.. ఆయనే డేట్, టైమ్ ఫిక్స్ చేసి వెళ్లి వచ్చారు. సీఎం రేవంత్ రాలేదని ఇంకెప్పుడూ సవాల్ చేయవద్దని కేటీఆర్ ప్రకటన చేసేశారు. క్లబ్బులు, పబ్బులు కాదని తాము చట్టసభలకే రమ్మంటున్నామని సీఎం రేవంత్ కూల్ గా స్పందించారు. తాను సవాల్ చేయలేదని సూచన మాత్రమే చేశాని… ప్రతిపక్ష నేతగా అది ఆయన బాధ్యతని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఆరోగ్యం బాగోలేకపోతే తానే ఫామ్ హౌస్ కు వస్తామని అక్కడే మాక్ అసెంబ్లీ నిర్వహిద్దామని కూడా ఆఫర్ ఇచ్చారు. కానీ ఈ అంశంపై ప్రధాన ప్రతిపక్షం స్పందించడం లేదు. కారణం ఏమైనా.. అసెంబ్లీకి హాజరయ్యేందుకు భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఏ మాత్రం ఆసక్తిగా లేరు. ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యతల్లో ఆయనే ఉన్నందున అధికార పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఎందుకు రారని.. పదేళ్లలో చేసిన తప్పులు బయటపడతాయనే రావడం లేదని కార్నర్ చేస్తోంది. దీన్ని తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సరైన వేదిక అసెంబ్లీనే. కానీ అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ భయపడుతుంది. ప్రజాస్వామ్యంలో బయట ఎక్కడ ఎలాంటి చర్చలు జరిగినా వాటిపై రాజకీయముద్ర ఉంటుంది. కానీ అసెంబ్లీలో జరిగే చర్చలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అందులో నిజానిజాలు బయటపడతాయని ప్రజలు కూడా అనుకుంటారు. బీఆర్ఎస్ తప్పు చేసిందని ఆ తప్పులు బయటపడతాయనే వారు అసెంబ్లీకి రాబోమని అంటున్నారని కాంగ్రెస్ అంటోంది. బీఆర్ఎస్ దాన్ని తిప్పికొట్టలేకపోతోంది. నిజానికి ఒక్క కేసీఆర్ మినహా ఇతర బీఆర్ఎస్ సభ్యులంతా అసెంబ్లీకి హాజరవుతున్నారు. కానీ విపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ హాజరు కాకపోవడంతో.. వారు హాజరైనా.. బలం లేకుండా పోరాడాల్సి వస్తోంది. అలా అయినా అసెంబ్లీలో అధికార పార్టీపై పోరాడితే ప్రజల్లో వచ్చే స్పందన వేరుగా ఉంటుంది. అక్కడే అధికార పార్టీ వారి వాదన వినిపించే అవకాశం ఇవ్వకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. కానీ దానికి భారత రాష్ట్ర సమితి ముందుకు రావడం లేదు.
ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి వెళ్లేది లేదని జగన్ నిర్ణయం
ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక హోదా లేని ప్రతిపక్షం .. విచిత్రంగా తమకు హోదా ఇవ్వాలన్న కారణంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టేస్తోంది. అసెంబ్లీకి కనీస గౌరవం ఇవ్వడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మాత్రమే హాజరు కావడం లేదు. కానీ ఏపీలో ఉన్న పార్టీ నాయకుడు మాత్రం.. తానే కాదు తన పార్టీ ఎమ్మెల్యేలనూ పంపడం లేదు. వారిలో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనా .. ఎమ్మెల్యేగా రాజ్యాంగ విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏదైనా ప్రజా సమస్య గురించి .. వాటిని పరిష్కరించేవరకూ అసెంబ్లీకి రాబోమని చెబితే కాస్త గౌరవంగా ఉండేది. కానీ ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేసే అవకాశాలు ఉండటంతో గత అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ఒక్క పదకొండు నిమిషాలు మాత్రం హాజరయ్యారు. గందరగోళం సృష్టించి వెళ్లిపోయారు. అసెంబ్లీకి హాజరయ్యామని సంతృప్తి పడ్డారు. ఆ హాజరు నిబంధనల ప్రకారం చెల్లుబాటు అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. అసలు ప్రజల పట్ల కనీస బాధ్యత, ప్రజలు ఏమనుకుంటారో అన్న కనీస భయం వైసీపీ అగ్రనేతకు లేదు. ఆయనంటే భయపడే ఎమ్మెల్యేలకూ లేదు. అసెంబ్లీని అత్యంత ఘోరంగా అవమానిస్తూ వీరు ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. వీరి దైర్యానికి గతంలో ప్రజలు ఇచ్చిన తీర్పే ఓ కారణం అనుకోవచ్చు. 2017లోనూ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర కోసం అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. తాను వెళ్లకపోతే ఇతరులు ఎందుకు వెళ్లాలని తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ సెలవు ఇచ్చేశారు. ఎవరూ అసెంబ్లీ జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. అసెంబ్లీకి ఏ మాత్రం విలువ ఇవ్వని ఆయన .. తర్వాత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్య విలువల్ని దిగజారిస్తే.. ప్రజలు ప్రతీ సారి మద్దతుగా నిలుస్తారని అనుకోవడం అత్యాశ అవుతుంది. పదకొండు మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్షమే అవుతుంది. అధికారికంగా ప్రోటోకాల్ మాత్రమే లభించదు. కానీ అసెంబ్లీకి హాజరైతే.. ఖచ్చితంగా ఆ పార్టీకి తగిన ప్రాధాన్యత ఇచ్చి మైకులు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ప్రజలు ఆ విషయాన్ని తమ నోటీసులో ఉంచుకుంటారు. కానీ ఆ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేయకపోవడమే అసలు విషాదం.
అధికారంలో వైసీపీ, బీఆర్ఎస్ ఉన్నప్పుడూ చట్టసభల్లో ప్రజాస్వామ్య చర్చలకు దొరకని అవకాశం
అటు తెలంగాణ కానీ.. ఇటు ఏపీ కానీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసెంబ్లీకి ప్రాధాన్యమివ్వని రాజకీయం వారి రాజకీయ విధానాల్లో బాగమేమో అన్న అనుమానం ప్రజల్లో ఇప్పుడు వస్తోంది. ఎందుకంటే ఈ రెండు అధికార పార్టీలుగా పని చేసి వచ్చాయి. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి దాదాపుగా పదేళ్ల పాటు అధికారంలో ఉంది. ఈ పదేళ్ల కాలంలో అసెంబ్లీలో ఎప్పుడైనా అర్థవంతమైన చర్చలు జరిగాయా అంటే.. ప్చ్ అనే సమాధానమే వస్తుంది. కేసీఆర్ .. తెలంగాణకు ప్రతిపక్షం అవసరం లేదని చెప్పి మొదటి నుంచి విపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడం మీద దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేశారో.. తాయిలాలు చూపించారో.. ఆస్తులు, వ్యాపారాలను దెబ్బకొడతామని దారికి తెచ్చుకున్నారో కానీ.. కరుడు గట్టిన టీడీపీ నేతల్ని.. అంతకు మించి కాంగ్రెస్ లో ఎన్నో పదవులు పొందిన వారు.. చివరికి సిద్ధాంత పరంగా గెలిచే కమ్యూనిస్టుల్ని కూడా తమ పార్టీలో చేర్చుకున్నారు. “ వారి అవసరం లేదు కానీ.. వారు బయట ఉంటే కుక్కల్లా మొరుగుతూ ఉంటారు. పార్టీలో చేర్చుకుని కట్టిపడేస్తే సరిపోతుంది” అని పార్టీలో చేరిన ఎమ్మెల్యేల గురించి అన్నారని ఓ సారి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేరుగానే చెప్పారు. కేసీఆర్ వ్యూహం అదో కాదో కానీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు ఉండకూడదని అనుకున్నారు. అందుకే చేర్చుకోగలిగిన వారందర్నీ చేర్చుకున్నారు. వద్దనుకున్న వారిని రాలేమని అన్న వారిని సమావేశాలు జరినప్పుడల్లా సస్పెండ్ చేసి ఏకపక్షంగా సభను నిర్వహించుకున్నారు. అది ప్రజల్లో రిజిస్టర్ అయింది. అందుకే.. మరోసారి అవకాశం కల్పించలేదు. ఏపీలో ఇప్పుడు ఉన్న అనధికారిక ప్రతిపక్షం … ఈ విషయంలో అన్ని రకాల ఘోరాలు చేసింది. అసెంబ్లీని ఓ కౌరవసభలా మార్చింది. విపక్ష పార్టీలు మాట్లాడితే ఏదో జరిగిపోతుందని భయపడింది. స్పీకర్ గా చేసిన తమ్మినేని సీతారాం సభను నడిపించిన విధానం చూస్తే.. ఆయన స్పీకర్ గా కనీస విలువలు పాటించారని ఎవరూ అనుకోరు. ఆయన కూడా అనుకోరు. అందుకే..తాను మొదట వైసీపీ ఎమ్మెల్యేను అని.. ఆ తర్వాతే స్పీకర్ ను అని చెప్పుకుంటూ వచ్చేవారు. ఇక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసే వెలికి వేషాలతో ప్రజలు వేసారిపోయారు. చివరికి మహిళల మీద అత్యంత ఘోరమైన మాటలు మాట్లాడేలా చేశారు. ప్రతిపక్ష నేత తన భార్యను కించ పరిస్తే కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. చట్టసభల్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేసిన పార్టీ ..భారత రాజకీయ చరిత్రలో ఇంత వరకూ వైసీపీ తప్ప మరొకటి ఉంటుందని ఎవరూ అనుకోరు. ఈ విషయం ప్రజల దృష్టిని దాటిపోలేదు. అందుకే ఎన్నికల్లో అసెంబ్లీకి విలువే ఇవ్వని వారికి అసెంబ్లీలో విలువ లేకుండా చేశారు. వలువలు విప్పదీసి నిలబెట్టారు. ఆ రెండు రాజకీయ పార్టీలకు ఇప్పటికైనా ప్రజాస్వామ్య బలంపై స్పష్టత వచ్చిందా అంటే.. రాలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి ఉదాహారణలే.. ప్రతిపక్షంగా మారినప్పటికీ.. అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఏ మాత్రం సిద్ధపడకపోవడం.
చట్టసభల్ని గౌరవించకపోతే ప్రజలు మర్చిపోతారు !
ప్రజలు పట్టించుకోవడంలేదని లేదని ప్రజాస్వామ్య విలువలకు పాతరేసి.. ఇష్టం వచ్చినట్లుగా చేస్తామని అనుకుంటే..తీర్పు చెప్పినప్పుడే ప్రజలు శిక్షిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఐదేళ్లకు ఓ సారి మాత్రమే తమను మోసం చేసిన వారు.. ప్రజాస్వామ్య విలువల్ని పతనం చేసిన వారిని శిక్షించే అవకాశాన్ని పొందుతారు. దాన్ని వారు గట్టిగా ఉపయోగించుకుంటే.. రాజకీయ పార్టీలు గల్లంతు అయిపోతాయి. అలాంటి పరిస్థితిని పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్.. ఏపీలో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన కొరడా దెబ్బల్లాంటి తీర్పును అనుభవించిన పార్టీలే నేర్చుకోవాలి. లేకపోతే.. ఎప్పటికీ మరోసారి పుంజుకుంటామనే ఆశల్ని వదిలేసుకోవడం మంచిది. ఎందుకంటే చట్టసభలను గౌరవించని వారికి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అర్హత ఉండదు. సాగించలేరు కూడా.