ఎడిటర్స్ : ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొమ్ముతో ఓట్ల కొనుగోలు !

” ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో ఏ దేశం కూడా ఎదుర్కోని ప్రమాదకర సమస్యను భారత్ ఎదుర్కొంటోంది. అదేమిటంటే.. ఓట్ల కొనుగోలు “. ఈ సమస్య ఇంతింతై .. వటుడింతై అన్నట్లుగా పెరుగుతోంది. రాజకీయ పార్టీలు.. రాజకీయ నేతలు తెలివి మీరి పోతున్నారు. ఎంతగా అంటే.. ఓటింగ్ ముందు రోజు పంచే రూ. వెయ్యి.. రెండు వేలు కాదు.. ఓటింగ్ కు ఆరు నెలల ముందు నుంచే ఒక్కొక్కరికి లక్షలు చేరుద్దామని తాపత్రయ పడుతున్నారు. అయితే ఓటింగ్ ముందు రోజు పంచేది వారి అవినీతి సొమ్ము అయితే.. ఓటింగ్ కు ఆరు నెలల ముందు నుంచి పంచుకుంటూ వచ్చేది ప్రజల సొమ్మే. పేరుకు సంక్షేమ పథకాలు. నిజానికి అవన్నీ ఓట్ల కనుగోలు స్కీమ్స్. రాజకీయ పార్టీలన్నీ ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులను టార్గెటెడ్ గా కొంత మందికి పంచుతూ.. వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నాయి. వారి ఓట్లతో మళ్లీ మళ్లీ అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలదీ ఒకే దారి. ఈ సంక్షేమ పథకాల్లోనూ ఎవరూ వెరైటీ ..క్రియేటివిటీ చూపించి ప్రజల్ని ఆకట్టుకుంటారో వారిదే విజయం. ప్రస్తతం దేశంలో రాజకీయ పార్టీలు ఈ క్రియేటివిటీ చూపించడానికి పోటీ పడుతున్నాయి.

పథకాల పేరుతో రూ. లక్షలు పంచి ఓట్ల కొనుగోలు వ్యూహం

ఓటింగ్ రోజో లేకపోతే ముందు రోజో .. ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వడం అనధికారికంగా ఓట్ల కొనుగోలు చేయడం. ఇది నేరం కూడా. కానీ ఆరు నెలల ముందు ప్రతి ఓటర్‌కు ప్రభుత్వం నుంచి డబ్బుు పంపిణీ చేయడం అదికారికం. గతంలో ప్రభుత్వాలు ఇలా డబ్బులుపంచాలనే ఆలోచనలు చేసేవి కావు.కానీ గత పదేళ్ల నుంచి ఈ ట్రెండ్ పెరిగిపోయింది.ఇప్పుడు దాన్ని ఎవరూ ఊహించనంత స్థాయికి తీసుకెళ్తున్నారు రాజకీయ నేతలు. పేరు సంక్షేమ పథకాలు.. కానీ జరిగేది మాత్రం ఓట్ల కొనుగోలు. సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నేతలు ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారంటే.. గతంలోనే అంత ఇచ్చారు.. ఇప్పుడు ఎంత ఇస్తారోనని ప్రజలు ఆశలు పెంచుకుంటారని వారికి బాగా తెలుసు. వారి అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుందని తెలుసు. పైగా ఇతర పార్టీలు ఊహించనంతటి పెద్ద పెద్ద హామీలిస్తున్నాయి. వాటిని దాటుకుని.. తనపైనే నమ్మకం పెంచుకోవాలంటే ముందుగానే ఓటర్లకు తగినంత అందచేయాలి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టారీతిన పథకాల పేరుత వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాయి. అదంతా ప్రజా ధనమే. ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మో లేకపోతే.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి చేసే అప్పో.. లేకపోతే.. ఆస్తులు అమ్మేసో పంచేస్తున్నారు. ఓటర్లను రాజకీయ నాయకులు ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే.. ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పథకాలు మాకు రాలేదు కాబట్టి ఓటు వేయమంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకులకే పథకాలు అమలు చేస్తూ.. ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.

ప్రజాధనం.. అవినీతి ధనంతో ఓట్ల కొనుగోలు !

ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఓ అభ్యర్థికి భారీగా డబ్బు ఖర్చు పెట్టే శక్తిని మొదటి అర్హతగా భావిస్తున్నారు. ఎన్నికలు వచ్చాయి అంటే పోటీ చేసే ఆర్థిక స్థోమత కలిగిన వ్యక్తులు కోట్లకు కోట్లు డబ్బులు వెదజల్లడం ప్రస్తుతం సహజమైన విషయంగా మారింది. డబ్బు ఉన్న వారికే రాజకీయ పట్టం కడుతున్నారుడబ్బులు లేని వారికి రాజకీయాల్లో చోటు లేదనే భావన మనదేశంలో చోటు చేసుకుంటోంది. ఏదైనా నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే .. ప్రభుత్వం అక్కడ పథకాల రూపంలో వేల కోట్లు పారిస్తుంది. తెలంగాణలో ఓ ఉపఎన్నికలో ఇంటికి పది లక్షల చొప్పున దళిత కుటుంబాలకు పంచిన చరిత్ర ఉంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకొని ప్రజాసేవే పరమావధిగా పాటుపడేలా కృషి చేయడం. కానీ కోట్లకు కోట్లు డబ్బులు పంచి గెలిచిన అనంతరం వాటిని ఎలా సంపాదించుకోవాలో మాత్రమే సదరు ప్రజా ప్రతినిధి ఆలోచిస్తాడు. ప్రస్తుత ప్రజాప్రతినిధులలో తహతహ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలా ఓట్లకు అమ్ముడుపోయే ప్రక్రియ ఉంటే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదకరం. ఈ రోజు రూ. ఆరు వేలు పెట్టిన వారు రేపు రూ. ఇరవై వేలు ఇచ్చి ఓట్లు కొంటారు. అందులో ఎలాంటి సందేహం ఉండదు. రాజకీయ నేతలు ఎవరూ వారి సొంత డబ్బులు పంచడం లేదు. ప్రభుత్వ పరంగా ఇచ్చే స్కీముల డబ్బులే కాదు ఓట్ల కొనుగోలుకు ఇచ్చే డబ్బులు కూడా వారి కష్టార్జితం కాదు. అదంతా ప్రజల సొమ్ము దోపిడి చేసిందే. రాజకీయ అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మే. ఆ సొమ్ము ప్రజలదే. రాష్ట్ర ప్రజలను దోచుకుని.. వనరులు కొల్లగొట్టి ప్రజల ఓట్ల కొనుగోలుకు కేటాయించి.. ప్రజాస్వామ్యాన్ని మన రాజకీయనేతలే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజలు కూడా వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆలోచన చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రజలు మాత్రం అలాంటి ఆలోచనలు చేయలేకపోతున్నారు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని..తమకు తాము ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నామని .. హక్కులకు సంకెళ్లు వేసుకుంటున్నామని.. రాష్ట్ర భవిష్యత్‌ను అమ్మేస్తున్నామని తెలుసుకోకుండా పోటీ పడి డబ్బులు తీసుకుని మరీ ఓటేస్తున్నారు. ఈ జాడ్యం ఎంత దారుణంగా ప్రబలిపోయిందంటే టీచర్స్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వారూ డబ్బులు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి. ఇంత దారుణంగా కుళ్లిపోయిన పరిస్థితికి ప్రజాస్వామ్యం చేరిందనడంలో సందేహం లేదు.

ఎవరు ఎక్కువగా ఓట్లు కొనుగోలు చేస్తే వారికే పట్టం !

డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు మన దేశానికే ప్రత్యేకంగా వచ్చింది. మన దేశంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు ఉన్నారు. కానీ రాజకీయ అవినీతికి అలవాటు పడిన వారు పెరుగుతున్న కొద్దీ దేశ ప్రజాస్వామ్యానికి ఈ జాడ్యం అంతకంతకూ పెరిగిపోయింది. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. అది ఇప్పుడు ఏ స్థాయికి చేరిదో చెప్పాల్సిన పని లేదు. ఇది కూడా అంచనాగా ఊహించి చెప్పవలసిన పరిణామమే. ఇది వరకటి రోజుల్లో ప్రజలతో మమేకమై, ప్రజలకోసం పనిచేయడమే అలవాటుగా గలవారు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉండేది. కానీ అన్ని రంగాల్లో లాగానే అక్కడ కూడా రోజులు మారాయి. అధికారంలో ఉన్నవారు అవినీతి చేయకపోయినా కూడా ఆర్థికంగా ఎదగడానికి కొన్ని అపమార్గాలు ఉంటాయనే సంగతి డబ్బున్న వారందరికీ తెలిసిందే. అందరూ అధికార పదవుల మీద, రాజకీయాల మీద కన్నేశారు. ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టి, ఈజీ మనీకి, కష్టం ఎరగని సంపాదనకు అలవాటు పడిన వారంతా ఆ సంపదను రాజకీయాల్లో తగలేసి అధికారంలోకి రావాలని కోరికలు పెంచుకున్నారు. ఒకసారి అధికార వ్యామోహం వారిలో పుట్టిన తర్వాత దానిని చేజిక్కించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారనేది లెక్కలోకి లేకుండా పోతుంది. పైగా అధికారంలో ఉన్న మజాను వారు తెలుసుకున్న వారే గనుక అందుకోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడం ప్రారంభించారు. రాజకీయం ధనమయం అయింది. టికెటు కోసం పోటీ ఉన్నప్పుడు పార్టీకి కోట్లలో విరాళాలు ఇచ్చి.. టికెట్ దక్కించుకోవడం ఒక రివాజు అయింది. పార్టీలు ఇలాంటి కొత్త రకం సంపాదనకు అలవాటు పడ్డాయి. టికెటు కోసమే అంత డబ్బు పెట్టాక.. గెలవడానికి ఎంతైనా పెట్టవచ్చుననే తెగింపు వచ్చింది. ఈ దారిద్ర్యం ఇవాళ పుట్టినది కాదు.. ఇవాళ అంతమయ్యేది కూడా కాదు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఏ నాయకుడైతే తమకు నిజాయితీగా సేవ చేయగలరని ప్రజలు నమ్ముతున్నారో.. ఆ నాయకుడి గుణగణాలను, చరిత్రను, ప్రజల పట్ల చూపించే శ్రద్ధను అంచనాకట్టి ఓటు వేసే రోజులు ఎన్నడో పోయాయి. అసెంబ్లీ ఎన్నికలయినా.. ఉపఎన్నికలయినా ఎవరినైనా తప్పు పడితే అది గొంగట్లో అన్నం తింటూ వెంట్రులను వెదికినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా తమకు ఓట్లు వేయరని భావించేవారికి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే… సొంత ఓటర్లకు కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిది. ఓటర్లకు డబ్బులు పంపిణీ జరిగితే గెలిచిన అభ్యర్థులు ఎవరూ నీతిగా ఉండేఅవకాశం లేదు. అవినీతి చేసి కోట్లకు పడగలెత్తి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు.

అధికార పక్షాలే కాదు.. ప్రతిపక్షాలూ ప్రజల్ని ఆశల్లో ముంచుతెత్తున్నాయి !

అధికార పార్టీలకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే ముందుగానే వారు పథకాలను అమలు చేసి డబ్బులను ఓటర్ల ఖాతాల్లో జమ చేసి..ఇక ఓటు వేయండి అని తరమవచ్చు. ప్రభుత్వాలు అదే చేస్తున్నాయి. అయితే రాష్ట్రం నాశనమైపోయిందని.. తాము అలాంటి పథకాలు అమలు చేయబోమని రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఏదైనా రాజకీయ పార్టీ అంటే.. వెంటనే అధికార పార్టీ.. పథకాలన్నీ ఆపేస్తారు.. మీ ఇష్టం అనే బ్లాక్ మెయిలింగ్ ప్రారంభిస్తుంది. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే సొమ్ములు రావేమోనని ఓట్లు వేయడానికి సిద్ధపడరు. అంతే కానీ. తమ సొమ్మే.. తమ నుంచే పిండుకుని ఇస్తున్నారు.. వాటిని ఎందుకు.. వద్దు అనుకోరు. రాష్ట్రం కోసం ఖర్చు పెట్టాలని కోరుకోరు. అందుకే ప్రతిపక్ష పార్టీలు.. అధికారంలో ఉన్న పార్టీల కంటే ఎక్కువగా హామీలు గుప్పిస్తూంటాయి. ప్రస్తుతం అధికారం ఉన్న పార్టీ పన్నులు పెంచి పథకాలు ఇస్తోందని తాము సంపద సృష్టించి ఇస్తామని.. ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న కర్ణాటకలో జరిగింది అదే.. రేపు ఏపీలోనూ జరగబోయేది అదే. తెలంగాణలోనూ ప్రతిపక్ష పార్టీలు లెక్కలేనన్ని హామీలు ఇస్తున్నాయి. నేరుగా అయినా పథకాల ద్వారా అయినా ఎన్నికలంటే నోట్లకు ఓట్లు కొనుగోలు చేసి…ప్రజాప్రతినిధులు అవడం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లకు నోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం అనే విధానానికి రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు స్వస్తి చెపితేనే ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకునే స్వేచ్ఛ మన చేతుల్లోఉంటుంది. లేకపోతే ముందు ముందు ఎవరు ఓట్లు కొనడంలో చాంపియన్ అవుతారో వారే గెలుస్తారు. అదే జరిగితే మనది ప్రజాస్వామ్యం కాదు.. నియతృత్వం కూడా కాదు. అంతకు మించి చెప్పుకోలేని వ్యవస్థలోకి వెళ్లిపోతాం. అది ఎంత దుర్లభంగా ఉంటుందో..ఊహించడం కష్టం. కానీ దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి.

అయితే ప్రజాస్వామ్యం లేకపోతే ఏక పార్టీ పాలన బెటర్ !

ప్రజాస్వామ్యం అనేది ఒక ఆలోచనా విధానం. ప్రపంచానికి ఇప్పటి వరకు దొరికిన పాలనా విధానాల్లో అది ఉత్తమమైనది. కానీ ప్రపంచంలో కేవలం 49% మాత్రమే ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించని దేశాలు 51% ఉన్నాయి. చైనా, యూఏఈ, సౌదీఅరేబియా, వియత్నాం, జోర్డాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు. ఏక పార్టీ, నియంత, రాచరికం ఇలా రకరకాల పాలనలు ఉన్నాయి. అయినా ఆ ప్రజాస్వామ్యేతర దేశాలు ఆర్థికంగా పరిపుష్టంగా నిలుస్తూ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమర్థతను ప్రదర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశం కాకపోయినా విభిన్ననమైన పాలనా విధానంతో సామాజిక, ఆర్థికపరంగా ప్రపంచ శక్తిగా చైనా ఎదిగింది. అయితే ఈ దేశాల పాలకులు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. అందుకే ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి. అయితే ఇలా ఏకపార్టీ పాలనలో అయినా ఉండాలి కానీ.. లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంలో దేశం ఉండకూడదు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే.. అరాచకం రాజ్యమేలుతుంది. ఓట్ల కొనుగోలు ద్వారా ప్రభుత్వాలను ప్రతిష్టించగలిగే పరిస్థితి రావడం అంటే.. చివరి దశకు రావడమే. యుద్ధం ఒక దేశాన్ని నాశనం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలోని లోపాల వల్ల దేశం నాశనమైపోయిందంటే అంత కంటే దారుణం ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా ప్రజలే కాపాడుకోవాలి. అలా చేయాలంటే.. ఓటుకు విలువ కట్టుకోవడం ఆపేయాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close