“సివిల్ సర్వీసెస్ దేశ ఐక్యత, ఆడ్మినిస్ట్రేటివ్ సమర్థత, పాలనలో నిష్పాక్షికతకు కీలకం. రాజకీయ ఒత్తిడి నుండి స్వతంత్రంగా పనిచేసే అవకాశం ఉన్న వ్యవస్థ. దేశ పాలనకు “స్టీల్ ఫ్రేమ్”
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యవస్థల పునాదులను అత్యంత పటిష్టంగా ఉండేలా చేసిన దేశ తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సివిల్ సర్వీస్ వ్యవస్థ గురించి వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. దేశం మొత్తం జల్లెడ పట్టి అటు విద్యాపరంగా, ఇటు నిబద్ధత పరంగా దేశం కోసమే పని చేసేవారిని ఎంపిక చేసుకునే సివిల్ సర్వీస్ వ్యవస్థపై పటేల్‌కు అంత నమ్మకం. ఆయన నమ్మకాన్ని మొదట్లో ఈ వ్యవస్థలో భాగమైన అధికారులు నిలబెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన నాలుగైదు దశాబ్దాల పాటు ఈ సివిల్ సర్వీస్ వ్యవస్థ పనితీరు దేశాన్ని ముందుకు నడిపించింది. రాజకీయ వ్యవస్థకు లొంగిపోకుండా .. సివిల్స్ ఇమేజ్ ను అమాంతం పెంచారు. కానీ ఆ వ్యవస్థలోకీ పురుగులు చొరబడటం ప్రారంభమైన తర్వాత పతనాన్ని ఆపడం ఎవరి తరం కావడం లేదు. దానికి మన కళ్ల ముందే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
నేతలతో కుమ్మక్కయి జైళ్లకు వెళ్తున్న అధికారులు
అవినీతి కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ జైలుకు వెళ్లారు. ఆయన తన 30 ఏళ్ల సర్వీసులో ఎంతో మంది నేరస్తుల్ని జైలుకు పంపించి ఉంటారు. ఇప్పుడు ఆయన జైలుకు వెళ్లారు. సంజయ్ కూడా దేశ రాజ్యాంగంపట్ల, చట్టాల పట్ల సమగ్రమైన అవగాహనతో.. వ్యవస్థకు ఉండే విలువ ఏమిటో.. ఆ వ్యవస్థలో భాగమవుతున్న ఆయన ఎంత సిన్సియర్‌గా ఉండాలో నేర్చుకునే వచ్చారు. కానీ ఆయన ఏమి చేశారు ?. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేయని తప్పు లేదు. సీఐడీ చీఫ్‌గా ఇతర రాష్ట్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ పెద్దల రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేశారు. కోర్టులో వాదనలు వినిపించుకండా అక్కడ వాయిదాలు కోరి..ఇతర రాష్ట్రాల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిలో ఉన్న లాయర్ తో కలిసి ప్రెస్మీట్లు పెట్టారు. అప్పుడే ఆయన తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇక ఎలాంటి ఫిర్యాదులు లేని మార్గదర్శి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు కూడా చట్టాలపై ఏ మాత్రం గౌరవం లేనట్లుగా తేలిపోయింది. అంతకు ముందు డీజీపీ కావడానికి మరో అడుగు దూరంలో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అనే ఘనత వహించిన ఐపీఎస్ కూడా జైలుకెళ్లారు. జైలుకెళ్లాల్సిన వారిలో పీవీ సునీల్ కుమార్, కాంతి రాణా టాటా, రిషాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి సహా మరికొంత మంది ఉన్నారు. వారు చేసిన తప్పులు కళ్ల ముందే ఉన్నాయి. కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుటుంబసభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టిన నిర్వాకాలు వీరి సొంతం. అంతే కాక వారి వ్యక్తిగత వివరాలను తప్పుడు పద్దతుల్లో సేకరించారు. రాజకీయ కుట్రలను అమలు చేయడానికి వీరు చేయని తప్పు లేదు. ఓ నటిని ముంబై నుంచి కిడ్నాప్ చేసితీసుకు వచ్చి వారు చేసిన నిర్వాకం చూస్తే.. ఐపీఎస్లా… మాఫియా ముఠా సభ్యులా అని ప్రజలు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ బయటకు తెలిసినవే. తెలియకుండా ఎన్ని చేశారో అంతర్గత వర్గాలకే బాగా తెలుసు. ఇలా చేయడం తప్పు అని..తాము చేస్తున్న తప్పుల వల్ల దేశానికి స్టీల్ ఫ్రేమ్ వంటి సివిల్స్ వ్యవస్థకే చెద పట్టిస్తున్నామని వీరికి తెలుసు. అయినా వ్యక్తిగత స్వార్థం కోసం.. దేశానికి నష్టం చేసేందుకు వీరు ముందుకే వెళ్లారు. వీరు అప్పటికి అర్థం చేసుకోలేకపోయిన విషాదం ఏమిటంటే… తమకు ఈ పొజిషన్ ఇచ్చిన రాజ్యాంగం.. అన్నింటికంటే పవర్ ఫుల్. తాము ఏ చట్టాలను అమలు చేయడానికి ఆ పొజిషన్లలోకి వచ్చామో.. ఆ చట్టాల చేతులు చాలా పొడవు. తప్పు చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా చట్టం చేతికి చిక్కాల్సిందే. ఆ విషయం ఇతరుల కన్నా దాన్ని అమలు చేసే వారికే బాగా తెలిసి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయ నాయకుల ప్రభావానికి లోనై.. ఆ విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు చట్టం చేతులకు చిక్కుతున్నారు. తల దించుకుని జైలుకెళ్తున్నారు.
ఇవాళ కాకపోతే రేపైనా చట్టానికి చిక్కడం ఖాయం !
ఐపీఎస్‌లు మాత్రమే కాదు.. ఐఏఎస్‌లూ తక్కువ తినలేదు. రోజూ రూ.లక్షన్ర్నర ఖరీదైన చీరలు కడతారని, రూ.50 లక్షల విలువైన విగ్గులు వాడతారని ఓ ఐఎఏస్ అధికారిణి గురించి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. 30 ఏళ్ల సర్వీసులో ఆమె పని దోచుకోడవమేనని తేల్చారు. ఇక్కడ ఆయన మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే.. ఆ భూమన కరుణాకర్ రెడ్డి ముఠాలో భాగమే ఈ ఐఏఎస్ అధికారిణి అనే ఆరోపణలు ఉన్నాయి. కేసులు ఉన్నాయి. జైలుకు కూడా వెళ్లారు. మరి వాళ్ల ముఠాలో భాగమైన ఐఏఎస్ గురించి వారే చెబుతున్నారు. చెప్పని వారు చాలా మంది ఉన్నారు. వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుని ప్రజా ధనాన్ని ఇతరులకు దోచి పెట్టడమో.. రాజకీయ నేతలకు దాసోహం అవ్వడమో చేశారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాక ముందు వరకూ సివిల్ సర్వీస్ అధికారుల వ్యవస్థను రాజకీయ వ్యవస్థ కూడా గౌరవించింది. ఆ వ్యవస్థను దుర్వినియోగం చేయడానికి వెనుకాముందాడింది. ఎప్పుడూ అధికారులతో తప్పుడు పనులు చేయించి వారిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఎప్పుడు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నేత సీఎం అయ్యారో అప్పట్నుంచి పరిస్థితులు మారిపోయాయి. ఆయనతో పాటు ఆయన కుమారుడు దోపిడీదారుల అవతారం ఎత్తడంతో ఇక అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఓబుళాపురం నుంచి హైదరాబాద్ భూముల వరకూ..సొంత ఆస్తులుగా పారిశ్రామికవేత్తలకు రాసివ్వడం.. వారి దగ్గర నుంచి డబ్బులు పెట్టుబడుల రూపంలో తమ కంపెనీల్లోకి మళ్లించుకోవడం… ఇదే పని. సంతకాలు పెట్టే వారికీ కొంత పంచడంతో వారు కూడా.. రంగంలోకి దిగిపోయారు. అలా సంతకాలు పెట్టే వారినే ప్రోత్సహించారు. ఇలా ఎంతో మంది జైలు పాలయ్యారు. అయినా అలాంటివారిని నమ్ముకుని ఇంకా ఎంతో మంది దారిలో ఉన్నారు. వీరంతా.. ముస్సోరిలో ట్రైనింగ్ తీసుకుని వచ్చిన వారే. అక్కడ వీరందరికీ రాజ్యాంగం గురించి.. దేశ చట్టాల పవర్ గురించి.. సంపూర్ణంగా వివరించారు. ఆ వ్యవస్థలో భాగం అయిన తర్వాత ఆ చట్టాలను ఎలాగైనా ఉల్లంఘించవచ్చని.. తమకు ఆ హక్కులు ఉన్నాయని వీరు అనుకోవడంతోనే సమస్య ప్రారంభమయింది. అది దేశానికి ద్రోహం చేయడమేనని అనుకోలేదు. తమను తాము బాగు చేసుకోవడం అనుకున్నారు. ఆర్థికంగా ఎదగడానికనుకున్నారు. కానీ ఇప్పుడు వారిని చట్టం వెంటాడుతోంది. పరువు తీసి ప్రజల ముందు పెడుతోంది. ఆ మహిళా ఐఏఎస్ మాత్రమే కాదు.. అలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీస్ అధికారులు చేసినన్ని దురాగతాలు వాళ్లు చేయలేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీలతో కుమ్మక్కు అయి మాఫియాగా మారి పని చేయలేదు.
స్టీల్ ఫ్రేమ్‌కు చెద పట్టిస్తున్నారు !
రాజ్యాంగం సివిల్ సర్వీసెస్‌ను దేశ ఆడ్మినిస్ట్రేటివ్ స్థిరత్వం , నిష్పాక్షికతకు వెన్నుముకగా గుర్తిస్తుంది. అలాంటి వ్యవస్థలో భాగమైన వారు ఇంకెత బలంగా, ధృడంగా వ్యవస్థను ఉంచాలి ?. ఈ వ్యవస్థ ఎంత పవర్ ఫుల్లో చాటి చెప్పిన వారి గురించి దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. ప్రధాని చెప్పినా సరే అంగీకరించని అధికారుల గురించి ఆదర్శంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎస్ఆర్ శంకరన్, శేషన్ , ఉమేష్ చంద్ర వంటి వారు చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వారు కూడా సినిల్ సర్వీస్ నుంచి వచ్చిన వారే. మరి వారి గురించి గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నామో ఆలోచిస్తే.. దానికి సమాధానం లభిస్తుంది. వారు తమకు వ్యవస్థ ఇచ్చిన అధికారాన్ని .. ఎలా .. ఎందుకు .. ఉపయోగించాలో అందుకు ఉపయోగించారు. ప్రజల పక్షాల నిలబడ్డారు. ఈనాటి అధికారులు ఫలానా అధికారి చాలా సిన్సియర్ అని చెప్పుకోలేరు. కొద్ది రోజుల కిందట ఓ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..” ఒక తప్పు చేద్దామంటే.. మూడు తప్పులు చేద్దామనే ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నారని” ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆయన రాజకీయ నాయకుడు. చట్టాలను అతిక్రమించి అయినా తన పంతం నెగ్గించుకోవడానికి అధికారుల్ని ప్రభావితం చేయగలిగే పొజిషన్లో ఉన్నారు. కానీ వ్యవస్థ బాగుంటేనే రాజకీయం బాగుంటుందని ఆయన అనుకుని ఈ మాట చెప్పారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో ఎలాంటి అసత్యం లేదు. రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి.. తమ దందాలు తాము చేసుకుంటున్నారు. ట్రైనీ ఐపీఎస్‌లే యూనిపాంతో దందాలు చేస్తున్నారు. రాజకీయ నేతలు ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లాలి. కానీ సివిల్ సర్వీస్ అధికారులు మాత్రం ఒక్క సారి సర్వీస్ లోకి వస్తే రిటైరయ్యే వరకూ ఉంటారు. వారిని సర్వీస్ నుంచి తొలగించాలంటే వారంతటకు వారు కోరుకోవాలి. రాజకీయ నేతల వల్ల వారి సర్వీస్ ఎప్పటికీ పోదు. కానీ వారు తమకు ఉన్న అధికారాన్ని .. వ్యవస్థ , రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని రాజకీయానికి తాకట్టు పెట్టేశారు. అందుకే.. ఇప్పుడు రాజకీయాలకు ఈ వ్యవస్థ దాసోహం అయింది. సివిల్ సర్వీస్ అనే దేశానికి రక్షణ కల్పించే స్టీల్ ఫ్రేమ్‌కు చెద పట్టేలా చేశారు . దీని ప్రభావం ఇప్పుడు దేశం మొత్తంపై పడుతోంది. వ్యవస్థలోకి వస్తున్న అధికారులంతా.. తాము సంపాదించుకోవడానికి వస్తున్నామని అనుకునేవారు పెరిగిపోయాయి. ముస్సోరీలో.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడెమీలో వీరికి ఇస్తున్న శిక్షణలు బుర్రకు ఎక్కడం లేదు.
సంస్కరణలు అవసరం !
నిప్పుకైనా చెద పట్టించగల వ్యవస్థ రాజకీయం. ఓ చిన్న కేసు నమోదు అయితే ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకూ వెళ్లలేరు కానీ అందరి కళ్ల ముందు నేరం చేసినా.. చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నేతలు అయిపోయి.. ఆ నేరస్తుల్ని కట్టడి చేయాల్సిన వ్యవస్థల మీద పెత్తనం చేసేందుకు రాజకీయ నేతలు వస్తున్నారు. వారి క్రిమినాలజికీ అధికారులు కూడా లొంగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తప్పుడు పనులు చేసే.. రాజ్యాంగాన్ని, చట్టాలను సైతం ధిక్కరించే సివిల్స్ సర్వీస్ అధికారుల్ని దేశద్రోహులుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. పవర్ లోకి వచ్చిన తర్వాత తమ విధుల పట్ల కాకుండా రాజకీయ నేతల పట్ల మాత్రమే విధేయత చూపించేవారికి చట్టం చేతులు చాలా పొడవు అని ఎప్పటికప్పుడు గుర్తు చేసే చెక్స్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థను తీసుకు రావాలి. అప్పుడు మాత్రమే దేశ ప్రజలకు మళ్లీ ఆ వ్యవస్థలపై విశ్వాసం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే. …. రక్షణగా ఉండాల్సిన స్టీల్ ఫ్రేమ్.. దేశాన్ని బంధించడానికి ఆయుధంగా మారుతుంది. ఇది ప్రమాదకరం.