“When the law fails to protect society, society has the right to protect itself.” .. చట్టం సమాజాన్ని రక్షించలేకపోతే, సమాజం (పోలీసుల ద్వారా) తాను తాను రక్షించుకోవాలి”
ఇప్పుడు ఎక్కువ మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. పోలీసులు ఇచ్చే ఇన్స్టంట్ జస్టిస్నే కోరుకుంటున్నారు. చట్టపరంగా శిక్ష పడేదాకా ఆగానని ఎవరూ అనుకోవడంలేదు. దీనికి కారణం ఓ తీవ్రమైన నేరం జరిగినప్పుడు ఆ నేరస్తుడికి శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజల్లో పోవడమే. అందుకే వెంటనే అతన్ని ఆలస్యం చేయకుండా శిక్షించాలని కోరుకుంటున్నారు. ప్రజల్లో తమపై నమ్మకం పోకుండా ఉండటానికి.. వారిలో భరోసా నింపడానికి ఇటీవలికాలంలో ఈ ఇన్స్టంట్ న్యాయం పెరిగిపోతోంది. పోలీస్ కస్టడీలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. నిందితుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని ప్రజలు ఎవరూ వ్యతిరేకించడం లేదు. పైగా సమర్థిస్తున్నారు. అలా చేయడం న్యాయం కాదని వారికీ తెలుసు. కానీ అలా జరగకపోతే ఎప్పటికీ న్యాయం జరగదని.. వాళ్లు మళ్లీ బయటకు వచ్చి మృగాలుగా ప్రవర్తిస్తారన్న భయాలు ప్రజలకు ఉన్నాయి. అందుకే వ్యతిరేకత రావడంలేదు.
ఎన్ కౌంటర్లు చేయాలన్న డిమాండ్లు రావడం ప్రమాదకం !
హైదరాబాద్‌లో దిశ అనే అమ్మాయిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశాన్ని ఎంతలా కదిలించిందో.. దిశ కేసు కూడా అలాగే కదిలించింది. పోలీసులు వాళ్లే నిందితులు అని చెప్పిన వారినీ వెంటనే శిక్షించాలన్న డిమాండ్ వచ్చింది. వెంటనే పోలీసులు తాము పట్టుకున్న నిందితుల్ని ఎన్ కౌంటర్ చేశారు. షరామామూలుగా వారు ప్రతి ఎన్ కౌంటర్ దగ్గర చెప్పే స్టోరీ చెప్పారు. పారిపోయేందుకు ప్రయత్నించి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించడంతో కాల్చిచంపామని అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. కానీ ఎవరూ నమ్మలేదు. పోలీసులే ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపారని అందరికీ తెలుసు. కానీ ఎవరూ వ్యతిరేకించలేదు. పోలీసులు చేసింది తప్పని చెప్పలేదు. కొంత మంది మాత్రం వాళ్లే నిందితులని గ్యారంటీ ఏమిటి అన్న ప్రశ్నలు వచ్చాయి. దానికి పోలీసుల వద్ద కూడా సమాధానం లేదు. జరిగిన నేరానికి వాళ్లను శిక్షించారు. ప్రజాగ్రహం చల్లార్చారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న తెలంగాణలో కానిస్టేబుల్‌ను చంపిన ఓ సీరియల్ నేరస్తుడ్ని ఆస్పత్రిలో ఎన్ కౌంటర్ చేశారు. సేమ్ కథ చెప్పారు. ఇప్పుడు ఏపీలో మనవరాలి కంటే చిన్న వయసు ఉండే బాలికపై ఆకృత్యానికి పాల్పడుతున్న వ్యక్తి పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నారు. అది వారు చెప్పింది..కానీ ఎవరూ నమ్మడం లేదు. అది కూడా ఇన్ స్టంట్ జస్టిస్ గానే భావిస్తున్నారు. దేశంలో చాలా చోట్ల ఇలాంటి నేరాలు జరిగినప్పుడు నేరస్తుల్ని వేగంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదే కోర్టులకు, జైళ్లకు పంపితే.. వారికి శిక్ష పడదని నమ్మకానికి వచ్చేశారు. కరుడుగట్టిన నేరస్తులు, ఘోరమైన నేరాలు చేసిన వారిని చంపేసినప్పుడు ప్రజా వ్యతిరేకత రావడం లేదు. ఇంకా మద్దతు వస్తోంది.
శిక్షలు పడతాయన్న నమ్మకం తగ్గిపోతోంది !
ప్రజలు ఎన్ కౌంటర్ల లాంటి ఇన్ స్టంట్ న్యాయాన్ని సమర్థించడానికి ప్రధాన కారణం.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెడితే విచారణ ఎంత కాలం జరుగుతుదో తెలియదు. చివరికి శిక్ష పడుతుందో లేదో తెలియదు. డబ్బు, పవర్ ఉన్న వాళ్లకు అసలు శిక్షలు పడతాయని ఎవరూ అనుకోవడం లేదు. హై ప్రోఫైల్ కేసుల్లో కోర్టుల్లో చాలా ఈజీగా నిందితులు బయటకు వచ్చేస్తున్నారు. ఆ కేసుల్లో నిందితులు ఎంత ధీమాగా ఉంటున్నారో తాజా కేసుల విచారణలే స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగా నేరస్తులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ప్రజల్లో సడిలిపోతోంది. అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన వాళ్లు .. కళ్ల ఎదుట అరాచకాలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. వారు బయట స్వేచ్చగా తిరుగుతున్నారు. రాజకీయాల్లో చేరి ఉన్నత స్థానానికి వెళ్తున్నారు. మరి వ్యవస్థలు ఏమి చేస్తున్నాయి ? . మొదట నేరం చేసినప్పుడే కఠినంగా ఉంటే నేరస్తులు మళ్లీ మళ్లీ నేరాలు చేయాల్సిన పరిస్థితి రాదు. రాజకీయాల్లో దారుణ హత్యలు చేసే మైండ్ సెట్ ఉన్న వారిని మొదటే వ్యవస్థలు శిక్షిస్తే.. తర్వాత అంతకంటే దారుణమైన నేరాలు జరగకుండా కట్టడి చేయవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడంలేదు. వ్యవస్థలన్నీ కలసి కట్టుగా విఫలమవడం దీనికి సంకేతం. ప్రజలు మద్దతుగా ఉంటున్నారని .. ఇలా తప్పు చేసినప్రతి ఒక్కరికీ ఇన్ స్టంట్ శిక్షలు విధిస్తూ పోతే ఇక చట్టం, న్యాయం ఎందుకు .. న్యాయస్థానాలు ఎందుకు అనే ప్రశ్న వస్తోంది.
హత్యలు చేసినా బెయిల్ వచ్చేస్తుందన్న భావన
ఇటీవల హైదరాబాద్ లో ఓ అమ్మాయి తన ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. ఆ ప్రియుడు కూడా మైనర్. ఆ మైనర్ తల్లి మీడియాతో ” ఇవాళ కాకపోతే రేపు అయినా నా కొడుకును బయటకు తెచ్చుకుంటా”. అని ధీమాగా చెప్పింది. అంటే.. అంత ఘోరంగా ఓ మహిళను హత్య చేసిన తర్వాత కూడా అలాంటి అభిప్రాయం ఉందంటే.. వ్యవస్థలపై వారికి ఎంత చులకన భావం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. భారత దేశ న్యాయవ్యవస్థ ఓ సిద్ధాంతం మీద పని చేస్తోంది. వంద మంది నేరస్తులు తప్పించుకోవచ్చు కానీ..ఓ అమాయకుడికి శిక్ష పడకూడదన్న సిద్ధాంతం ఉంది. అందుకే నేరస్తుడు కేళ్ల ముందు నేరం చేసినా.. మన కళ్లు మనల్ని మోసం చేస్తాయని విచారణల పేరుతో ఏళ్ల తరబడి విచారణ కొనసాగిస్తూనే పోతున్నారు. భారతదేశంలో న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసుల సమస్య ఒక పెద్ద సవాలుగా 2025 సెప్టెంబర్ నాటికి 5.3 కోట్లు మించి పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇందులో 30 సంవత్సరాలకు పైగా పెండింగ్ ఉన్న కేసులు కూడా లక్షల్లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 86,700 కేసులు.. ఇందులో క్రిమినల్ , సివిల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 25 హైకోర్టుల్లో 63.3 లక్షల కేసులు పెండింగ్ లో ున్నాయి. అల్లాహాబాద్, పంజాబ్ & హర్యానా వంటి కోర్టులలో 60 శాతానికిపైగా కేసులు 3 సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. జిల్లా/సబార్డినేట్ కోర్టుల్లో 4.6 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 20 శాతానికిపైగా కేసులు 5 సంవత్సరాలకు పైగా కోర్చుల్లో ఉంటున్నాయి. అత్యంత సంచలనాత్మక నేరాలు కూడా ఎన్నో ఏళ్ల విచారణ తర్వాత సాక్ష్యాలు లేవన్న కారణంగా కొట్టివేతకు గురవుతున్నాయి. మరి నేరం ఎవరు చేశారన్నది కోర్టులు కూడా చెప్పలేకపోతున్నాయి. అలాంటప్పుడు ప్రజలకు నమ్మకం ఎలా కుదురుతుంది?. ఇక్కడ కోర్టుల్లో కేసులు పేరుకుపోవడానికి కారణం.. న్యాయవ్యవస్థది కాదు.. వ్యవస్థకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించని ప్రభుత్వాలదే. విచారణలు చేసేందుకు తగినంత మంది ఉంటే.. సమస్య రాదు.కానీ అలాంటి పరిస్థితులు లేవు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో న్యాయమూర్తుల కొరతపై అనే సార్లు స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయినా మార్పు రాలేదు.
ఇన్స్టంట్ జస్టిస్‌తో పెను ముప్పు !
ఇలాంటి ఇన్స్టంట్ జస్టిస్‌ను ప్రోత్సహిస్తే వచ్చే ముప్పు గురించి చాలా మందికి ఇంకా అర్థం కావడం లేదు. రేపు అది అరాచకానికి దారి తీస్తుంది. ఎవరూ కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్లిపోతుంది. ఇదెంత ప్రమాదకరమైన చర్యలో ఎవరూ ఊహించడం లేదు. ఈ పరిస్థితినే పోలీసులు రేపు అమాయకుల్ని వధించడానికి..వేధించడానికి వాడుకునే ప్రమాదం ఉంది. రాజకీయ నాయుకుల రాజకీయ ప్రత్యర్థుల్ని హతమార్చడానికి వాడుకోరనే గ్యారంటీలేదు. కుక్కను చంపేముందు పిచ్చిది అనే ముద్ర వేసినట్లుగా… ఇలా టార్గెటెడ్ వ్యక్తుల్ని చంపే ముందు నేరస్తుడనే ముద్ర వేసి పని పూర్తి చేస్తారు రాజకీయం ఇప్పుడు అంతా నేరగాళ్ల మయం. అన్ని వ్యవస్థలు పూర్తిగా నేరగాళ్ల గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయన్నమాట నిజం. ఆ పరిస్థితిని నిలువరించకపోతే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి పెనుముప్పు పొంచి ఉన్నట్లవుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. నేరస్తులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న అభిప్రాయాన్ని ప్రజలకు బలంగా కల్పించాలి. కానీ రాను రాను.. ఎలాంటి నేరం చేసినా తప్పించుకోవచ్చన్న భావన నేరస్తుల్లో పెరిగిపోతోంది. ఈ భావన వారిలో పెరగడంతో నేరాలు పెరగడానికి కారణం అవుతోంది. భారీగా ప్రచారం లభించే నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు ప్రజలు ఆవేశానికి లోను అవుతున్నారు. వాళ్లను జైళ్లలో పెట్టి మేపుతారా.. మళ్లీ బెయిల్ ఇచ్చి బయటకు పంపి.. మరిన్ని నేరాలకు కారణం అవుతారా అన్న ఆవేశానికి గురై.. అప్పటికప్పుడు ఎన్ కౌంటర్ డిమాండ్లు చేస్తున్నారు. ప్రజల నుంచి ఇలాంటి డిమాండ్లు ముందుగా రాకుండా చేయాలి అంటే.. అన్ని వ్యవస్థల్లోనూ పకడ్బందీగా మార్పులు రావాలి.
చట్టం పట్ల ప్రజల్లో గౌరవం – నేరస్తుల్లో భయం ఉండాలి !
ఓ సమాజం సుభిక్షంగా ఉండాలి అంటే.. ముందుగా నేరస్తులను కట్టడి చేయాలి. రాజకీయ ముగుసులో నేరాలను ప్రోత్సహించే వారినీ ఉపేక్షించకూడదు. పట్టపగలు హత్యాయత్నం చేసిన తర్వాత కూడా అతన్ని పోలీసులు స్టేషన్ బెయిల్ పై విడుదల చేస్తే ప్రజలు ఇక ఎలా తాము సురక్షితంగా ఉన్నామని భావించగలరు?. పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన వ్యక్తులు ..నెల తర్వాత నిర్భయంగా అదే ఊళ్లో కత్తులతో తిరుగుతూటే.. ఆ సమాజం సురక్షితంగా ఉన్నట్లా?. ప్రజలకు భరోసా వచ్చినట్లా?. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే.. ప్రజలు సత్వర న్యాయం కోరుతున్నారు. వారు చేస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్లుగా పోలీసులే శిక్షను అమలు చేసి.. హత్యలు చేసేయడం మాత్రం ఎంత మాత్రం సమర్థించే విషయం. వాళ్లు చేసిన నేరానికి.. వాడ్ని చంపడమే కరెక్ట్ అనుకునేవారు కూడా ఇలా పోలీసులు ఓ పద్దతి లేకుండా చంపడాన్ని హర్షించరు. ఏదైనా ఓ చట్టం ప్రకారం.. జరగాలని కోరుకుంటారు. అలాంటి ప్రాసెస్ జరుగుతుదంని భరోసా కలిగిన రోజున ఏ ఒక్క వ్యక్తి కూడా.. పోలీసులు ఎన్ కౌంటర్ల ద్వారా ఇన్ స్టంట్ జస్టిస్ ఇవ్వాలని కోరుకోరు. అలాంటి సమాజం మన దేశానికి.. మన రాష్ట్రానికి..వచ్చినప్పుడే ఇలాంటి మరణాలు ఆగుతాయి. లేకపోతే నేరం జరిగినప్పుడల్లా ప్రజాగ్రహాన్ని బట్టి శిక్షలు వేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి అరాచకానికి పునాది వేస్తుంది.
