“ఆధారాల్లేవు.. ఎలా నిరూపిస్తారు? “
అనే దబాయింపు ఇప్పుడు కొంతమంది నుంచి మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. తాము చేసిన దోపిడీ అంతా .. ఆధారాల్లేకుండా చేశామని .. సాంకేతికంగా తాము చేసింది దోపిడీ కాదని వారనుకుంటున్నారు. వ్యవస్థల రాడార్ నుంచి తప్పిచుకోగలమని వారు గట్టిగా అనుకుంటున్నారు. “ ప్రజలు అధికారం ఇస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్లే. ప్రజా ఆస్తులను, ప్రజల్ని, వారి ఆరోగ్యాలను, రక్తమాంసాలను పీల్చడానికి అవకాశం ఇచ్చినట్లే” అనుకునే రాజకీయ నేతలకు, అధికారం ఇచ్చేది కేవలం సేవ చేయడానికి మాత్రమేనని తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా శిక్షకు గురవుతారని తేల్చే వ్యవస్థలకు మధ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భీకర పోరాటం జరుగుతోంది. ఐదు సంవత్సరాల పాటు సాగిన దోపిడీ పాపాల పుట్ట ఇప్పుడు పగులగొట్టి దొంగల్ని వ్యవస్థల ముందు, ప్రజల ముందు నిలబెట్టాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ దొంగలు ఏమీ ఆషామాషీ కాదు. మీడియా, సోషల్ మీడియా తో పాటు బలమైన ధనబలంతో ఉన్న దొంగలు. తాము దోచుకున్నదాంట్లో ఎంతో కొంత పడేసి అయినా బయటపడాలనుకునేవాళ్లు. వాళ్లు నేరాల నుంచి ఎలా బయటపడతారో.. ఇప్పటికీ విచారణ దశకు కూడా రాని ఆర్థిక ఉగ్రవాదం కేసులు, కోర్టుల్లోనే నలిగిపోతున్న హత్య కేసులు నిరూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారు చేసిన దోపిడీలకు సంబంధించిన కొత్త కేసులు తెరపైకి వస్తున్నాయి. బలమైన ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల ముందు ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ సారి అయినా వ్యవస్థలదే పైచేయి అవుతుందా?. దోపిడీ దారులది అవుతుందా అన్నదే ఆ సందేహాల సారాంశం.
లిక్కర్ స్కాం – బహిరంగ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం. ఓ రాజకీయ నాయకుడు ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి రాకూడదని ఆలోచన ఇలా డబ్బులు దోచుకోవాలనుకోవడం. ఎందుకంటే ఈ లిక్కర్ అనేది మెజార్టీ కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. కానీ గెలవడానికి ముందే లిక్కర్ లో ఎలా డబ్బులు సంపాదించుకోవాలో మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని అధికారంలోకి రాగానే అమలు చేసేశారు. ప్రైవేటు దుకాణాలన్నింటినీ తీసేశారు. ప్రభుత్వ దుకాణాల పేరుతో మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు. దుకాణాలు వైసీపీ నేతల బిల్డింగ్లలో పెట్టారు. అందులో పని చేసే ఉద్యోగులు వైసీపీ కార్యకర్తలు. పూర్తిగా నగదు లావాదేవీలు. అసలు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్సే లేవు. ఇక మద్యం ఏమైనా వినియోగదారులు అడిగింది ఇచ్చేవారా అంటే.. అలాంటి చాయిస్సే లేకుండా చేశారు. మందుబాబులు నీదే బ్రాండ్..నీదే బ్రాండ్ అని పలకరించుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఏ బ్రాండ్ చాయిస్ లేకుండా.. తాము తెచ్చిందే బ్రాండ్ అన్నట్లుగా అలవాటు చేశారు. ఆ బ్రాండ్లు తయారు చేసేది వైసీపీ నేతలు. రవాణా చేసేది వైసీపీ నేతలు. అమ్మేది వైసీపీ కార్యకర్తలు. ఇలా ప్రతి అడుగులోనూ వైసీపీ కార్యకర్తల గుప్పిట్లో పెట్టుకున్నారు.” పార్టీ, ప్రభుత్వం రెండూ ఒక్కటే” అని సజ్జల రామకృష్ణారెడ్డి ఓ సారి పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వం పేరుతో నిర్వహించడంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా చెప్పారు. దాన్ని అన్ని చోట్లా పాటించారు. పార్టీ ప్రభుత్వం రెండూ ఒక్కటేనని.. లిక్కర్ స్కాంలోనూ నిరూపించారు. ఇటీవల కూడా.. వైసీపీ పాలసీ ప్రకారమే మద్యం విధానం ఉందని సమర్థించుకున్నారు. ఆయన మాటలతోనే తేలిపోయింది . ఇదంతా వైసీపీ దోపిడీకి తెచ్చుకున్న పాలసీ అని. దాన్ని సమర్థించుకోవడానికి విచిత్రమైన వాదనలు చేస్తున్నా.. డబ్బులు విపరీతంగా దోచుకున్నారన్నదానికి స్పష్టమైన ఆధారాలు కళ్ల ముందు ఉన్నాయి.
నోట్ల కట్టలతో కరాళ నృత్యం
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కొన్ని వందల మందికి డిజిటల్ కార్పొరేషన్ , ఫైబర్ నెట్, ఆర్టీజీఎస్ పేరుతో జీతాలు చెల్లించేవారు. అంతే కాదు..కొన్ని వేల మందికి కూడా డబ్బులు నగదు రూపంలో చెల్లించేవారు. వారందర్నీ కొన్ని మద్యం దుకాణాలకు అటాచ్ చేశారు . వారంతా నెల వారీగా అక్కడికి వెళ్లి డబ్బులు తెచ్చుకునేవారు. ఎన్నికలకు ముందు రెండేళ్ల నుంచి సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లకు పందేరం ప్రారంభించారు. అందరికీ నగదు రూపంలోనే ఇచ్చేవారు. వారి దగ్గర డబ్బులు ఎంత ఎక్కువగా ఉండేవంటే.. పోలింగ్ కు రెండు రోజుల ముందు కూడా హైదరాబాద్లో కనీసం వంద మంది డిజిటల్ క్రియేటర్లకు లక్షల్లో డబ్బులు పంపిణీ చేశారు. ఇలా డబ్బులు తీసుకున్న వారంతా తమ శక్తి మేర సర్వేలు ప్రచురించి.. వైసీపీ విజయం సాధిస్తుందని ప్రచారం చేశారు. పోలింగ్ ముందు ఇలా విచ్చలవిడిగా పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. కానీ వారి దగ్గర నోట్ల కట్టలు అలా పేరుకుపోయి ఉన్నాయి. వదిలించుకోవాలనుకున్నారు. పంచేశారు. ఇది వారు చేసిన అవినీతిలో అర పర్సెంట్ కూడా ఉండదు. బయటకు తెలిసింది చాలా తక్కువ. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుల ఫోన్ల నుంచి రీట్రీవ్ చేసిన వీడియోలను .. గదుల నిండా డబ్బుల కట్టలు ఎలా పేర్చారో చూస్తే కళ్లు తిరిగిపోవడం ఖాయం. దోపిడీ జన్మహక్కు అనుకునేలా సాగిన పరిపాలనలో ఇప్పుడు పాపాల పుట్ట రగులుతోంది. ముందుగా ప్రజల ఆస్తులను, ప్రాణాలను, ఆరోగ్యాలను సైతం దోచేసిన లిక్కర్ స్కాంను ప్రభుత్వం బయట పెట్టాలనుకుంది. ఈ విషయంలో వారు చేసిన దోపిడీ బహిరంగం. మద్యం అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో స్పష్టత ఉంది. తమ రక్త మాంసాలను గత పాలకులు ఎలా దోచారో వారికి అర్థమయింది. అందుకే లిక్కర్ స్కామ్ విషయంలో ఇంకా దూకుడుగా చర్యలు తీసుకోవాలన్న ప్రజాభిప్రాయమే వినిపిస్తోంది కానీ.. ఎక్కడా కక్ష సాధింపు అనడం లేదు.
నిరూపించలేరని దొంగల ధీమా
“ఎలా నిరూపిస్తారు?” అని.. కుట్రల సిద్దాంతకర్త, తిమ్మిని బమ్మిని చేయడంలో తన కంటే దిట్ట లేరని అనుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. నేరం చేయలేదని.. దోపిడీ జరగలేదని ఆయన గట్టిగా చెప్పడం లేదు. ఎలా నిరూపిస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలపై ఆయనకు ఉన్న నమ్మకం అలాంటిది. ఎందుకంటే.. ఆయన నాయకుడు జగన్ రెడ్డి .. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడే ప్రజా ఆస్తులను కార్పొరేట్ కంపెనీలను తన సొంత ఆస్తులుగా కట్టబెట్టి.. పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ కేసులు ట్రయల్ కు రాలేదు. వివేకానందరెడ్డిని అత్యంత ఘోరంగా నరికి చంపి, గుండెపోటు, రక్తపు వాంతులు అని నమ్మించే ప్రయత్నం చేసి..చివరికి దొరికిపోతే.. నారాసుర చరిత్ర అని పేపర్లో రాయించేసి.. బ్యాలెన్స్ చేయించేసిన రికార్డు వారి సొంతం. నిందితుడ్ని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు వస్తే.. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో దాక్కుని చుట్టూ మనుషుల్ని పెట్టించి.. పోలీసుల్ని సైతం నిందితులకు మద్దతుగా మార్చిన ఘోరమైన క్రిమినల్ నైజం వారిది. చీఫ్ జస్టిస్ కావాల్సిన న్యాయమూర్తి కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు ఆరోపణలతో లేఖలు రాసి.. వాటిని మీడియా ముందు ప్రచారం చేశారు. అదంతా కుట్ర పూరితం అయినా ఏమీ చర్యలు తీసుకోలేకపోయిన వ్యవస్థలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వారు అనుకుంటారు. అందుకే .. ఎలా నిరూపిస్తారని.. సజ్జల దబాయిస్తున్నారు. యాభై, అరవై రోజులు జైల్లో ఉండి బయటకు వస్తారు. తర్వాత అంతా కామన్ అని అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ జరిగింది ఇదే కాబట్టి అదే వారి ధైర్యం. కానీ అన్నింటితో పోలిస్తే.. ఈ లిక్కర్ స్కాం భిన్నమైనదే. ఇలాంటి కేసులపై వ్యవస్థలు కూడా సీరియస్ గా లేకపోతే.. ప్రతి ప్రభుత్వానికి.. అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీలకు ఓ కేస్ స్టడీ అవుతుంది. అలా సంపాదించుకోవడం ..చట్టబద్ధమే అన్న అభిప్రాయానికి వస్తారు. అప్పుడు జరిగే పరిణామాలు ఊహించడం కష్టమవుతుంది.
అసలే దోపిడీ మనస్థత్వం పైగా అధికారం
ప్రస్తుతం లిక్కర్ స్కామ్ జరిగిన వైనం చూస్తే ఓ క్రిమినల్, మాఫియా నెట్ వర్క్ నుంచి ఇంత పకడ్బందీగా నిర్వహించవచ్చా అని.. ఇలాంటి ఆర్థిక నేరాల్లో పండిపోయిన దర్యాప్తు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వారు కూడా గుర్తించలేని వ్యవహారాలు ఇంకా ఎన్నో ఉండే ఉండి ఉంటాయి. కానీ గుర్తించినంత వరకూ చూస్తే.. ఇంత డెకాయిట్ గ్యాంగ్ చేతిలోకి అధికారం, వ్యవస్థలు వస్తే ఎవరు మాత్రం ఆపగలరు…? . కానీ ఎల్ల కాలం అధికారంలో ఉంటామన్న ఉద్దేశంతో పట్టపగలు చేసిన దోపిడీ బట్టబయలు అయింది. ఇప్పటికి చాలా పాత్రధారుల్ని ఆజ్ఞాతంలోకి పంపారు. అందర్నీ లాక్కొచ్చే ప్రయత్నాలను సిట్ చేస్తోంది. అదే సమయంలో స్కామ్ సూత్రధారిని కూడా పకడ్బందీగా వ్యవస్థల ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. అసలు దోషి తప్పించుకుంటే.. దర్యాప్తునకు అర్థమై ఉండదు. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థలు కానీ.. ఇతర వ్యవస్థలు కానీ చూడాల్సింది ఒక్క ఆర్థికపరమైన దోపిడీ మాత్రమే కాదు.. అసలు చూడాల్సింది.. ప్రజా ఆరోగ్యాలను దోపిడీ చేయడం. చీప్ లిక్కర్ ను అత్యధిక రేట్లకు అమ్మి.. వారి జీవితాలను గుల్ల చేశారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. 2019-24 మధ్య కాలంలో ప్రభుత్వం అమ్మిన లిక్కర్ వల్ల ఎంత మంది ఆరోగ్యాలను పాడు చేసుకున్నారో లెక్కలు ఉన్నాయి. గతంతో పోలిస్తే భారీగా పెరిగిన లివర్ డిసీజెస్ లాంటి మద్యం కారణమైన వ్యాధులు విపరీతంగా పెరగడం, వరాంతా రాష్ట్రం అమ్మిన మద్యం తాగిన వారే కావడం మించిన సాక్ష్యాలు ఇంకేమీ ఉండవు. ఇలాంటి దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరగనిది. అందుకే.. ఆధారాలు ఉండవని.. ఎవరూ నిరూపించలేరని.. దోపిడీ దారులు, నేరస్తులు విర్రవీగుతున్నారు.
వ్యవస్థల పవర్ చూపించగలుగుతాయా ?
కారణం ఏదైనా వ్యవస్థలపై ప్రజల్లో క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోంది. చిన్న దొంగతనం చేసిన వారిని అత్యంత హీనంగా చూసే వ్యవస్థలు..ప్రజలు.. పెద్ద పెద్ద లూఠీలు చేసిన వారిని హీరోల్లా చూస్తోంది . వారి కోసం చట్టాల్లో ఉన్న లొసుగులన్నీ బయటకు వస్తున్నాయి. వారు స్వేచ్చగా మళ్లీ మళ్లీ దోపిడీలు చేసుకుంటున్నారు. ఇది అంతిమంగా .. సమాజానికి, దేశానికి , ప్రజలకు నష్టం చేస్తోంది. ఇలాంటి ఉత్పాతాల నుంచి రక్షించడానికే బలమైన వ్యవస్థలను రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థలు విఫలం అయితే.. దోపిడీనే చట్టబద్ధం అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన లిట్మస్ టెస్ట్ ఇప్పుడు వ్యవస్థలకు ఎదురయింది. వచ్చే ఫలితాన్ని బట్టే భారత భవిష్యత్ రాజకీయ నాయకత్వం అడుగులు ఉంటాయి. అది మంచి వైపా ? ముంచే వైపా ?