తెనాలి పోలీసులు ముగ్గురు యువకుల్ని పట్టుకుని నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ఇచ్చారు. దాన్ని వారే వీడియోలు తీయించారు. అవి బయటకు వచ్చాయి. వైరల్ అయ్యాయి. దీంతో రకరకాలుగా స్పందించడం ప్రారంభించారు. వీడియోల్లో పోలీసులు కొట్టడం మాత్రమే ఉంది. కానీ వాళ్లెందుకు కొట్టారు ?. ఆ యువకులు ఎవరు? ఏం చేశారన్నది బయటకు రాలేదు. అందుకే చాలా మంది పూర్తి వివరాలు తెలియకుండా సోషల్ మీడియాలో స్పందించడం ప్రారంభించారు.
వాళ్లు రౌడీలు -గంజాయి బానిసలు – పోలీసులపైనే దాడి చేసిన వాళ్లు !
తెనాలి ఐతానగర్ లో గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉంది. వారు రౌడిషీటర్లుగా ముదిరిపోతున్నారు. సామాన్యులపై దాడులు చేయడం.. దోపిడీలు చేయడం ప్రారంభించారు. చివరికి పోలీసుల్ని కూడా లెక్క చేయడం లేదు. నాలుగు రోజుల కిందట ఈ గంజాయి బ్యాచ్ నేరుగా ఓ పోలీస్ కానిస్టేబుల్ పైనే దాడి చేశారు. వారు దాడిచేసింది వ్యక్తిపై కాదు..నేరుగా వ్యవస్థపై ఇలాంటి సమయంలో మరోసారి అలాంటి పనులు చేయాలనుకునే వారికి వణుకుపుట్టేలా పోలీసులు స్పందించాలని అనుకున్నారు. దానికి వారు ఎంచుకున్న మార్గమే వైరల్ వీడియో.
రౌడీలను దారిలో పెట్టే మార్గం అదేనా ?
అయితే వారు ఏం చేసినా అయినా ఉండవచ్చు కానీ ఇలా థర్డ్ డిగ్రీని రోడ్డుమీద ప్రయోగించడం ఏమిటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వారు రౌడీలు, గంజాయి బానిసలే కావొచ్చు కానీ అలా కొట్టే హక్కు పోలీసులకు లేదని చెబుతున్నారు. కానీ వారు పోలీస్ కానిస్టేబుల్ ను కొట్టారు. వారికి ఆ హక్కు ఉంటుందా అన్న ప్రశ్న ఇతర వర్గాల నుంచి వస్తుంది.దానికి చట్టాలున్నాయని అంటారు. అన్నింటినీ చట్టాలతో డీల్ చేయాలంటే పోలీస్ స్టేషన్ పట్టదు. పోలీస్ పవర్ తో కొంత వరకూ కంట్రోల్ చేయాలి. పోలీసుల భయం ఉండాలి.అప్పుడే నేరాలు కాస్త తగ్గుముఖం పడతాయి. చట్టాలు ఉన్నది నేరస్తుల్లో భయం కల్పించడానికే. పోలీసులు కూడా ఆ భయాలను తప్పు చేయాలనుకున్న వారిలో మరింత ఎక్కువగా కల్పించాలి. తెనాలి పోలీసులు అదే చేశారని కొందరు ప్రశంసిస్తున్నారు .
రౌడీలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్కవుట్ అవదు !
తెనాలి పోలీసులు తప్పు చేశారా..ఒప్పు చేశారా అన్నది ఎవరూ తేల్చలేరు. కానీ ఆ రౌడిషీటర్లకు భయం లేకపోతే రేపు ఎంత మంది ..ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడతాయో చెప్పాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రౌడీలకు ఆ మాత్రం భయం ఉండాలన్న అభిప్రాయం మెజార్టీ లో ఉంది. కానీ రౌడీలకు కులం , మతం తొడిగి మద్దతిస్తే రేపు వాళ్లు మద్దతిచ్చిన వారినే కాటేస్తారు.