పెద్ద నోట్ల రద్దుతో చిత్రసీమ సతమతమవుతున్న తరుణంలో తన సినిమాని రిలీజ్ చేసి పెద్ద సాహసమే చేశాడు.. నిఖిల్. ఎక్కడికి పోతావు చిన్నవాడా రిలీజ్ డేట్ బయటకు వచ్చినప్పుడు ‘నిఖిల్ బుక్కయిపోయాడు’ అనుకొన్నారంతా. ఎందుకంటే అప్పుడు జనాలు థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తారన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. అయితే ఆ అనుమానం పటాపంచలు చేస్తూ బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు అందుకొంటోందీ చిత్రం. అంతేకాదు.. నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గానూ నిలిచింది. ఇప్పటి వరకూ రూ.14 కోట్ల వరకూ షేర్ సంపాదించి ట్రేడ్ పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ.. ఈ సినిమాకి వసూళ్లు బాగానే ఉన్నాయి. ఈ వారం భేతాళుడు, మన్యం పులి సినిమాలొస్తున్నాయి. రెండూ డబ్బింగ్ బొమ్మలే. భేతాళుడు నుంచి వచ్చే పోటీ తట్టుకోగలిగితే.. ఈవారం కూడా ఈ చిన్నోడికి ఎదురులేకపోవొచ్చు.
ఎలాగైనా సరే.. నిఖిల్ సినిమా రూ.20 కోట్లు కొట్టి తీరుతుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈయేడాది విడుదలైన చిన్న సినిమా.. పెళ్లిచూపులు కంటే ఇది పెద్ద విజయం అనుకోవాలి. అయితే పెళ్లిచూపులు బడ్జెట్ చాలా తక్కువ. ఎక్కడికిపోతావు చిన్నవాడాతో కంపేర్ చేస్తే.. లాభాల పరంగా పెళ్లిచూపులే మొదటి స్థానం లో ఉంటుంది. పెళ్లి చూపులు సినిమాకి దాదాపుగా రూ.14 కోట్ల వరకూ వసూళ్లు అందాయి. అయితే పెట్టుబడి కోటి రూపాయలలోపే. ఎక్కడికి పోతావు కోసం రూ.6.5 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. ఆ లెక్కన చూస్తే.. పెళ్లి చూపులకే లాభాలు భారీగా వచ్చినట్టు. అయితే క్లిష్టపరిస్థితుల్లో సినిమాని రిలీజ్ చేసి, ఈ స్థాయి వసూళ్లు దక్కించుకొన్నాడంటే నిఖిల్ గ్రేటే. ఈ హిట్ తనకే కాదు.. రిలీజ్ చేయాలా, వద్దా అని తలలు పట్టుకొంటున్న చాలామంది నిర్మాతలకు నమ్మకాన్ని ఇచ్చింది.