తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం ఇంకా తేల్చుకోలేకపోతోంది. సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలిన తర్వాత .. వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. కానీ అత్యున్నత న్యాయస్థానంలోనే ఊరట లభించకపోతే ఇక ఏ మార్గం ఉంటుందన్నది మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. కేబినెట్ సమావేశంలో రేవంత్ రెడ్డి న్యాయనిపుణులు సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. రెండు రోజుల్లో వారు నివేదిక ఇవ్వాలని ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
రిజర్వేషన్లు ఓ పద్మవ్యూహం – బయటకు రావాల్సిందే !
బీసీ రిజర్వేషన్లు అనే పరిష్కారం తెలియని సమస్యలో తెలంగాణ లోకల్ పోల్స్ ను పెట్టేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమస్యను ఎంత వేగంగా పరిష్కరించుకుంటే రాజకీయంగా అంత మంచిది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు కానీ.. దానికి రాజ్యాంగపరమైన మార్గాలు లేవు. ఎలాగోలా న్యాయపరమైన లొసుగులను అడ్డం పెట్టుకుని నిర్వహించడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. ఓ రకంగా ఇప్పుడు పద్మవ్యూహంలో ఇరుక్కున్నారు.
స్థానిక ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే అంత నష్టం
కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే అంత నష్టం జరుగుతుంది. అందులో సందేహం లేదు. ప్రభుత్వం ఏర్పడిన నాలుగైదు నెలల నుంచి వచ్చే నెట్ లోకల్ పోల్స్ అని ప్రచారం చేస్తూ వస్తున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసి చాలా కాలం అయింది. గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీ కాలం కూడా వచ్చే ఫిబ్రవరిలో ముగిసిపోతుంది. అంటే ఇక తెలంగాణలో స్థానిక ప్రతినిధులే లేకుండా పోతారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావు. రాజకీయంగానూ తమ పార్టీ నేతలు ఎన్నికల కోసం ఖర్చులు పెట్టుకుంటూనే ఉండాల్సి వస్తోంది. పదవులు రాని వారిలో అసహనం పెరుగుతోంది. ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే తమకు నష్టమని వారు ఆందోళన చెందుతూ ఉంటారు.
పార్టీ పరంగా రిజర్వేషన్లు తప్ప మరో మార్గం లేదు !
పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం తప్ప మరో మార్గం ప్రభుత్వానికి లేదు. కోర్టులో తేలే వరకూ ఎన్నికలు నిర్వహించకూడదని నిర్ణయించుకుంటే అది మంచి వ్యూహం అనిపించుకోదు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ల అంశం.. రాజ్యాంగపరంగా పార్లమెంట్ లోనే తేలాల్సి ఉందని ఎక్కువ మంది అభిప్రాయం. రేవంత్ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.